మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం రెండవ విడత రుణమాఫీని రైతులు లైవ్ లో వీక్షించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి జితేందర్ రెడ్డి మాట్లాడుతూ రెండవ విడత రుణమాఫీలో భాగంగా లక్షన్నర లోపు వ్యవసాయ రుణాలు మాఫీ కావడం జరిగిందన్నారు. రైతులు లక్షన్నర లోపు వ్యవసాయ రుణాలు కలిగిన వారు బ్యాంకులు సంప్రదించి వెంటనే నూతన రుణాలను పొందాలని సూచించారు. రైతులకు ఎలాంటి సందేహాలు ఉన్న ఆధార్ కార్డుతో రైతు వేదిక వద్దకు వచ్చి వ్యవసాయ అధికారులకు చూపించి సందేహాలు నివృత్తి చేసుకోవాలని అన్నారు. లక్ష 50 వేల పైబడి రుణం ఉన్నవారు మరో విడత రుణమాఫీ ప్రకటించే వరకు వెయిట్ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ విస్తరణ అధికారులు భూపాల్ రెడ్డి, దాదా సింగ్, మహి పవన్ తదితరులు పాల్గొన్నారు.