‘రాజ్యం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొం టున్నప్పుడు, దాని ఫలితం సామాజిక సంక్షోభం, రాజకీయ సంక్షోభం, సాంస్కృతి సంక్షోభంగా విస్తరిస్తున్నప్పుడు నగంగా, బహిరంగంగా రాజ్యమే టెర్రరిస్ట్ రూపం ధరిస్తుంది’ అదే ఫాసిజం అని స్టాలిన్ నిర్వచించాడు. ఫాసిజం అంటే అసహనం దాని మౌలిక లక్షణం. ఆ అసహనం ద్వేషం వైపునకు దారితీస్తుంది. మనుషులను విభజిస్తుంది. ఈ విభజన రేఖను అడ్డుకునే కమ్యూనిస్టులు, ప్రగతిశీలశక్తులు ఈ సమాజం మారాలని, కులమత వ్యవస్థ లేని, మనుషుల మధ్య ఎలాంటి అంతరంలేని సమాజం సృష్టికోసం ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నాన్ని ఆటంకపరిచేదే ఫాసిజం. 100సంవత్సరాలకు ముందే ఈ ఫాసిజం యూరప్‌ను కుదిపివేసింది. 1919లో మార్చ్ ఆన్ రోమ్ అనే పేరుతో ”బెనిటో ముస్సోలిని” రోమన్ చక్రవర్తి ఇంటి మీద దాడి చేశాడు. ఆ దాడికి భయపడి చక్రవర్తి అధికారాన్ని ముసోలినికి అప్పగించాడు. ఈ ఫాసిస్ట్ సిద్ధాంతాలు జర్మనీకి వ్యాపించి అక్కడ హిట్లర్, అలాగే స్పెయిన్‌లో అప్పటికే ఉన్న ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని రద్దుచేసి ”ఫ్రాంక్” అధికారంలోకి వచ్చాడు. రెండవ ప్రపంచ యుద్ధంలో రెండుకోట్ల మంది సోవియట్ యూనియన్ రెడ్ ఆర్మీ ప్రాణత్యాగాలతో ఫాసిజం ఓడించబడింది. ముస్సోలిని నడిబజార్లో విప్లవశక్తులు, ప్రజలు ఖండ ఖండాలుగా నరికి చంపారు. రష్యన్ ఎర్రసైన్యం దెబ్బకు హిట్లర్ స్వగృహంలో ఆత్మహత్య చేసుకుని కుక్కచావు చచ్చాడు. 1930నాటి హిట్లర్ అకృత్యాలను గుర్తుచేస్తూ ఫాసిజం లక్షణాలను ‘హోలోకాస్ట్’ అనే మ్యూజియంలో ఒక పోస్టర్ మీద రాసి పెట్టారు. అలాంటి లక్షణాలు ఇప్పటికీ వివిధ రూపాల్లో కొనసాగుతూనే ఉన్నాయి. ఆవి మన దేశంలో కూడా చొరబడ్డాయి. ఆర్‌ఎస్‌ఎస్ పాలనలో శరవేగంగా అమలు చేయబడుతున్నాయి.
1. శక్తివంతమైన జాతీయవాదాన్ని ప్రబోధించటం: ప్రపంచంలోని అన్ని జాతుల కన్నా మన జాతి మాత్రమే ఉన్నతమైనదని, శక్తివంతమైనదనే ఆధిక్య భావనను ప్రదర్శించడం. హిట్లర్, జర్మన్ జాతి ఆర్యన్ జాతి అని అది అన్ని జాతులు కన్నా గొప్పదని ప్రపంచాన్ని పరిపాలించే శక్తి దానికే ఉన్నదని ఒక కుహనా జాతీయ భావనని రెచ్చగొట్టాడు. ఆ విధంగా జర్మన్లను జాతి పేరుతో ఏకం చేయటానికి ప్రయత్నించాడు. మనదేశంలో ఆర్‌ఎస్‌ఎస్ హిందూ మతాన్ని ఒక జాతిగా అంటే హిందూ జాతిగా చెబుతూ ఇతర మతాలను ఇతర జాతులుగా నిర్వచిస్తూ, మనమంతా ‘హిందువులం, సింధూ నది బిందువులం. మన జాతి అత్యుత్తమమైనది, మన గతం ఎంతో గొప్పది, మనం విశ్వ గురువులం అంటూ లేని అధిక్యతను ప్రచారం చేస్తూ ఇతర మతాల మీద ద్వేష భావాన్ని రెచ్చగొట్టడం ద్వారా హిందువులను ముస్లింలకు వ్యతిరేకంగా పోలరైజ్ చేయటం చూస్తూనే ఉన్నాం. హిట్లర్ యూదులను టార్గెట్ చేస్తే మన దేశంలోని ఆర్‌ఎస్‌ఎస్ ముస్లింలను, క్రిస్టియన్లను, దళితులను టార్గెట్ చేస్తూ ఉంది.
