రైతు వేదికలు.. మందుబాబులకు అడ్డాలు

నవతెలంగాణ – మోపాల్
వ్యవసాయ సాగులో కర్షకులకు సలహాలు సూచనలు ఇవ్వడానికి ఏర్పాటు చేసిన రైతు వేదికలు అధ్వానంగా మారాయి అన్నదాతల సంక్షేమమే ధ్యేయంగా వ్యవసాయంలో నిపుణుల ద్వారా సమాచారం అందించడానికి వాటిని నిర్మించిన ప్రయోజనం లేకుండా పోయింది. నిధులు లేక అద్వానంగా తయారయ్యాయి వీటి నిర్వహణ కొరవడి రైతులు, అధికారులు ఇబ్బంది పడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఐదు వేల రైతులను ఒక క్లస్టర్ గా విభజించి రైతు వేదికలను ఏర్పాటు చేయడం జరిగింది. వీటిని ఏర్పాటు చేసిన ప్రారంభంలో రైతు వేదికల నిర్వాణ కొరకు దాదాపు 5 నెలల పాటు నెలకు రూ.9,000 చొప్పున ఇవ్వడం జరిగింది. వీటిని స్వీపర్ మరియు త్రాగునీరు ఆఫీసుకు సంబంధించిన కరెంట్ బిల్లు స్టేషనరీ కొరకు వినియోగించేవారు. దాదాపు రెండు సంవత్సరాల నుండి ఇప్పటివరకు ఈ రైతు వేదికల నిర్వాణ కొరకు ఒక రూపాయి కూడా చెల్లించడం లేదు. సరియైన నిర్వహణ లేక అలాగే ఇవి ఊర చివర ఉండడంతో రాత్రి సమయంలో ఈ రైతు వేదికలు మందుబాబులకు అడ్డాలుగాను, అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారాయి. కొంతమంది ఏ ఈ ఓ లె తమ రైతు వేదికలను వారే శుభ్రపరచుకునే పరిస్థితికి దిగజారింది. లక్షల రూపాయలు ఖర్చుపెట్టి నిర్మించిన రైతు వేదికలకు నిర్వాహణలపంతో మాత్రం సతమతమవుతున్నాయి. ముఖ్యంగా మోపాల్ మండల కేంద్రంలో మూడు రైతు వేదికలు ఉన్నాయి. అందులో మంచిప్ప రైతు వేదికకు రూ.39,000, కంజర రైతు వేదికకు రూ.77,000 ,మోపాల్ రైతు వేదిక రూ.23 వేల రూపాయలు విద్యుత్ బకాయిలు ఉన్నాయి. ఎప్పుడు విద్యుత్ సిబ్బంది వచ్చి ఆ రైతు వేదికలకు విద్యుత్ని నియంత్రిస్తారో తమ కార్యకలాపాలకు ఎక్కడ ఆటంకం కలుగుతుందని ఏ ఈ వోలు ప్రతిక్షణం ఇబ్బంది పడుతున్నారు. అసలే రైతు వేదికలకు రక్షణ లేక ఇబ్బంది పడుతుంటే అందులో భాగంగా కొన్ని రైతు వేదికలకు  ఈ మధ్య కాలంలో మూడు లక్షల 50 వేల రూపాయల వ్యయంతో ఒక టీవీని, ఒక కంప్యూటర్ ఒక సీపీయూ, బ్యాటరీ, స్పీకర్స్ ని  ఏర్పాటు చేయడం జరిగింది.
ఒక దిక్కు రైతు వేదికలను కాపాడుకోవడమే వ్యవసాయ అధికారులకు తలకు మించిన భారం అవుతుంటే దానికి తోడు ఈ కొత్త పరికరాలను తెచ్చి ఇంకా ఇబ్బంది గురిచేయడం జరిగింది. ఇంత ఖర్చు పెట్టి కొత్త సామగ్రిని తెచ్చినప్పుడు వీటిని దొంగల భారీ నుండి కాపాడడం చాలా కష్టం అవుతుంది. ఇప్పటికైనా కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పడి దాదాపు 9 నెలల సమయంగా వస్తుంది. తమ ప్రభుత్వం కర్షక ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని చెప్పుకునే ప్రభుత్వం కాబట్టి,  ఇప్పటికైనా రైతు వేదికలపై దృష్టి పెట్టాలని వాటి మెయింటెనెన్స్ కొరకు నిధులను సకాలంలో విడుదల చేయాలని అలాగే ప్రతి రైతు వేదికకు ఒక వాచ్మెన్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. వాచ్మెన్ ఏర్పాటు చేయడం వల్ల అందులో ఉండే ఫర్నిచర్ కు రక్షణ ఉంటుందని రైతు వేదిక చుట్టూ మొక్కలు పెంచిన వాటికి రక్షణ ఉంటుందని వారు కోరారు. అలాగే రైతు వేదికల నిర్వహణతో పాటు ఏ ఈ ఓ లు అంటే కేవలం రైతు భరోసా రైతు బీమా కొరకే కాకుండా రైతులు తమ పొలాలకు కావాల్సిన రసాయనాల గురించి నూతన వంగడాల గురించి అడిగి తెలుసుకోవాలి పంటకు కావాల్సిన పోషకాల గురించి అనుక్షణం వారిని సంప్రదించాలి. చాలా మట్టుకు రైతులు  కేవలం రైతు బీమా, రైతు భరోసా కొరికే వారిని సంప్రదిస్తున్నారు అలాంటి పద్ధతిని మార్చుకొని వారిని వ్యవసాయ అధికారులుగా వ్యవసాయానికి సంబంధించిన వాటి పైన కూడా అధికారుల సూచనలు తీసుకోవాలి అప్పుడే వ్యవసాయ రంగంలో కొత్త ఓరవడిక ఏర్పడి అధిక మొత్తంలో దిగుబడులు సాధించవచ్చు. అప్పుడే రైతుల కళ్ళల్లో ఆనందాన్ని వెలువడుతాయి.