– గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసిన రైతులు
నవతెలంగాణ-కూసుమంచి
పాలేరు పాత కాలువకు అధికారులు సాగునీటిని నిలుపుదల చేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని పాలేరు రిజర్వాయర్ సమీపంలో ఆదివారం రైతులు ఖమ్మం- సూర్యాపేట ప్రధాన రహదారిపై బైటాయించి ఆందోళనకు దిగారు. రైతులే స్వయంగా పాలేరు రిజర్వాయర్ గేట్లను ఎత్తి కాలువకు నీటినీ విడుదల చేశారు. పాలేరు ఆయకట్టు పాత కాలువ పరిధిలో రబీలో సాగు చేసిన చెరకు, వరి పంటలు ఎండిపోతుండటంతో ఇటీవల రైతులు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని మూడు తడులు సాగునీటిని విడుదల చేయాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. కానీ జలాశయం డెడ్ స్టోరేజ్ 10.60 అడుగులకు చేరుకోవడంతో ఉన్నతాధికారులు నీటిని విడుదల చేయలేదు. శుక్రవారం మధ్యాహ్నం సాగర్ జలాలు పాలేరుకు చేరుకోవడంతో ఎండుతున్న పంటలను కాపాడటానికి రైతులు పాత కాలువ గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. విషయం తెలుసుకున్న నీటిపారుదల శాఖ అధికారులు నీటి విడుదలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దాంతో రైతులు, అధికారులకు మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. తాగునీటి ఎద్దడి కోసం మాత్రమే రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేశామని అధికారులు రైతులకు చెప్పుకొచ్చారు. నీటి విడుదల చేసి తమను ఆదుకోవాలని రైతులు ఆందోళనకు దిగారు. ఇప్పటికైనా సాగునీటిని నెల రోజులపాటు అందించాలని రైతుల పక్షాన మాజీ సీడీసీ చైర్మెన్ జూకురి గోపాలరావు అధికారులను కోరారు.