
ధాన్యంను విక్రయించుకునేందుకు కొనుగోలు కేంద్రాలకు వచ్చిన రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ త్రిపాఠీ అన్నారు . బుధవారం మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ధాన్యం తేమ శాతం ను పరిశీలించి రైతులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులు ధాన్యం తెచ్చిన వెంటనే రికార్డులు నమోదు చేసుకొని రోజువారీగా తేమశాతాన్ని పరిశీలించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం మండల కేంద్రంలోని చౌటుప్పల్ రోడ్ లో ఉన్న కార్తికేయ, బాలాజీ కాటం మిల్లులను పరిశీలించారు. పత్తిని అమ్ముకునేందుకు వచ్చిన ట్రాక్టర్లలలోని పత్తిని తేమా శాతం మిషన్ తో పరిశీలించారు . 11 శాతం తేమ శాతం ఉన్న 7100 మాత్రమే మద్దతు ధర ఇస్తున్నారని కలెక్టర్కు తెలియజేశారు. మద్దతు ధరలో రైతును మోసం చేయకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారం గిట్టుబాటు ధర కల్పించాలని అధికారులకు సూచించారు. కౌలు రైతులు తమ పత్తిని అమ్ముకునేందుకు కౌలు కార్డు లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నామని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో సంబంధిత అధికారికి కలెక్టర్ ఫోన్ ద్వారా విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. తమ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు. అంతకుముందే మండలంలోని గూడపూర్ గ్రామంలో గ్రామంలో నిర్వహిస్తున్న సామాజిక ,ఆర్థిక ,విద్య ,ఉపాధి, రాజకీయ మరియు కుల, సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ను తనిఖీ చేశారు.
సమగ్ర కుటుంబ సర్వే ను తప్పులు లేకుండా జాగ్రత్తగా నిర్వహించాలని అన్నారు.కుటుంబాలు,వంటలు వేరుగా వున్నప్పుడు మాత్రమే రెండు కుటుంబాల కింద పరిగణించాలని తెలిపారు. ఎట్టి పరిస్థితులలో సర్వే వివరాలు తప్పుగా నమోదు చేయవద్దని, పూర్తి జాగ్రత్తగా ఆలోచించి వివరాలు నింపాలని అన్నారు. రెండు కుటుంబాలను రాయించినంత మాత్రాన ఎక్కువ పథకాలు వస్తాయని అనుకోవద్దని,ఈ సర్వే కేవలం సమాచారం కోసం మాత్రమేనని తెలిపారు. ఒక కిచెన్ ఉంటే ఒకటే కుటుంబం కింద తీసుకోవాలని, కుటుంబాలు వేరు వెఫుగా ఉంటే వాటిని మాత్రమే వేరువేరు కుటుంబం కింద తీసుకోవాలని సూచించారు .ఒకవేళ ఎవరైనా కుటుంబం గుడిసెలో నివసిస్తున్నట్లయితే వారిని ప్రత్యేక కుటుంబం కింద పరిగణించాలని చెప్పారు. ప్రభుత్వం నియమించిన, గుర్తింపు కార్డులు ఉన్న, ప్రభుత్వ టీచర్లు మాత్రమే గుర్తింపు కార్డులు ధరించి సర్వేకు వస్తారని, వారికి మాత్రమే వివరాలు తెలియజేయాలని ఆమె ప్రజలకు చెప్పారు. కలెక్టర్ ఇంటింటికి వెళ్లి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే సందర్భంగా ఇండ్ల జాబితా తయారీలో పాటించిన అంశాలు, పూరించిన ఖాళీలు , ఎన్యుమరేషన్ బ్లాక్ కోడ్ ,మండలం సంఖ్య అన్నింటిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మునుగోడు తహసిల్దార్ నరేందర్, ఎంపీడీవో విజయ్ భాస్కర్ , ఆర్ ఐ నాగరాజ్ , వివిధ శాఖల అధికారులు తదితరులు ఉన్నారు.