రైతాంగానికి సరిపడా విద్యుత్‌ఇవ్వాలి

– ఎండిపోతున్న పంట పొలాలను కాపాడాలి
– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
వ్యవసాయానికి సరిపడా విద్యుత్‌ను అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, సరిపడా విద్యుత్‌ను సరఫరా చేయాలని సీపీఐ(ఎం)రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. ఆదివారం స్థానిక మల్లు వెంకటనర్సింహారెడ్డి భవన్‌లో నిర్వహించిన ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు.వ్యవసాయానికి సరిపడా నాణ్యమైన విద్యుత్‌ను అందించాల్సిన ప్రభుత్వం సక్రమంగా సరఫరా చేయకపోవడంతో రైతులు వేసిన వరి పంటపొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతాంగానికి సరిపడా విద్యుత్‌ అందించాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన పేదలందరికీ వర్తింప చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గహలక్ష్మి పథకం, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు, బీసీ రుణాలు, దళితబంధు, మైనార్టీ రుణాలు అర్హులైన పేదలకు ఇవ్వకుండా అర్హత లేని బీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు ఇవ్వడంలో అర్ధం లేదన్నారు.అక్రమార్కులకు సంక్షేమపథకాలందిస్తే రానున్న రోజుల్లో అధికార బీఆర్‌ఎస్‌కు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. రైతాంగం రుణమాఫీ చేస్తున్నామని గొప్పలు చెబుతున్నా నేటికీ పూర్తిస్థాయిలో మాఫీ కాలేదన్నారు. ప్రభుత్వానికి రైతాంగం పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా రైతులందరికీ రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో అంగన్‌వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన కార్మికులు నెల రోజులుగా ఆందోళన చేస్తున్న ప్రభుత్వం కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా, కక్షపూరితంగా వ్యవహరిస్తుందని విమర్శించారు.వెంటనే వివిధ రంగాల కార్మికులతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని కోరారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పార్టీ ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్రలను నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మీ, జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, బుర్రి శ్రీరాములు, ధీరావత్‌ రవినాయక్‌, మట్టిపల్లి సైదులు,కోటగోపి, చెరుకు ఏకలక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు.