రైతులను వేంటనే విడుదల చేయాలి

Farmers should be released immediately– బాల్కోండ నియోజక వర్గ బంజార సేవ సంఘం  నాయకులు 
నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
లగచర్లలో అర్ధరాత్రి అక్రమంగా అరెస్టు చేసిన గిరిజన రైతులను వెంటనే విడుదల చేయాలని బాల్కోండ నియోజక వర్గ బంజార సేవ సంఘం  నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అర్ధరాత్రి అక్రమ అరెస్టులను, గిరిజన మహిళలపై చేసిన అఘాయిత్యాలను బంజారా సేవా సంఘం నాయకులు తీవ్రంగా ఖండించారు. మంగళవారం బాల్కోండ నియోజక వర్గ బంజార సేవ సంఘం భీమ్ గల్ మండల అధ్యక్షులు బాదవత్ శర్మ నాయక్, కమ్మర్ పల్లి మండల అధ్యక్షులు మాలవత్ ప్రకాష్ నాయక్, రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రాంగి మండల అధ్యక్షులు దేగావత్ తిరుపతి నాయక్,  రామవత్ తుక్కాజీ నాయక్ లు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ లో గిరిజన మహిళలు ఏ విధంగా ఆవేదన చెందుతున్నారో వాళ్ల మాటల్లోనే అర్థమవుతుందన్నారు. ఇంత ఘోరమా?  గిరిజనులు ఏం పాపం చేశారు? మీకు ఓట్లు వేయడమే పాపం అనుకునే పరిస్థితి వచ్చిందన్నారు.కాంగ్రేస్ ప్రభుత్వం ఏర్పడడానికి గిరిజనుల ఓట్లే కీలకమయ్యాయి అన్నారు. దశాబ్దాల పాటు ఇదే భూమిపై ఆధారపడి బతుకుతున్న గిరిజనుల భూములు లాక్కోవడం ఏమిటని ప్రశ్నించారు. అర్థరాత్రి వచ్చి పోలీసులు అరెస్ట్ చేస్తూ, లైంగిక దాడులు, శారీరకంగా ఎలా హింసిస్తారు?అసలు మనుషులేనా? క్రూర మృగాల్లాగ వ్వవహరిస్తార అని మండి పడ్డారు.బాద్యులైన పోలిసులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి ఉద్యోగాల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
కొడంగల్‌లో ఓటు వేసి నిన్ను ముఖ్యమంత్రి చేసినందుకు మమ్మల్ని అర్థరాత్రి కరెంట్ తీసేసి అరెస్ట్ చేస్తావా?ఇంట్లో మగవాళ్లను, మహిళలను ,పిల్లలను బూటు కాళ్ళతో తన్నుతు అరెస్ట్ చేస్తారా? ఇది చాల భాధకరమైన సంఘటన అని ఆవేదన వ్యక్తం చేశారు. గర్భిణి జ్యోతి అనే మహిళ భర్తను దారుణంగా కొట్టి అరెస్ట్ చేయడం ఎంతవరకు న్యాయమన్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ చేసిన అఘాయిత్యాలను మానవహక్కుల కమీషన్, ఎస్సీ, ఎస్టీ కమీషన్, మహిళా కమీషన్‌ను కూడ తప్పు బట్టాయన్నారు. భూములు ఇవ్వకుంటే మీరు ఏ విధంగా భూములు ఇవ్వరో చూస్తామంటూ బెదిరించడమేనా ప్రజా పాలనా? అని నిలదీశారు. అల్లుడి పెట్టే ఫార్మా కంపెనీ కోసం గిరిజనులు భూములు కోల్పోవాలా? అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.పోలీసులు తాగి వచ్చి ఆడ పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, ఆడపిల్లలను కొట్టే హక్కు పోలీసులకు ఎవరిచ్చారన్నారు.రైతులను కొట్టిన, మహిళలపై అసభ్యంగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి సోదరుడు ఏ విధంగా బెదిరింపులకు పాల్పడుతున్నాడో కళ్లకు కట్టినట్లు ప్రజలంతా గమనిస్తున్నారన్నారు.తెలంగాణలో గిరిజనులపై రేవంత్ సర్కార్ దమనకాండ ప్రదర్శిస్తుందన్నారు. పేద, గిరిజన రైతుల భూములను రేవంత్ రెడ్డి అక్రమంగా గుంజుకుంటున్నాడని, తెలంగాణలో గిరిజనులపై  అరాచకాలు ఎక్కువయ్యాయన్నారు. అక్రమంగా ఆరేస్టు చేసిన గిరిజన రైతులను బేషరతుగా విడుదల చేయాలని, లేని యేడల రాష్ట్రమంత అన్ని గిరిజన సంఘాలు ఏకమై ఆందోళనలో చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో బంజార సేవా సంఘం నాయకులు భూక్య బాబులాల్ నాయక్,  వేంకటేష్ నాయక్, సంతోష్ నాయక్, ఎంజీ నాయక్, ప్రకాష్ నాయక్, జై రామ్, శ్రీనివాస్ నాయక్, జబ్రు నాయక్, తదితరులు పాల్గోన్నారు.