2.మానవ హక్కుల పట్ల వ్యతిరేకత: మనుషులకు కొన్ని సహజమైన హక్కులు ఉంటాయని, ఆ హక్కులను గౌరవించాల్సి ఉంటుందని గుర్తించకపోవడం. ఇప్పుడు మనదేశంలో మానవ హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా కొనసాగుతున్నది. ప్రజలు ఏ దుస్తులు ధరించాలో, ఏ ఆహారాన్ని భుజించాలో నిర్ణయించుకునే హక్కు రాజ్యాంగం కల్పించింది. ఆ హక్కుల మీద ఈ రోజున దాడి జరుగుతున్నది. మాంసాహారం తింటే తామస ప్రవృత్తి వస్తుందని, బ్రాహ్మణ సాత్వికాహారం తినాలని ప్రచారం చేస్తున్నారు. భారతదేశంలో 90 నుంచి 95శాతం మంది మాంసాహారులే. కేవలం ఐదు శాతం మంది మాత్రమే శాఖాహారులు. ఐదుశాతం మంది ఆహారపు అలవాట్లను 95శాతం మంది మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ప్రపంచంలో సైన్స్‌తో పాటు అనేక రంగాలలో కొత్తకొత్త ఆవిష్కరణలు చేసిన శాస్త్రవేత్తలు అందరూ మాంసాహారులే ఆ విషయాన్ని మరుగుపరిచి వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. జర్నలిస్టులు, మేధావులు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రాస్తే, గళమెత్తితే, అది దేశ వ్యతిరేకత అని వారి మీద రాజద్రోహం కేసులను మోపటం మనం కళ్ళ ముందు చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వం మీద వ్యతిరేకంగా రాస్తే అది దేశానికి వ్యతిరేకం ఎలా అవుతుంది? అలా కాదని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యక్తపరిచిన అభిప్రాయాలు, దేశ వ్యతిరేకంగా వ్యక్తపరిచినవిగా భావించ కూడదని కూడా సుప్రీంకోర్టు అనేకసార్లు చెప్పింది. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తే అది దేశ వ్యతిరేకమని ప్రచారం చేయడమే ఫాసిస్టు లక్షణాల్లో ఒకటి.
3. ఒక శత్రువును సృష్టించుకుని దానికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టడం: లేని శత్రువుని, శత్రువు కాని వారిని శత్రువులుగా సృష్టించి ఆ శత్రువు మన మీద దాడి చేయబోతుంది. మనమందరం ఐక్యమై దానికి వ్యతిరేకంగా పోట్లాడాలి. ఆనాడు హిట్లర్ యూదులను శత్రువులుగా చిత్రీకరించి వారిని అంత మొందించే ప్రయత్నం చేశాడు. ఈనాడు మనదేశంలో ఆర్‌ఎస్‌ఎస్ ముస్లింలను, క్రిస్టియన్లను, కమ్యూనిస్టు లను శత్రువులుగా చిత్రీకరించటం చూస్తున్నాం.
4. స్త్రీలను చిన్నచూపు చూడటం: హౌలో కాస్ట్ మ్యూజియంలోని పోస్టర్ మీద రాసి ఉన్న ఫాసిస్టు లక్షణాల్లో ఇది కూడా ఒకటి. స్త్రీలకు హక్కులను నిరాకరించడం, వంటింటి కుందేళ్లుగనే ఉండేట్లు చేయటం. మనదేశంలోని ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడు మోహన్ భగవత్ ఆడవాళ్లు వంటింటికే పరిమితం అవ్వాలని బోధిస్తున్నాడు. మనుధర్మ శాస్త్రంలో ఉన్నట్లు స్త్రీ చిన్నప్పుడు తండ్రి మీద, పెళ్లయిన తర్వాత భర్త మీద, విధవరాలు అయితే పిల్లల మీద మాత్రమే ఆధారపడి ఉండాలని, ఆమెకి ఎలాంటి స్వతంత్రత లేదని ఆ శాస్త్రం చెబుతుంది. అదే మన సమాజానికి హితమైనదని ఆ మనస్మృతియే మన రాజ్యాంగం అని, దానిని అమలు పరచడమే మా కర్తవ్యం అని ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారం చేస్తున్నది.
