– బీజేపీ, బీఆర్ఎస్లపై కోమటిరెడ్డి ఆగ్రహం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ల దుష్ట రాజకీయ పన్నాగాలకు రైతులు బలవుతున్నారని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. అసలే వర్షాలు లేకపోవడంతో రైతులు తీవ్రమైన బాధలో ఉన్నారని తెలిపారు. స్వార్ధరాజకీయాల కోసం ఆ పార్టీలు రైతుల నోటికాడ బుక్కను లాక్కున్నాయని విమర్శించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఖజానాలో రూపాయి లేకుండా చేసిందని విమర్శించారు. రూపాయి రూపాయి కూడబెట్టి తమ ప్రభుత్వం రైతుభరోసా (రైతుబంధు) వేస్తే, బీజేపీ కుటిల రాజకీయం చేసి అడ్డుకున్నదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన సమయానికి రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసిందని గుర్తు చేశారు. రైతులంతా తమ అకౌంట్లలో డబ్బులు పడుతున్నాయని సంతోషపడే లోపే… ఈసీని అస్త్రంగా చేసుకుని నిధులను ఆపేలా కుట్ర చేసిందని పేర్కొన్నారు. మొదటి నుంచి బీజేపీకీ అన్నదాతలు అంటే అక్కసు, ఆగ్రహం… అందుకే నల్ల చట్టాలు తెచ్చి రైతులను నట్టేట ముంచే ప్రయత్నం చేసిందని గుర్తు చేశారు. ఆ చటాలకు వ్యతిరేకంగా పోరాడిన వందలాది రైతులను పొట్టన పెట్టుకుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పుడు బీజేపీ తన గుప్పిట్లో ఉన్న ఈసీని అడ్డం పెట్టుకొని బ్యాంక్ ఖాతాలో పడ్డ రైతుభరోసా సొమ్ములను కూడా నిలిపి వేసిందని పేర్కొన్నారు. ఇంత కంటే దారుణం ఎక్కడా ఉండబోదని తెలిపారు. రెండు పార్టీలకు రైతులే తగిన గుణపాఠం చెప్పాలని విజ్ఞప్తి చేశారు.