యూరప్‌లో ఫాసిజం దూకుడుకు కళ్లెం

Fascism in Europe is the key to aggressionప్రపంచంలోని చాలా దేశాల్లో ఫాసిస్టు శక్తులు అధికారాన్ని చేపట్టడమో లేక చేపట్టే ప్రమాదం పొంచి వుండడమో ప్రస్తుతకాలంలో మనం చూస్తున్నాం. యూరప్‌లో చాలా దేశాల్లో ఫాసిస్టులు అధికారాన్ని చెలాయి స్తున్నారు. ఈ జాబితాలో ఫ్రాన్స్‌ దేశం పేరు కూడా చేరే ముప్పు దాదాపు ముంచుకొచ్చేసింది. అదే గనుక జరిగి వుంటే, ఇటలీ తర్వాత ఫాసిస్టు ప్రభుత్వాన్ని కలిగి వుండే రెండో ప్రధాన శక్తిగా ఫ్రాన్స్‌ అయి వుండేది. అప్పుడు అదొక చారిత్రిక ప్రాధాన్యతను సంతరించుకుని వుండేది. గతంలో ఫ్రాన్స్‌లో మార్షల్‌ పెటైన్‌ నాయకత్వంలో విచీ ప్రభుత్వం అడ్డగోలుగా హిట్లర్‌తో ముఠా కట్టి వ్యవహరించింది. ఆ కాలంలో ఫ్రాన్స్‌ను ఆక్రమించుకున్న నాజీ సైన్యాలను ఫ్రాన్స్‌లోని వామపక్షాలు, కార్మికవర్గం వీరోచితంగా సాయుధ ప్రతిఘటన ద్వారా తిప్పికొట్టాయి. అటువంటి బలమైన కార్మికోద్యమ వారసత్వాన్ని, వామపక్ష వారసత్వాన్ని కలిగి వున్న ఫ్రాన్స్‌లో ఇప్పుడు గనుక మళ్లీ ఫాసిస్టు శక్తుల చేతుల్లోకి అధికారం వచ్చి వుంటే అది అత్యంత విషాదకర సంఘటన అయి వుండేది. అయితే ఆ విధంగా జరగలేదు. ఫాసిస్టు దూకుడుకు ఫ్రాన్స్‌లో కళ్లెం వేశారు. అంతేగాక ఎన్నికల నిర్ణయాత్మక తుది రౌండ్‌లో న్యూ పాపులర్‌ ఫ్రంట్‌ (వామపక్ష కూటమి) గెలుపు సాధించింది.
ఫాసిజం ఒక సవాలుగా ముందుకు రావడం అంతగా అంతు పట్టని విషయం ఏమీ కాదు. పెట్టుబడిదారీ వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోయినప్పుడు బడా పెట్టుబడి తన ఆధిపత్యానికి వచ్చే ముప్పు నుండి తప్పించుకోడానికి ఫాసిస్టు శక్తులతో చేతులు కలుపుతుంది. ఆ ఫాసిస్టు శక్తులు ప్రజల దృష్టిని ప్రధాన సమస్యల నుండి పక్కకు మళ్ళించి ఏదో ఒక నిస్సహాయ స్థితిలో ఉన్న మైనారిటీ తరగతి ప్రజలకు వ్యతిరేకంగా తక్కినవారిలో ద్వేషాన్ని రెచ్చగొడుతుంది. ప్రజల దృష్టిని ఆవిధంగా పక్కకు మళ్లించడం ద్వారా బడా పెట్టుబడి తన పెత్తనాన్ని కాపాడుకుంటుంది, తన దోపిడీని కూడా మరింత ముమ్మరం చేస్తుంది.