5. ప్రచార సాధనాలన్నీ తమ గుప్పెట్లో పెట్టుకోవటం: దేశంలోని ప్రచార సాధనాలు అన్ని తమ గుప్పెట్లో పెట్టుకుని తాము చెప్పే అబద్ధాలే నిజాలుగా ప్రచారం చేయడం. హిట్లర్ పాలనలో ప్రచార మంత్రిగా ఉన్న ”గోబెల్స్” ఒక అబద్ధాన్ని వందసార్లు చెప్తే అదే జనం నిజమని నమ్ముతారు అని అన్నాడు. అంటే అబద్ధాలే వాళ్ల ప్రచార ఆయుధాలు. ఈనాడు మన దేశంలో జాతీయ టీవీ చానల్స్ 70కి పైగా టీవీ 18 నెట్‌వర్క్ ఆధీనంలో ఉన్నాయి. దీని యజమాని అంబానీ. అంబానీ ఇప్పుడున్న ఆర్‌ఎస్‌ఎస్‌కు, ప్రభుత్వానికి అత్యంత సన్నిహితుడు. ప్రభుత్వ వ్యతిరేక గళం, ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపే ఎన్డీటీవీ సహితం ఆదాని హస్తగతం చేసుకున్నాడు. అదాని మోడీ ప్రభుత్వానికి ఆప్త మిత్రుడు. ఇప్పటి ప్రభుత్వం మీడియా మొత్తాన్ని నియంత్రించడం, ఎవరైనా ప్రభుత్వాన్ని విమర్శించే ది వైర్ లాంటి, దైనిక్ భాస్కర్, న్యూస్ క్లిక్ లాంటి, ఇతర మాధ్యమాల మీద సిబిఐ, ఈడీ, ఇన్‌కమ్ టాక్స్ లాంటి దర్యాప్తు సంస్థలు దాడి చేయటం. స్వతంత్రంగా ఉండాల్సిన ఈ సంస్థలను తమ జేబుసంస్థలుగా మార్చు కోవటం, దాడులు చేసి లొంగదీసు కోవడానికి ప్రయత్నం చేయటం, లొంగని వాళ్ళ మీద కేసులు పెట్టడం జైలుపాలు చేయటం మన దేశంలో నిత్య కృత్యంగా మారింది.
(మిగతా రేపటి సంచికలో)
సెల్:9704934614
6010
(నిన్నటి సంచిక తరువాయి)
6.జాతీయ భద్రత: మన జాతి మీద ఇతర జాతులు యుద్ధం చేయబోతున్నాయి అనే ఒక బూచిగా చూపటం. వాళ్లు యుద్ధం చేయబోతున్నారు కాబట్టి మనం భద్రంగా ఉండాలి అని అంటే ముందు మన అంతర్గతంగా ఉన్న శత్రువులను ముఖ్యంగా ముస్లింలను, క్రిస్టియన్లను, దళితులను, కమ్యూనిస్టులను తుదముట్టించాలి. వీళ్లకు వ్యతిరేకంగా జాతిని ఐక్యం చేయాలి అనే భావనలను ప్రచారంలోనూ ఆచరణలోనూ పెట్టే ప్రయత్నం చేయటం. జాతీయ భద్రతకు ఎలాంటి ముప్పు లేకపోయినప్పటికీ ఏదో ప్రమాదం సంభవించబోతుంది అని ప్రజలలో భయాం దోళనలు కలిగించే ప్రచారాలు చేసి ఎన్నికలలో లబ్ది పొందటం. పుల్వామా దాడి ఘటన దీనికి రుజువు. పాకిస్థాన్ టెర్రరిస్ట్ చేతుల్లో 40మందికి పైగా మన వీరజవాన్లు వీరమరణం పొందారు. వాళ్లు రోడ్డుమార్గం గుండా కాకుండా విమాన మార్గం ద్వారా వచ్చి ఉన్నట్లయితే వాళ్ల ప్రాణాలు పోయేవి