అనంతసాగర్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

– ఓకే కుటుంబానికి చెందిన ఇద్దరు యువకులు మృతి
– ఒకరు రైల్వే ట్రైనీ టీసీ.. మరొకరు సాఫ్టువేర్‌..
నవతెలంగాణ-హసన్‌పర్తి
హన్మకొండ జిల్లా హసన్‌పర్తి మండలంలోని అనంతసాగర్‌ క్రాస్‌ రోడ్డు వద్ద కరీంనగర్‌-హన్మకొండ ప్రధాన రహదారిపై సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు అక్కడికక్కడే మృతి చెందారు. ఎదిగిన బిడ్డలను కోల్పోయిన ఆ తల్లిదండ్రుల ఆర్తనాదాలు స్థానికులను కన్నీరు పెట్టించింది. ఎల్కతుర్తి ఇన్‌స్పెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌, ఎస్‌ఐ పరమేష్‌, హసన్‌పర్తి ఎస్‌ఐ దేశిని విజరు కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలం కందుగులకు చెందిన ఇప్పాలపల్లి మనోహర్‌ కందుగులలో హౌటల్‌ నడుపుకుంటూ తన ఇద్దరు పిల్లలను కష్టపడి పెద్ద చదువులు చదివించి ప్రయోజకులను చేశాడు. పెద్దకుమారుడు శివరామక్రిష్ణ (24) ఇటీవలే రైల్వేలో టికెట్‌ కలెక్టర్‌ కొలువుకు ఎంపికై శిక్షణ పొందుతున్నాడు. రెండవ కుమారుడు హరికృష్ణ (23) హైదరాబాద్‌లో ఓ ప్రయివేట్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. కాగా, వీకెండ్‌ కావడంతో స్వగ్రామానికి వచ్చిన అన్నదమ్ములు.. సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు తమ ద్విచక్రవాహనంపై హైదరాబాద్‌కు బయలుదేరారు. మార్గమధ్యలో అనంతసాగర్‌ క్రాసు రోడ్డు వద్ద తెల్లవారుఝామున 5:39 గంటలకు ఎదురుగా అతివేగంతో వచ్చిన మరో వాహనం వీరి ద్విచక్రవాహనాన్ని వేగంగా ఢ కొట్టింది. దాంతో యువకులిద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద స్థితిని పరిశీలించారు. మృతుల తల్లిదండ్రులకు సమాచారం అందించి మతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం మార్చురీకి తరలించారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న సీసీ టీవీ పుటేజీని పరిశీలిస్తున్నారు. మృతుల తండ్రి మనోహర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు హసన్‌పర్తి అడ్మిన్‌ ఎస్‌ఐ దేశిని విజరుకుమార్‌గౌడ్‌ తెలిపారు.