రాబోయే ఎన్నికల్లో గెలవడానికి రాజకీయ ప్రధాన పార్టీలన్నీ ఉచితాల పేరుతో అనేక హామీలు ఇస్తున్నాయి కానీ దేశానికి అన్నంపెట్టే రైతన్నలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. గెలవకముందు అన్నీ తామై చూసు కుంటామని నమ్మబలికి గద్దెనెక్కిన తర్వాత కార్పొరేట్ల సేవలో తరిస్తున్నారు. వారు అడగకపోయినా పారిశ్రామికవేత్తలకు రుణమాఫీలు చేస్తున్నారు. అదే రైతులకు పండించిన పంటలకు కనీసం గిట్టుబాట ధరలు కూడా కల్పించడం లేదు. ఇదేనా దేశం అభివృద్ధి పథంలో పయనించడమంటే? పేదలకు రుణమాఫీ చేయడానికి నిధులు లేవని సాకులు చెబుతారు. అందరికీ రుణమాఫీ చేస్తే ప్రభుత్వం సంక్షోభంలో చిక్కుకుంటుందని భయపెడతారు. అలాంటప్పుడు సామాన్యుల దగ్గరికి ఎందుకు రావడం ఓట్లడగడానికి? అదే కార్పొరేట్ల దగ్గరికి వెళ్లొచ్చు కదా! కేంద్రం పీఎమ్ కిసాన్ యోజన రైతులకోసమేనని చెబుతోంది. మరీ దేశవ్యాప్తంగా రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి? 2014నుంచి దేశ వ్యాప్తంగా ఇప్పటివకు ఒక లక్షా 474మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారని జాతీయ నేర రికార్డు బ్యూరో పేర్కొంది. దీని ప్రకారం గత తొమ్మిదేండ్లలో రోజుకు సగటున సుమారు 30మంది రైతులు దేశంలో ఆత్మహత్యలు చేసుకున్నారు. దీనికేం సమాధనం చెబుతారు? మహారాష్ట్రలో నాసిక్ నుంచి ముం బాయి వరకు ఆలిండియా కిసాన్ సభ ఆధ్వర్యంలో రైతులు లాంగ్ మార్చ్ చేస్తే 2018లో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 24 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసింది.అలాంటి ఉద్యమాలు దేశవ్యాప్తంగా రావాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని ఢిల్లీ నడివీధుల్లో రైతు ఉద్యమం కొనసాగు తోంది. ఎన్నికల్లో గెలిపించాలని తమ దగ్గరికి వచ్చే నాయకులను గతంలో ఇచ్చిన హామీల గురించి నిలదీయాలి. రైతుల అంశమే ప్రధాన ఎజెండాగా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాలని డిమాండ్ చేయాలి.
– బి.బి.రామకృష్ణారావు