కాదు. అలాంటిది అవసరమని విమానాలు పంపాలని, ఆనాటి కాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ప్రధానికి, హౌంమంత్రికి, రక్షణమంత్రికి, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌కి చెప్పినప్పటికీ ఎలాంటి సౌకర్యం ఇవ్వకపోగా 40మంది జవాన్ల మరణాలలో జరిగిన ప్రభుత్వ తప్పిదాన్ని ఎవరి వద్ద చెప్పవద్దని సత్యపాల్ మాలిక్‌కు హుకుం జారీ చేసినట్లుగా ఆయనే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆ దాడి అనంతరం సర్జికల్ స్ట్రైక్. ఆ సర్జికల్ స్ట్రైక్‌ని అడ్డం పెట్టుకొని దేశంలో జరిగిన ఎన్నికల్లో లబ్ధి పొందారు. ఇలాంటివన్నీ ఫాసిస్టు లక్షణాలే, మన దేశంలో మనం గమనిస్తూనే ఉన్నాం.
7. మతం, రాజకీయాలు, పరిపాలన కలగలిసిపోవడం: మన దేశం ఒక సెక్యులర్ రాజ్యం. ఫెడరల్ వ్యవస్థ. అంటే సమాఖ్య దేశం. బహుళ సంస్కృతులు ఉన్న దేశం. సెక్యులర్ స్ట్రక్చర్. సెక్యులరిజం అంటే రాజ్యానికి మతం ఉండకూడదు. మత ప్రసక్తిలేని లౌకిక రాజ్యం. అంటే పరిపాలకులు మత ప్రచారాలలోనూ, మత క్రతువులలోనూ పాల్గొనరాదు. దేశంలోని ప్రజలు వారు ఏ మతాన్ని అయినా అవలంబించవచ్చు. ఏ మతంలోకి అయినా మారవచ్చు. అసలు మతమే అవసరం లేదు అనుకునే వారు మతరహితులుగా ఉండే అవకాశం కూడా రాజ్యాంగం కల్పించింది. అలాంటి గుండెకాయ లాంటి రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మోడీ ప్రభుత్వం మత క్రతువులలో పాల్గొనటమే కాదు, మత ప్రచారాలను ప్రోత్సహించడం, మత విద్వేషాలు రెచ్చగొట్టడంలో కూడా ముందే ఉన్నది. మతం వ్యక్తిగతం. పరిపాలనలో మతాన్ని కలపకూడదు. కానీ కుంభమేళాలు, చండీ యాగాలు, సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్‌లో భూమి పూజలు లాంటి వాటిలో పాల్గొంటూ, సమాజంలో భక్తి పేరుతో, దేవుడి పేరుతో ప్రజల మధ్య విభజనను పెంచుతున్నది. మన మనదేశంలో స్వతహాగా ఉన్న రాజ్యాంగంలో పొందుపరిచిన సెక్యులరిజం అన్నదాన్ని తీసివేయాల్సిందే అని ఆర్‌ఎస్‌ఎస్ బహిరంగంగానే ప్రకటిస్తున్నది. ఆ పదాన్ని తొలగించటానికి అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నది. సెక్యులరిజాన్ని తీసేసి ఈ దేశాన్ని ఒక మత రాజ్యాంగ మార్చాలని కుట్రలు పన్నుతున్నది ఆర్‌ఎస్‌ఎస్. ఇది ఫాసిస్టు లక్షణమే.
