– కుటుంబానికి రూ. 2 లక్షల రుణమాఫీ…
– మాజీ మంత్రి మండవ..
నవతెలంగాణ – డిచ్ పల్లి
కుటుంబం యూనిట్ గా రూ. 2 లక్షల రుణమాఫీని కాంగ్రెస్ ప్రభుత్వం తప్పక చేస్తుందని, అర్హులైన రైతులందరికీ మాఫీ అవుతుందని, రైతన్నలు ఏలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు అన్నారు. డిచ్ పల్లి మండలంలోని ధర్మారం(బీ)లోని తన స్వగృహంలో శనివారం మండవ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అర్హత ఉన్న రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ అవుతుందని రైతు పక్షపాతిగా, నాయకుడిగా, స్వయంగా రైతుగా ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. రైతాంగం ఎదురు చూస్తున్న కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు రూ.31 వేల కోట్లు రుణమాఫీ చేస్తుందన్నారు. తొలి విడతలో రూ. లక్ష, రెండో విడతలో లక్షన్నర, మూడో విడతలో రూ.2 లక్షలు మాఫీ అవుతాయన్నారు. మొదటి విడత జాబితాలో పేర్లు లేని రైతులు ఆందోళన చెందవద్దన్నారు. కొందరు రైతులు స్వయంగా తనను కలవడంతో ఏవోలు, తహసీల్దార్లు, సొసైటీ అధికారులు, బ్యాంకర్లతో మాట్లాడినట్లు చెప్పారు. జాబితాలో పేరు లేని రైతులు తమ ఆధార్ కార్డు, పట్టాపాసు పుస్తకం తీసుకుని ఏఈవోలకు వద్దకు వెళ్లి సమాచారం తెలుసుకోవాలని సూచించారు. కొన్ని సాంకేతిక సమస్యలతో రైతుల ఖాతాల్లో డబ్బులు పడలేదన్నారు. ఆధార్లో, పట్టా పాసు పుస్తకంలో రైతు పేరు వేర్వేరుగా ఉండటం సమస్యగా మారిందన్నారు. కుటుంబం యూనిట్గా రూ.2 లక్షల రుణాన్ని ప్రభుత్వం మాఫీ చేస్తుందనే విషయాన్ని రైతులు గమనించాలన్నారు. కుటుంబంలో ఇద్దరికి రూ. లక్షకు పైగా ఉంటే రెండో విడతలో, అంతకు మించి ఉంటే మూడో జాబితాలో వర్తిస్తుందని రైతులు ఆవేదన చెందవద్దని హితవు పలికారు. రైతులు విజ్ఞతతో వ్యవసాయశాఖ అధికారుల వద్దకు వెళ్లాలని సూచించారు. ధరణిలో పేరు సరి చేసుకునేందుకు కలెక్టర్ స్థాయిలో అవకాశం ఉందని చెప్పారు. రేషన్కార్డు లేని రైతుల వివరాలు ప్రభుత్వం సేకరించిందన్నారు. అర్హులకు మాఫీ వర్తిస్తుందన్నారు. మొదటి జాబితాలో పేరు రాని రైతులు ముందుగా ఏఈవోలను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవాలన్నారు. ఆలోచనతో వ్యవహరించి ప్రభుత్వ రుణమాఫీని సద్వినియోగం చేసుకోవాలని మండవ సూచించారు.