1930 దశకంలో మహా మాంద్యం కాలంలో జరిగింది ఇదే. ప్రస్తుతం నయా ఉదారవాద విధానాలు ఆర్థిక వ్యవస్థను ఒక సుదీర్ఘ మాంద్యంలోకి, సంక్షోభంలోకి నెట్టాయి. 2008 నాటికి యూరప్‌ దేశాల్లో సగటున ఒక కుటుం బం తన ఆదాయంలో వెచ్చించగలిగిన సొమ్ముతో పోల్చితే 2023 నాటికి అది కేవలం 6.4 శాతం మాత్రమే పెరిగింది. ఈ పెరుగుదల చాలా తక్కువ. పైగా ఇందులో అతి ధనవంతుల ఆదాయాలు కూడా కలిసి వుంటాయి. ఈ కాలంలో ధనిక పేదల నడుమ ఆదాయాల అంతరాలు బాగా పెరిగాయి. ఈ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నప్పుడు సామాన్యుల కుటుంబ ఆదాయాల్లో పెరుగుదల దాదాపు లేనట్టే అనుకోవాలి. అంతేగాక చిన్న పెట్టుబడిదారుల సంస్థల్లో ఉపయోగించే యంత్రాల, పరికరాల అరుగుదలను (దానిని డిప్రిసియేషన్‌గా లెక్కిస్తారు) ఈ లెక్కలు పరిగణనలోకి తీసుకోలేదు. చాలా పరిశ్రమలు పూర్తి స్థాయి ఉత్పత్తి సామర్ధ్యంతో పని చేయగలిగిన స్థితి లేదు. దానికి మాంద్యం కారణం. అందుచేత ఆ డిప్రిసియేషన్‌ కూడా ఎక్కువగానే ఉంటుంది. అప్పుడు ఆ చిన్న, మధ్య తరహా పరిశ్రమల యజమానుల కుటుంబాల ఆదాయాలు కూడా నికరంగా తగ్గుతాయి. మొత్తంగా అతి సంపన్నుల కుటుంబ ఆదాయాలు మినహా తక్కినవారి నిజ ఆదాయాలలో పెరుగుదల ఏమీ లేదని బోధపడుతోంది. ఇటువంటి పరిస్థితులను అనుభవించవలసి వస్తున్నందుకు ప్రజల్లో ఆగ్రహం పెరుగుతుంది. ఈ ఆగ్రహాన్ని ఫాసిజం అదే ప్రజల్లోన్ని ఒక మైనారిటీ భాగం మీదకు మళ్లిస్తుంది. తద్వారా బడా పెట్టుబడిని కాపాడుతుంది.
అయితే బడా పెట్టుబడికి, ఫాసిస్టు శక్తులకు మధ్య చెలిమి రకరకాల మార్గాల్లో పెంపొందుతుంది. ఉదాహరణకు, ప్రజల్లో బడా పెట్టుబడిదారుల పట్ల ఉన్న ఆగ్రహాన్ని తమకు అనుకూలంగా ఉపయోగించుకోడానికి ఫాసిస్టులు ముందు తామూ బడా పెట్టుబడిదారులకు వ్యతిరేకమే అన్న అభిప్రాయాన్ని కలిగించే విధంగా వ్యవ హరిస్తారు. అప్పట్లో హిట్లర్‌ చేసిందిదే. అటువంటి సందర్భంలో కూడా వాళ్ళకి కొంతమంది గుత్త పెట్టుబడిదారులు చాటు మాటుగా సహకరిస్తారు. ఒకసారి ఫాసిస్టులు అధికారం చేజిక్కించుకున్నాక ఇక బాహాటంగానే వారికి బడా పెట్టుబడి దారులతో ఉన్న భాగస్వామ్యం బైట పడుతుంది. తమకు మొద ట్లో మద్దతుదారులుగా ఉంటూ అధికా రంలోకి వచ్చాక కూడా బడా పెట్టుబడి దారులకు వ్యతిరేక వైఖరిని పాటించే వారినందరినీ నిర్మొహమా టంగా పార్టీ నుండి బయటకు తోలేస్తారు.
