ప్రైవేట్ వ్యాపారస్తులను ఆశ్రయిస్తున్న రెంజల్ మండల రైతులు

నవతెలంగాణ – రెంజల్

ఆరుగాలం కష్టించి పండించిన పంట దళారులకు విక్రయించకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని ప్రభుత్వము ఒకవైపున కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికీ, రైతులు మాత్రం ప్రైవేటు వ్యాపారస్తులను ఆశ్రయిస్తున్నారు. మండలంలో ఇప్పటికే వేలాది బస్తాల ధాన్యం ప్రైవేట్ వ్యాపారస్తులు కొనుగోలు చేస్తుండడంతో ధాన్యం కొనుగోలు కేంద్రాలు వేలవేల పోతున్నాయి. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 17% లోపు తేమతో కూడి ఉండడమే కాకుండా, హమాలీలకు బస్తాకు 16 రూపాయల చొప్పున క్వింటాలుకు 36 రూపాయలు ఇవ్వవలసి రావడంతో రైతులు ప్రైవేట్ వ్యక్తులకు ధాన్యాన్ని విక్రయిస్తున్నారు. ప్రైవేట్ వ్యక్తులు ఎండబెట్టిన ధాన్యాన్ని రూ.2200 రూపాయలకు కొనుగోలు చేస్తూ ఉండడంతో రైతులు ప్రైవేట్ వ్యాపారస్తులను ఆశ్రయిస్తూ ఉన్నారు. దీంతోపాటు ధాన్యం కొనుగోలు కేంద్రాలలో క్వింటాల్కు రెండు కిలోల చొప్పున తాలు రూపంలో తరుగు తీయడంతో రైతులు నష్టపోతున్నామని, అందుకే ప్రైవేట్ వ్యక్తులకు ధాన్యం విక్రయించినట్లయితే హమాలీల డబ్బులతోపాటు, రెండు కిలోల తరువు కూడా ఉండదని వారు భావిస్తున్నారు. మండలంలో మూడు సొసైటీ పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడమే కాకుండా, ఐకెపి ద్వారా మరో ఆరు కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికీ రైతులు మాత్రం ఎలాంటి నియమ నిబంధనలు లేకుండానే రూ.2200 రూపాయలకు విక్రయిస్తున్నామని వారు పేర్కొన్నారు.  కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికీ కొన్ని కేంద్రాలు ఇప్పటికీ ప్రారంభించకపోవడం శోచనీయం.