– అదుపు తప్పిన వాహనాలు
– బోల్తా పడిన ఓల్వో బస్సు.. చెలరేగిన మంటలు
– మహిళ సజీవ దహనం
– అనంతగిరిలో పొదల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
– పలువురికి తీవ్ర గాయాలు
– శంషాబాద్‌లో కల్వర్టు గుంతలో పడిన కారు, ఆటో, బైక్ ఇద్దరు మృతి
నవతెలంగాణ-మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి / అలంపూర్/ శంషాబాద్, వికారాబాద్ ప్రతినిధి
సంక్రాంతి పండుగకు జనమంతా పట్టణం నుంచి పల్లెబాట పట్టగా..ఈ ప్రయాణాలు రోడ్డు ప్రమాదాలతో విషాదకరంగా మారాయి. శనివారం రెండు బస్సులు అదుపు తప్పాయి. ఓ ప్రయివేట్ ఓల్వో బస్సు బోల్తా పడటంతో మంటలు చెలరేగి మహిళ సజీవ దహనమైంది. మరోచోట ఆర్టీసీ బస్సు పొదల్లోకి దూసుకెళ్లింది. స్వల్ప గాయాలతో ప్రయాణికులు బయటపడ్డారు. ఇంకో చోట కల్వర్టులో కారు, ఆటో, బైక్ పడిపోయాయి. ఈ ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందారు. ఈ ఘటనలు గద్వాల, వికారాబాద్ జిల్లాల్లో జరిగాయి. స్థానికులు, పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..
హైదరాబాద్ మియాపూర్ నుంచి శుక్రవారం రాత్రి 12 గంటలకు అమేజాన్ జగన్ ఓల్వో బస్సు కడపకు బయలుదేరింది. బస్సులో ఇద్దరు డ్రెవర్లు ఉన్నారు. బస్సు జోగులాంబ గద్వాల జిల్లా (బీచుపల్లి) కృష్ణానది దాటగానే ఎర్రవెల్లి మండలం పదవ బెటాలియన్ వద్ద తెల్లవారుజామున అదుపు తప్పి బోల్తాపడింది. వెంటనే మంటలు చెలరేగడంతో డ్రైవర్లు అప్రమత్తమై ప్రయాణికులను కిందకు దింపారు. పెట్రోలింగ్ పోలీసులు, స్థానికులు సహాయ చర్యల్లో పాల్గొన్నారు. అయితే, హైదరాబాద్ మెహిదీపట్నానికి చెందిన మాలతి(40) చెయ్యి కిటికీలో ఇరుక్కపోవడంతో మంటల్లో కాలిపోయింది. ఆమెను కాపాడేందుకు తోటి ప్రయాణికులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో మహబూబ్‌నగర్ ఆస్పత్రికి తరలించారు.
పొదల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
వికారాబాద్ జిల్లా తాండూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వికారాబాద్ నుంచి తాండూర్‌కు వెళ్తోంది. ఈ సమయంలో బస్సులో సుమారు వంద మంది ప్రయాణికులు ఉన్నారు. అనంతగిరి ఘాట్ చివరి మలుపు వద్దకు రాగానే బస్సు బ్రేక్స్ ఫెయిల్ కావడంతో బస్సు పొదల్లోకి దూసుకెళ్లింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహారించడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ముగ్గురి కాళ్లు విరిగాయి. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని ప్రయాణికులను 108లో వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో కల్వర్టులో కారు, ఆటో, బైక్ పడ్డాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు. కాప్రా ఈసీఐఎల్ శ్రీరాంనగర్ కాలనీకి చెందిన బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్‌లో సైంటిఫిక్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న మేరువ ఆదిశేష రెడ్డి(57) తన తల్లి ఎం.రాములమ్మ(88)తో కలిసి కారులో నేషనల్ హైవే 44పై వెళ్తున్నారు. ఘాన్సీమియాగూడ గ్రామ పరిధిలోని కల్వర్టు నిర్మాణం జరుగుతున్న ప్రదేశానికి రాగానే ముందు వెళ్తున్న ఆటోను కారు డ్రైవర్ వేగంగా ఢకొీట్టాడు. దాంతో కారు, ఆటోతోపాటు ద్విచక్ర వాహనం అదుపుతప్పి పక్కనే క్యాష్ బ్యారియర్లు సిమెంట్ దిమ్మెలను ఢకొీని కల్వర్టు నిర్మాణం కోసం తవ్విన గుంతలో పడిపోయాయి.
ఈ ప్రమాదంలో కారులోని ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. ఆటో డ్రైవర్ రాయన్నగూడ సిద్ధయ్య, ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న గొల్ల ఆంజనేయులు, బాలిక గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కల్వర్టు గుంతలో నుంచి వాహనాలను బయటకు తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శంషాబాద్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎస్.శ్రీనాథ్ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు జరుగుతోంది.