9. కార్పొరేట్ అధిపత్యాన్ని సమర్థించడం: కార్పొరేట్ శక్తులు బలపడేలా చూడటం. ఈ శక్తులే ప్రభుత్వం మీద పెత్తనం చెలాయించడం. వాళ్ల చెప్పు చేతల్లోనూ, వాళ్ల కనుసన్నల్లోనే ప్రభుత్వాన్ని నడపటం. ఆశ్రిత పెట్టుబడిదారీ విధానాన్ని పెంచి పోషించటం. ప్రపంచంలో 603వ స్థానంలో ఉన్న ఆదాని, మోడీ అధికారంలోకి వచ్చిన 2014 తర్వాత నుండి మొన్న మొన్నటి వరకు ప్రపంచంలో మూడో స్థానానికి ఎలా ఎదిగాడు? మోడీ, మోడీ ప్రభుత్వం అదాని లాంటి కార్పొరేట్ శక్తుల ఎదుగుదలకు నియమ నిబంధనలను కూడా ఉల్లంఘించి ఆదానికి సాయపడటం వలనే అది సాధ్యమైంది. అదాని మోడీ మైత్రి గురించి పార్లమెంట్లో ప్రస్తావిస్తే ప్రభుత్వం మౌనమే సమాధానం. అంతేకాదు వేరే కుంటి సాకులు చూపుతూ ఎదురు దాడి చేస్తూ, ప్రభుత్వమే పార్లమెంటు జరగకుండా స్తంభింపజేయటం మనం చూసాం. పార్లమెంటు సభ్యులు ఆ విషయాన్ని ప్రస్తావిస్తే, వారు ప్రస్తావించిన విషయాలను రికార్డుల నుంచి తొలగించడం, మైకులను కట్ చేయడం మోడీ ప్రభుత్వ దమననీతికి, ప్రజాస్వామ్యం మీద కనీస గౌరవం లేకపోవటానికి నిదర్శనం. కార్పొరేట్లకు కొమ్ము కాయటమంటే దేశంలోని కార్మిక, కర్షక సమస్త శ్రామిక వర్గాన్ని అణిచి ఉంచటం.
10.ప్రతి దాన్ని నేరంగా చూపించడం: నేరానికి శిక్ష వేయటం. ఒక మనిషి నేరం చేశాడని ఆరోపణ చేస్తే సరిపోదు. రాజ్యాంగం ప్రకారం ఒక రూల్ ఆఫ్ లా ఉన్నది. సహేతుకమైన ఎటువంటి అనుమానానికి తావులేని పద్ధతిలో నేరం చేశాడని రుజువైతే తప్ప అతను నేరస్తుడు అని అనటానికి వీలు లేదు. కానీ ఈరోజు దేశంలో ఏమిజరుగుతున్నది? వాళ్లే ఆరోపిస్తారు. వాళ్లే విచారణ జరుపుతారు. వాళ్లే శిక్షలు వేస్తారు, వాళ్లే అమలు జరుపుతారు. అన్నీ వాళ్లే. ఇది ఆధునిక ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. గత ఎనిమిది సంవత్సరాలుగా బుల్డోజర్ పాలన సాగుతోంది. ఒక బుల్డోజర్‌తో ఒక ఇంటిని కూలగొడుతారు. ఒక భిన్న అభిప్రాయాన్ని కూలగొడతారు. ముస్లింలను క్రిస్టియన్లు, దళితులను కూలగొడతారు. నా మాట వినని వాళ్ళందరినీ కూల కొడతామంటారు. ఫాసిస్టులు మాత్రమే ఇలాంటి పనులకు ఒడికడతారు.
11.అవినీతి: మనదేశంలో మధ్యప్రదేశ్‌లోని వ్యాపం కుంభకోణం కానీ, కర్నాటకలోని అయితే ఇటీవల ఓడిన బీజేపీ ప్రభుత్వం నలభై శాతం కమిషన్ సర్కార్‌గా ముద్రపడింది. కమిషన్ లేకుండా ఏ పనికి క్లియరెన్స్ ఉండదు. వారి అనుకూల కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ సైతం 40శాతం కమిషన్‌కి బలయ్యాడు. నేను అలా ఇవ్వలేనని అలా ఇస్తే గిట్టుబాటు కాదని నన్ను అలా మానసికంగా హింస పెట్టవద్దని చెబుతూ ఆత్మహత్య చేసుకున్నాడు. కర్నాటక కాంట్రాక్టర్ల సంఘం ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి ఈ ఘటనను గురించి అది నిజమేనని ధృవపరుస్తూ న్యాయం చేయమని ఉత్తరాలు కూడా రాసుకున్నారు. రాఫెల్ కుంభకోణం, ప్రభుత్వ సంస్థలను ప్రయివేటు వారికి కారు చౌకకు అమ్మటం, ప్రయివేటు పెట్టుబడిదారుల బకాయిలను వన్ టైం సెటిల్‌మెంట్ పేరుతో వారికి లబ్ది చేకూర్చటం, గత ఎనిమిది సంవత్సరాలలో పెట్టుబడిదారుల రుణాలు రూ.12.50 లక్షల కోట్లు మాఫీ చేయడం, అసెట్ మానిటైజేషన్ పేరుతో ప్రభుత్వ ఆస్తులన్నింటినీ కారు చౌకకు పెట్టుబడిదారులకు అద్దెకివ్వటం ఇవన్నీ ఫాసిస్ట్ లక్షణాల నుంచి పుట్టినవే.
