– ఎవరైనా ఒత్తిడి చేస్తే బీఆర్‌ఎస్ నేతలకు చెప్పండి
– ప్రభుత్వం బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలివ్వాలి : మాజీమంత్రి,ఎమ్మేల్యే టీ. హరీశ్‌రావు డిమాండ్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రైతులు ఎవరూ బ్యాంకుల అప్పులు చెల్లించొద్దని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే టీ హరీశ్‌రావు అన్నారు. ఎవరైనా బ్యాంకర్లు అప్పులు కట్టమని ఒత్తిడి చేస్తే స్థానిక బీఆర్‌ఎస్ నేతలకు చెప్పాలని కోరారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నీరు లేక పంటలు ఎండిపోయి రైతులు దుర్భిక్షాన్ని ఎదుర్కొంటున్నారనీ, ఇలాంటి సమయంలో అప్పులు కట్టాలని బ్యాంకర్లు వత్తిడి చేయడం భావ్యం కాదన్నారు. సోమవారంనాడిక్కడి తెలంగాణ భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డికి రాజకీయాలపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదని విమర్శించారు. వరంగల్ జిల్లా దేవరుప్పుల మండలం లక్ష్మీబాయి తండాలో ఆదివారం క్షేత్ర స్థాయి పర్యటన చేశామనీ, ఒక్కో రైతు నాలుగైదు బోర్లు వేశామని చెప్పారనీ, తాగునీరు కూడా సక్రమంగా రావట్లేదని ఫిర్యాదులు చేశారన్నారు. రాష్ట్రంలో 180 రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే, రాష్ట్ర ప్రభుత్వం కనీసం క్షేత్రస్థాయికి అధికారుల బృందాన్ని కూడా పంపలేదని ఆరోపించారు. అందోల్ నియోజకవర్గం రేగోడ్ మండలంలో గ్రామీణ వికాస్ బ్యాంకు అధికారులు అనేక గ్రామాల్లో అప్పులు కట్టాలని రైతులకు నోటీసులు ఇస్తున్నారనీ, సీఎం రేవంత్‌రెడ్డి ఏం చెప్పారో తమకు సంబంధం లేదనీ, రుణాలు కట్టాల్సిందేనని బ్యాంకు అధికారులు గ్రామాల మీద పడుతున్నారని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికలప్పుడు ఏం చెప్పారు…ఇప్పుడు ఏంచేస్తున్నారని ప్రశ్నించారు. పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు అడిగే అర్హత కాంగ్రెస్‌పార్టీకి లేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి పార్టీ గేట్లు తెరవడంపై ఉన్న శ్రద్ధ, ప్రాజెక్టుల గేట్లు తెరవడం మీద లేదని ఆరోపించారు. వరుసగా మూడు రోజులు క్షేత్రస్థాయిలో బీఆర్‌ఎస్ శ్రేణులు పంటపొలాలకు వెళ్లి పరిస్థితుల్ని సమీక్షించి, నివేదికల్ని పార్టీ రాష్ట్ర కార్యాలయానికి పంపాలని తమ అధినేత కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వం తక్షణం ఎకరాకు రూ.25వేలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల పక్షాన అన్ని వేదికలపైనా పోరాడతామన్నారు. పంటనష్టం వివరాలు సేకరించి, రైతులకు ఆర్థిక సహకారం అందించాలనీ, దీనికి ఎలక్షన్ కోడ్ అడ్డు కాకూడదని అన్నారు. యాసంగి వడ్లకు రూ.500 బోనస్ ధర ఇచ్చి కొనుగోలు చేయాలని కోరారు. ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తే కలెక్టర్ కార్యాలయాలు ముట్టడిస్తామన్నారు.