నిండా ముంచిన అకాల వర్షాలు.. తేరుకోలేకున్న రైతులు..

నవతెలంగాణ – తొర్రూర్ రూరల్
వరుణుడి ఆట అన్నదాతలను ఆగం చేస్తున్నాయి. పంట చేతికొచ్చి ధాన్యం కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న సమయంలో కొన్ని రోజులుగా ఊహించని విధంగా విరుచుకుపడుతోంది. దీంతో  పంటతో పాటు కొనుగోలుకు తరలించిన ధాన్యం వర్షార్పణమవుతోంది. అకాల వర్షాలు రైతులను వెంటాడుతూనే ఉన్నాయి. వరుసగా విరుచుకుపడుతున్న వానలతో తడిసిన ఆరేలోపే మళ్లీ వర్షం కురుస్తూ అన్నదాతలను కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. మండు వేసవిలో ఓ వైపు ఎండలు ఉక్కిరిబిక్కిరి చేస్తుండగానే అంతలోనే దంచికొడుతున్న వానలతో రైతులు గుండెలు బాదుకుంటున్నారు. నిన్న రాత్రి కురిసిన వానకు మహబూబాబాద్ జిల్లాలో తొర్రూర్ మండలంలో నిన్న రాత్రి  గంటల తరబడిగా కురిసిన వానకు కల్లాల్లో ఉన్న ధాన్యం రాశులు ఉదయం నీళ్లలో తేలియాడాయి. తొర్రూర్ డివిజన్లోని అమ్మపురం గ్రామంలో,నీటి ప్రవాహనికి కొట్టుకుపోయిన వరి ధాన్యం ఎత్తుకోలేక ఉదయం రైతులకు అవస్థలు పడుతున్నారు.

చెరువును తలపిస్తున్న కొనుగోలు కేంద్రం… 

అటు  అకాల వర్షాలు రైతులను నిండా ముంచాయి. కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యం నీటమునిగింది. తోరూర్ మండలంలో కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యం సుమారుగా 5 000 బస్తాల ధాన్యం తడిచిపోయింది . కష్టపడి పండించిన పంట నీటి పాలవటంతో పెట్టుబడి కుడా వచ్చేలా లేదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.రాత్రి వర్షానికి కొట్టుకుపోయిన వరిధాన్యాన్ని ఆరబెట్టేందుకు రైతులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.