మన దేశంలో ఈ విషయంలో కొంత తేడా ఉంది. మైనారిటీ మతస్తుల పట్ల విద్వేషాన్ని రెచ్చగొట్టే తొలి దశలో కూడా ఇక్కడి ఫాసిస్టులు తమకు బడా పెట్టుబడిదారులతో ఉన్న చెలిమిని ఎక్కడా దాచిపెట్టలేదు. ప్రత్యేకించి కొంతమంది బడా పెట్టుబడిదారులతో బాగా సన్నిహితంగా మెలుగుతూ వచ్చారు. ఐతే ఫ్రాన్స్‌లో నయా ఫాసిస్టులు మాత్రం ముందు దశలో గుత్త పెట్టుబడికి తాము వ్యతిరేకం అన్నట్టు కొంత హడావుడి చేశారు. ఫ్రెంచి ఫాసిస్టు నాయకురాలు మెరైన్‌ లీపెన్‌ నయా ఉదారవాద విధానాలకు తాను వ్యతిరేకం అన్నట్టు వ్యవహరిం చింది. గ్రీస్‌లో సిరిజా పార్టీ ఎన్నికల సమయంలో నయా ఉదారవాద విధానాలకు ప్రత్యామ్నాయ విధానాలను అమలు చేస్తానని ప్రకటించి ఎన్నికల్లో గెలిచిన తర్వాత అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ఒత్తిళ్ళకు లొంగిపోయింది. ఆ సందర్భంలో లీపెన్‌ సిరిజా పార్టీ ద్రోహం చేసిందంటూ విరుచుకుపడింది. కాని ఆమె పార్టీకి ఫ్రెంచి మీడియా గుత్తాధిపతి. శత కోటీశ్వరుడు అయిన విన్సెంట్‌ బొల్లొరె పూర్తి అండదండలందించాడు. ఎన్నికల సమయం సమీపిస్తున్న కొద్దీ ఆ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్ధి జోర్డాన్‌ బార్డెల్లా అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడికి వ్యతిరేకంగా మాట్లాడడం తగ్గించివేశాడు. మొదట్లో తమ పార్టీ ప్రకటించిన వైఖరికి ఇది భిన్నమైనది.
ఇటలీలో కూడా ఇదే విధంగా జరిగింది. అక్కడ ఫాసిస్టు నాయకురాలు జార్జియా మెలోనీ ముందు తమ ఆర్థిక ఎజెండా నయా ఉదారవాద విధానాలకు భిన్నంగా ఉంటుందని ప్రకటించారు. అప్పటికి అధికారంలో ఉన్న మారియో డ్రాఘీ ప్రభుత్వం సూటిగా నయా ఉదారవాద విధానాలనే అమలు చేస్తోంది. మెలోనీ ప్రకటించిన వైఖరిని నమ్మి ప్రజలు ఆమెకు పట్టం కట్టారు. కాని ఒకసారి అధికారం చేతికి వచ్చాక తాను అంతకు ముందు ప్రకటించిన దానికి భిన్నంగా బడా పెట్టుబడికి అత్యంత విశ్వసనీయమైన మిత్రురాలిగా మెలోనీ మారిపోయారు.
ఉక్రెయిన్‌ యుద్ధం విషయంలో కూడా చాలామంది యూరోపియన్‌ ఫాసిస్టులు ఇదే విధంగా తమ తమ పూర్వపు వైఖరులను మార్చుకున్నారు. యూరోపి యన్‌ కార్మికవర్గం స్పష్టంగా ఉక్రెయిన్‌ యుద్ధాన్ని వ్యతిరేకిస్తోంది. రష్యా మీద విధించిన ఆంక్షల కారణంగా పెరిగి పోయిన ఇంధన ధరల భారాన్ని వారు భరించలేక పోతున్నారు. తిరిగి శాంతి నెలకొనాలని వారంతా కోరుతున్నారు. ఫాసిస్టులు మొదట్లో కార్మికుల మద్దతు పొందడం కోసం యుద్ధం పట్ల కొన్ని అభ్యంతరాలను ప్రకటించారు. కాని అధికారంలోకి వచ్చాక వారంతా అమెరికా విధించిన ఆంక్షలను పూర్తిగా బలపరచం ప్రారంభించారు. తమకన్నా ముందు పాలించిన ఉదారవాద బూర్జువా పార్టీలు అనుసరించిన వైఖరికి వీరు అనుసరించే వైఖరికి తేడా లేకుండా పోయింది.
