రైతులు ఆందోళన చెందొద్దు

– డీలర్ల వద్ద సాగుకు సరిపడ విత్తనాలు
– నకిలీ విత్తనాలపై గట్టి నిఘా…టాస్క్‌ఫోర్స్‌ తనిఖీలు
– అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు
– వారం రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి
– విలేకర్ల సమావేశంలో జిల్లా కలెక్టర్‌ క్రాంతి వల్లూరు
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
విత్తనాల కోసం రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదని, జిల్లాలో వివిద పంటల సాగు విస్తీర్ణానికి సరిపడ విత్తనాలు డీలర్ల వద్ద అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్‌ క్రాంతి వల్లూరు అన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లాలో పచ్చిరొట్ట విత్తనాల కోసం రైతులు అక్కడక్కడ ఇబ్బందులు పడుతున్నారని, ఎన్నికల కోడ్‌ వల్ల ఇతర రాష్ట్రాల నుంచి జీలుగ, జనుము వంటి విత్తనాలు రావడంలో ఆలస్యమైందన్నారు. జిల్లాకు 5881 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు కావాలని ప్రతిపాదనలు పంపగా ఇప్పటికే 3 వేల క్వింటాళ్ల విత్తనాల్ని రైతులకు పంపిణీ చేశామన్నారు. మరో రెండు వేల క్వింటాళ్ల విత్తనాలు రెండు మూడు రోజుల్లో రైతులకు అందుబాటులోకి వస్తాయన్నారు. గతేడాది 5 వేల క్వింటాళ్ల విత్తనాలు జిల్లాకు రాగా ఈ ఏడాది అదనంగా 881 క్వింటాళ్ల విత్తనాలు తెప్పిస్తున్నామన్నారు. 3.60 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు అయ్యే అవకాశమున్నందున జిల్లాకు 7.20 లక్షల పత్తి ప్యాకెట్‌ విత్తనాలు అవసరముందన్నారు. ఇప్పటికే 3.76 లక్షల విత్తన ప్యాకెట్లు జిల్లాకు వచ్చాయన్నారు. మరో 3 లక్షల ప్యాకెట్లు రెడు మూడు రోజుల్లో జిల్లాకు రానున్నాయని పేర్కొన్నారు. పత్తి విత్తనాల విషయంలో కల్తీవి విక్రయిస్తే సంబంధిత డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వం గుర్తించిన విత్తన కంపెనీలకు చెందిన విత్తనాల్ని మాత్రమే కొనుగోలు చేయాలని, లూస్‌ విత్తనాలు కొని రైతులు నష్టపోవద్దని సూచించారు. జిల్లాలో కల్తీ విత్తనాలను అరికట్టేందుకు గట్టి నిఘా ఉందన్నారు. బయటి రాష్ట్రాల నుంచి కల్తీ విత్తనాలు రాకుండా చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు చేస్తున్నామన్నారు. టాస్క్‌ఫోర్స్‌ బృందాలు జిల్లాలో తనిఖీలుఉ నిర్వహిస్తున్నాయన్నారు. రైతులు సైతం విత్తనాలు కొనుగోలు చేసే విషయంలో పలు జాగ్రతలు పాటించాలన్నారు. ఎంఆర్‌పీ ధరకు మాత్రమే కొనాలని, రసీదు తప్పని సరిగా తీసుకోవాలన్నారు. పత్తి రకం, అలాట్‌ నెంబర్‌, ప్రభుత్వ ముద్ర వంటివి తప్పని సరిగా సరిచూసుకోవాలన్నారు. అదే విధంగా జిల్లాలో 1.41 లక్షల ఎకరాల్లో వరి సాగు కానుందన్నారు. అందుకు సరిపడ విత్తనాలున్నాయన్నారు. కందులు 70 వేల ఎకరాల్లో మొక్కజొన్న 11250 ఎకరాల్లో మినుములు 4506 ఎకరాల్లో జొన్న, చెరకు, ఆలుగడ్డ, అల్లం, జీలుగ, సోయాబీన్‌ వంటి పంటలు సాగుకానున్నాయన్నారు. పంటల సాగుకు సరిపడ విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు.
నాలుగు రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి
జిల్లాలో యాసంగీ సీజన్‌ ధాన్యం కొనుగోళ్లు మరో నాలుగు రోజుల్లో పూర్తవుతుందని కలెక్టర్‌ క్రాంతి వల్లూరు అన్నారు. 211 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు నిర్వహించామన్నారు. ఇప్పటికే 90 శాతం ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యిందన్నారు. సివిల్‌ సప్లయి, డీఆర్‌డీఎ, పీఎసీఎస్‌ల సమన్వయంతో ధాన్యం కొనుగోళ్లు పూర్తి కావస్తున్నాయన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయబడుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 227 కోట్ల ధాన్యం డబ్బుల్ని రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ మధూరి, జిల్లా వ్యవసాయ అధికారి నర్సింహరావు, డీఆర్‌ఓ పద్మజారాణి పాల్గొన్నారు.