రుణమాఫీ కాని రైతులు అధైర్యపడొద్దని మండల వ్యవసాయ అధికారి గుగులోత్ స్వామి అన్నారు. మండల కేంద్రంలోని రుణమాఫీ కానీ రైతుల ఇంటికి శుక్రవారం వెళ్లారు. కుటుంబ సభ్యుల నిర్ధారణ కోసం వివరాలు సేకరించి, ఆయా రైతులతో ఏవో సెల్ఫి దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రుణమాఫీ వర్తించని రైతుల ఫిర్యాదుల పరిష్కారానికి వ్యవసాయ శాఖ రూపొందించిన రైతు భరోసా పంట రుణమాఫీ యాప్ లో రైతు కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేస్తున్నమన్నారు. రుణమాఫీ కాలేదని ఫిర్యాదు చేసినా, దరఖాస్తు చేసుకున్న రైతుల ఇంటికి వ్యవసాయ అధికారులే వెళ్లి వారి బ్యాంకు రుణం తీసుకున్న ఖాతాలు, ఆధార్ కార్డులను పరిశీలిస్తున్నామని చెప్పారు. కుటుంబ సభ్యుల వివరాలను యాప్‌లో అప్‌లోడ్ చేస్తూ, రుణాలు ఉన్న భార్యాభర్తలనే కాకుండా 18 ఏళ్లు నిండిన కుటుంబ సభ్యులందరి ఫొటోలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. కుటుంబ యజమాని తన రుణ ఖాతా, బ్యాంకు వివరాలతో పాటు కుటుంబ సభ్యుల వివరాలను యాప్ లో నమోదు చేస్తున్నామని తెలిపారు. రైతులు అధైర్య పడద్దని రుణమాఫీ కానీ రైతుల ఇంటికే వచ్చి వివరాలను సేకరిస్తామన్నారు.