క్లుప్తంగా చెప్పాలంటే ఫాసిస్టు శక్తులు ఒక మైనారిటీ భాగపు ప్రజలమీద ద్వేషాన్ని రెచ్చగొట్టడం మాత్రమే కాకుండా శ్రామిక వర్గాన్ని సైతం మోసం చేస్తారు. ఉదారవాద బూర్జువా పార్టీకన్నా తాము భిన్నంగా పాలిస్తామని చెప్పుకున్నా ఆచరణలో ఆ ఉదారవాద బూర్జువా పార్టీకన్నా కూడా మితవాద వైఖరులను పాటిస్తారు. అది ఆర్థిక విధానాలైనా లేక ఉక్రెయిన్‌ యుద్ధం విషయం అయినా అంతే. ఇస్లాం మతం పట్ల విద్వేషాన్ని, భయాన్ని రెచ్చగొట్టడంలో గాని, బతుకుదెరువు కోసం వలసలు వచ్చే కాందిశీకుల పట్ల శత్రుత్వాన్ని కలిగించడంలోకాని, ఆ ఉదార వాద బర్జువా పార్టీలను మించి మితవాద వైఖరిని ప్రదర్శిస్తారు. ఆర్థిక విధానాలలో, యుద్ధం పట్ల వైఖరిలో ఆ ఉదారవాద బూర్జు వా పార్టీల అడుగుజాడల్లోనే నడుస్తారు. అధికారంలోకి వచ్చేంత వరకూ, కార్మిక వర్గపు ఓట్ల కోసం దొంగనాటకం ఆడతారు.
వీళ్ల నాటకాలు ఇలా సాగడానికి అవకాశం ఇచ్చింది వామపక్షాలే. వామపక్షాలలోని ప్రధాన శక్తులు కార్మికవర్గ ప్రయోజనాలను పరిరక్షించే బాధ్యతను వదిలిపెట్టి బూర్జువు వర్గానికి తోకలుగా తయారయ్యారు. జర్మనీలో ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా రష్యా మీద విధించిన ఆంక్షల ఫలితంగా ద్రవ్యోల్బణం బాగా పెరిగింది. దీనివలన అక్కడి కార్మికవర్గం బాగా దెబ్బ తింటోంది. అందుచేత జర్మన్‌ కార్మికవర్గం యుద్ధాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కాని అక్కడ సోషల్‌ డెమోక్రాట్లతోబాటు వామపక్షాలు సైతం అమెరికన్‌ సామ్రాజ్యవాదానికి మద్దతుగా నిలబడ్డాయి. ఆ వామపక్షాల నుండి చీలిపోయిన సహ్రా వేగెన్‌నెక్ట్‌ గ్రూపు గట్టిగా యుద్ధాన్ని వ్యతిరేకించే వైఖరి తీసుకుంది. అందుచేత ఆ గ్రూపునకు కార్మికల్లో ఆదరణ బాగా పెరుగుతోంది. జర్మనీలోని వామపక్షాల మాదిరిగానే యూరప్‌లోని చాలా వామపక్షాలు నయా ఉదారవాదాన్ని బలపరిచేవారుగా తయారయ్యారు. ఈ వైఖరి వలన ఫాసిస్టుల పని తేలికైంది. వాళ్లు కార్మికవర్గాన్ని తేలికగా మోసగించగలుగుతున్నారు.
