– డాక్టర్ వి.నాగేశ్వర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
చలి, పొగమంచు కారణంగా కరోనా వేరియంట్ జెఎన్1 వేగంగా విస్తరిస్తున్నట్టు ప్రముఖ ఊపిరితిత్తుల ప్రత్యేక వైద్యనిపుణులు (పల్మనాలజిస్ట్) డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతూ రోగులకు అందిస్తున్న చికిత్స అనుభవాలతో ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. బీపీ, మధుమేహం, గుండె సమస్యలు, మూత్ర పిండాల సమస్యలు, శస్త్రచికిత్సలు చేయించుకున్న వారు, 60 ఏండ్లు పైబడ్డ వారు, చిన్నపిల్లలు ఎట్టి పరిస్థితుల్లో ఉదయం మంచులోకి వెళ్లకూడదని సూచించారు. సూర్యోదయం కాకముందే ఉదయాన్నే మంచులో తిరిగే వారిలో లేదా గుంపు ఉన్న ప్రాంతాల్లో అధిక సమయం గడిపే వారు ఎక్కువ ఇబ్బందిని ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇరుకు రవాణా సదుపాయాల్లో ప్రయాణించడం తగ్గించుకోవాలని కోరారు. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు రానున్న 15 రోజుల వరకు పిల్లల్ని ఎట్టి పరిస్థితిలో బయటికి పంపించకపోవడం మంచిదని పేర్కొన్నారు. తప్పనిసరి బయటికి వెళ్లినప్పుడు ఫేస్ మాస్క్ ధరించాలనీ, ఎన్95 ఫేస్ మాస్క్ పెట్టుకుంటే అది 50 నుంచి 60 శాతం వరకు కాపాడగలుగుతుందని డాక్టర్ నాగేశ్వర్ తెలిపారు. వైరల్ ఇన్ఫెక్షన్లతో వచ్చే వారిలో ఎక్కవగా గొంతులో గరగర, సర్ది, తుమ్ములు, పొడి దగ్గు, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, మెడనొప్పి, జ్వరం తదితర లక్షణాలు కనిపిస్తున్నాయని తెలిపారు. కరోనా లక్షణాలు కనిపించిన మొదటి రోజే డాక్టర్‌ను సంప్రదించి సూచనలు పాటిస్తే వంద శాతం బయటపడొచ్చని చెప్పారు. విటమిన్ డీ మాత్రలు, విటమిన్ సీ మాత్రలు, అందుబాటులో ఉంచుకుని, మొదటి రోజు నుంచే వాడాలని సూచించారు. గొంతులో ఉప్పు కలిపిన గోరువెచ్చ నీరుని లేదా నాలుగు గంటలకు ఒకసారి, సాల్ట్ గార్గలింగ్ చేయాలి, బీటా డిన్ లేదా పోవా డిన్ లేదా అయోడిన్ సొల్యూషన్ ఆరు గంటలకు ఒకసారి గార్గలింగ్ చేయాలి, ఎప్పటికప్పుడు శరీరంలో నీరు తక్కువ కాకుండా తాగుతూ ఉండాలని సూచించారు. ఉదయం తిన్న తర్వాత గ్లాసుడు నిమ్మరసం, రాత్రిపూట తిన్న తర్వాత మజ్జిగలో జీరా వేసి కలిపి తాగాలని తెలిపారు. ఇన్ఫెక్షన్ లక్షణాలు ఉన్నట్టు అనుమానం వచ్చిన వెంటనే మూడు రోజులు బయటకు తిరగకుండా ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవడం తప్పనిసరి తెలిపారు. మొదటి రోజే ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించడం ముఖ్యమైన అంశంగా గుర్తించాలని పేర్కొన్నారు.
వీరికి ప్రమాదం
నూనె పదార్థాలు, బయట చిరుతిండ్లు తినడం, ఎవరైతే విపరీతమైన ఒత్తిళ్ళకు అలసటకు గురవుతారో అలాంటి వారిలో కరోనా వైరస్ తీవ్రంగా పెరగడానికి ఆస్కారం ఉందని డాక్టర్ నాగేశ్వర్ హెచ్చరించారు.