అందువల్ల ఈ రోజున భారత సమాజం ఎదుర్కొంటున్న ఫాసిజం మరింత లోతైనది. మరింత ప్రమాద భరితమైనది. భారతదేశంలో ఉన్న ఆధిపత్య మతం, పెత్తందారి కులాలు, నిచ్చెన మెట్ల కులవ్యవస్థ, ఆ కుల అసమానతల సమర్థన, బ్రాహ్మణీయ భావజాల అధిపత్యం, జాతుల అణిచివేత, భాషాధిపత్యం లాంటి పరిస్థితులు యూరప్‌లో ఒకనాడు ఉద్భవించిన అంతర్జాతీయ ఫాసిజానికి, ఇవి జాతీయంగా ఉన్న అదనపు లక్షణాలు తోడ్పడ్డాయి. ఈ లక్షణాలు భారతదేశంలో ఫాసిజం పెరగటానికి అనువైన భూమికను ఏర్పాటు చేశాయి. గత తొమ్మిది సంవత్సరాలుగా మనదేశంలో ముఖ్యంగా సాంస్కృతిక రంగంలో ఈ ఫాసిజం విలయతాండవం చేస్తున్నది. ఫాసిజం భారతదేశంలో పొందిన నిర్దిష్ట రూపం హిందూ బ్రాహ్మణీయ ఫాసిజం. అది బహుళత్వ సంస్కృతిని తొక్కిపట్టి ఏకాత్మకంగా మార్చడం దాని లక్ష్యం. మన సమాజంలో బహుళత్వంతో నిండిన భారత చరిత్రను తుడిచివేసి హిందూ మతోన్మాద, వర్ణశ్రమ ధర్మ చరిత్రనే భారత చరిత్రగా ప్రకటించడం దాని ముఖ్య ఉద్దేశం. ఈ లక్ష్యాల కోసం ఎంతటి హింసకైనా, ఎంతటి చరిత్ర వక్రీకరణకైనా తెగించటం దాని కార్యక్రమం. ఇలాంటి భావజాలన్నీ ప్రతి ఘటించడం అత్యవసరం. కూలదోయటం అంతకన్నా అవసరం. మానవత్వానికి శత్రువైన ఆర్‌ఎస్‌ఎస్ అన్నికంలో ప్రతిఘటించగలగాలి అది పీడిత ప్రజలకు వ్యతిరేకమైనది. కనీసపు ప్రజాస్వామ్యానికి పూర్తిగా అది సమాజంలో అది ఆధిపత్యాన్ని నిలదొక్కుకున్నట్లయితే ఈ పాటి ప్రజాస్వామ్యం కూడా ఉండదు. ఈ దేశంలోని శూద్రులకు అది శత్రువు. దాన్ని ఓడించాలి. కమ్యూనిస్టులు ప్రగతిశీల శక్తులు ఒక రెడ్ ఆర్మీగా తయారవ్వాలి. భావజాల రంగంలో ఆర్‌ఎస్‌ఎస్ విషతుల్య భావాలను ప్రతి మనిషికి చేరవేసి జాగృతం చేయాలి. ఆ భావజాలం సమాజంలోని సామాన్య ప్రజానీకానికి ఎంత ప్రమాదమో, ఎంత భయంకరమైనదో హెచ్చరించాలి. ఇప్పటివరకు జరిగిన కృషి చాలా తక్కువ. చేయవలసిన కృషి ఎంతో ఉన్నదని ప్రగతిశీల శక్తులు కమ్యూనిస్టులు గుర్తించాలి.
– పి.బి.చారి
సెల్:9704934614