అనతి కాలంలోనే రైతు రుణమాఫీ

అనతి కాలంలోనే రైతు రుణమాఫీ– నర్సంపేట నియోజకవర్గానికి త్వరలో అభివృద్ధి ఫలాలు
– దేశంలో రాబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే..: వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు
నవతెలంగాణ-దుగ్గొండి
కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీల పథకంలో భాగమైన రూ. 2 లక్షల రుణమాఫీని అనతి కాలంలోనే మాఫీ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు భరోసా ఇచ్చారు. వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండలం గిన్నిబావిలో జరిగిన కాంగ్రెస్‌ పార్టీ మహబూబాబాద్‌ పార్లమెంటరీ నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీని ఓర్వలేక ఇటు బీఆర్‌ఎస్‌ పార్టీ, అటు బీజేపీ.. ప్రభుత్వంపై బురద చల్లుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నర్సంపేట నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని తెలిపారు. కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రాబోతున్నదని భరోసా కల్పించారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో మహబూబాబాద్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి బలరాం నాయక్‌ను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. మహబూబాబాద్‌ పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి కోరిక బలరాం నాయక్‌ మాట్లాడుతూ.. యూపీఏ ప్రభుత్వ హయాంలో నర్సంపేట నియోజకవర్గాన్ని ప్రత్యేక నిధులు కేటాయించి జాతీయ రహదారులతో అభివృద్ధి చేశామని తెలిపారు. తనపై నమ్మకంతో ఓటు వేసి గెలిపిస్తే.. సేవకుడిలా పని చేస్తానని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి మాట్లాడుతూ.. నర్సంపేట నియోజకవర్గంలోని ప్రజలందరికీ ఇందిరమ్మ ఫలాలను అందించే బాధ్యత తనదేనని అన్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేసిందన్నారు. ఎన్నికల కోడ్‌ అనంతరం అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇండ్లు నిర్మించి ఇస్తామని భరోసా కల్పించారు. సమావేశంలో నర్సంపేట బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు తోకల శ్రీనివాస్‌ రెడ్డి, కాంగ్రెస్‌ మండల పార్టీ అధ్యక్షులు ఎర్రెల బాబు, నర్సంపేట నియోజకవర్గం కన్వీనర్‌, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి తక్కల్లపల్లి రవీందర్‌ రావు, టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్‌, సొంటి రెడ్డి రంజిత్‌ రెడ్డి, పాల్వాయి శ్రీనివాస్‌, మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ వేముల సాంబయ్య గౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.