సరిగ్గా ఇక్కడే ఫ్రాన్స్‌లో పరిస్థితి భిన్నంగా ఉంది. అక్కడ వామపక్షాలు న్యూ పాపులర్‌ ఫ్రంట్‌ అనే ఒక కొత్త కూటమిని కూర్చడంలో జయప్రదం అయ్యారు. అంతేగాక ఆ కూటమి నయా ఉదారవాద విధానాలకు భిన్నమైన ఆర్థిక కార్యక్రమాన్ని ఆమోదించేలా చేయగలిగారు. అంత వరకూ ఫాసిస్టులను అధికారం నుండి దూరంగా ఉంచాలని కోరుకున్నవారు చాలా మంది ఉన్నప్పటికీ, వారి వద్ద నయా ఉదారవాద విధానాలకు ప్రత్యామ్నాయ కార్యక్రమం అంటూ ఏదీ లేదు. ఈ పరిస్థితిని మాక్రాన్‌ బాగా ఉపయోగించుకున్నాడు. నయా ఉదారవాద విధానాలను వేగంగా అమలు చేశాడు. దానిని కార్మికవర్గం రానురాను తీవ్రంగా వ్యతిరేకించడం జరుగుతున్నా అతడు పట్టించుకోలేదు. మాక్రాన్‌ పలుకుబడి తగ్గుతున్న కొద్దీ ఆ మేరకు ఫాసిస్టులు బలపడడం ప్రారంభించారు. ప్రజల్ని ఆకట్టుకోవడం కోసం వాళ్ళు అతడి ఆర్థిక విధానాలను విమర్శించడం చేశారు. ఐతే ఈ వ్యవహారానికి ఇప్పుడు తెర పడింది. న్యూ పాపులర్‌ ఫ్రంట్‌ ఫాసిజాన్ని వ్యతిరేకించడమే గాక, ప్రత్యామ్నాయ ఆర్థిక కార్యక్రమాన్ని కూడా రూపొందించడమే దీనికి కారణం.
రెండవ ప్రపంచ యుద్ధం కాలంలో ఫాసిస్టు వ్యతిరేక కార్యక్రమం ఒక్కటే. యుద్ధాన్ని వెంటనే నిలుపు చేయాలన్నదే ఆ కార్యక్రమం. వేరే ఆర్థిక ఎజెండా ఏదీ అవసరం లేకపోయింది. అప్పటి మాదరిగానే ఇప్పుడు కూడా కేవలం ఫాసిస్టు వ్యతిరేకతను ఒక్కదానినే కార్యక్రమంగా పెట్టుకుని, నయా ఉదారవాద విధానాలకు ప్రత్యామ్నాయంగా ఒక కార్యక్రమాన్ని రూపొందించ కుండా ముందుకు పోవాలనుకుంటే ప్రస్తుత పరిస్థితుల్లో అది ముందుకు సాగదు. కేవలం ఫాసిస్టు వ్యతిరేకత ప్రాతిపదికగా ప్రత్యామ్నాయ రాజకీయ శక్తులు కలిస్తే అది సామాన్య ప్రజల ఆర్థిక స్థితిగతుల్ని ఏమాత్రమూ మెరుగుపరచలేదు. సరికదా ఫాసిస్టు శక్తుల విజయావకాశాలను అది మరింత పెంచుతుంది.
యూరప్‌లోని వామపక్షాలు బూర్జువా పార్టీకి తోకల్లా వ్యవహరించడం అనేది చాలాకాలం నుండి కొనసాగుతున్నదే. యుగోస్లేవియా మీద బాంబులు వేసినప్పటి నుంచీ వారిది అదే వైఖరి. ఇలా సామ్రాజ్యవాదులకు తోకల్లా వ్యవహరించడం అనేది ఇప్పుడు ముదిరిపోయి ఉక్రెయిన్‌ యుద్ధానికి, నయా ఉదార వాదానికి పూర్తి మద్దతు తెలిపేదాకా వాళ్లుపోయారు. దాంతో ఫాసిస్టులు తామే శాంతిని పరిరక్షించేవాళ్లమని, తామే ప్రజల్ని బాధల నుండి విముక్తి చేయగలం అని పోజు పెట్టడానికి అవకాశం వచ్చింది. ఆ పోజు ఒకసారి వాళ్లు అధికారంలోకి రాగానే మారిపోతుంది. అటువంటి ఫాసిస్టు శక్తుల ఆటలు కట్టించే దారి ఫ్రాన్స్‌లోని వామపక్షాలు చూపుతున్నాయి. నయా ఉదారవాద విధానాలకు ప్రత్యామ్నాయ ఎజెండాను రూపొందించి ప్రజల్లోకి దానిని తీసుకుపోవడమే ఆ మార్గం.
(స్వేచ్ఛానుసరణ)

– ప్రభాత్‌ పట్నాయక్‌