– ఆయిల్ఫడ్ అధికారి అరవింద్
– వ్యవసాయ అధికారులు ప్రవీణ్ కుమార్, అన్వేష్
నవతెలంగాణ – దుబ్బాక రూరల్
ఫామాయిల్ సాగుకు రైతులు అధిక సంఖ్యలో ముందుకు రావాలని ,ప్రభుత్వం అందించే సబ్సిడీలను సద్వినియోగం చేసుకుని రైతులు అధిక లాభాలు పొందవచ్చని ఆయిల్ఫడ్ అధికారి అరవింద్, వ్యవసాయ అధికారులు ప్రవీణ్ కుమార్, అన్వేష్ అన్నారు.శుక్రవారం దుబ్బాక మండల పరిధిలోని హబ్సిపూర్ ,చికోడు ,పెద్ద గుండవెల్లి గ్రామాల్లో రైతులు సాగు చేస్తున్న ఆయిల్ పామ్ తోటలను సందర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రస్తుతం తోటలు 20 నుండి 30 నెలల వయసులో ఉండి గెలలు వచ్చే దశలో ఉన్నాయని, ఈ పరిస్థితులలో పంటలో ఎరువుల యాజమాన్యం, చీడపీడల యాజమాన్యం సమర్థవంతంగా ఉంటే అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉందన్నారు. తోటలలో ఆయిల్ ఫెడ్ సంస్థ వారు ఇచ్చే వివిల్స్ ను వదలడం ద్వారా పరాగ సంపర్కం బాగా జరిగి దిగుబడి పెరుగుతుందన్నారు.మండలంలో సుమారు 500 ఎకరాల వరకు ఆయిల్ పామ్ పంట వేయడం జరిగిందని, ఆసక్తిగల రైతులు ముందుకు వచ్చి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం మొక్కలపై , డ్రిప్పుపై పంట యాజమాన్యంపై ఇచ్చే సబ్సిడీలను ఉపయోగించుకొని తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను ఆర్జించవచ్చన్నారు. కొత్తగా ఫామాయిల్ సాగు చేసే రైతులకు ఏవైనా సందేహాలు ఉంటే వ్యవసాయ అధికారులను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో ఏఈవోలు మహేష్, సంతోష్, సంధ్య , రైతులు మహిపాల్ రెడ్డి, గౌసుద్దీన్ ,జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు.