నేషనల్‌ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం

నేషనల్‌ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం– బైక్‌ను వెనక నుంచి ఢకొీన్న కంటైనర్‌
–  తల్లి, కొడుకు మృతి
నవతెలంగాణ-ఆసిఫాబాద్‌
ఆసిఫాబాద్‌ నేషనల్‌ హైవేపై ఓ బైక్‌ను వెనుక నుంచి వచ్చిన కంటైనర్‌ ఢ కొట్టడంతో బైక్‌పై వెళ్తున్న తల్లి, కొడుకు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాగజ్‌నగర్‌ మండలం బట్టుపల్లికి చెందిన సర్వర్‌ తన భార్య షహారాభాను(35), కొడుకు షేక్‌ ఆసిఫ్‌(16)తో కలిసి ఆసిఫాబాద్‌ మండలంలోని చిర్రకుంట గ్రామంలోని తన బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తున్నారు. ఆసిఫాబాద్‌ దాటిన తర్వాత జంక్షన్‌ వద్ద నేషనల్‌ హైవేపై రెబ్బెన వైపు నుంచి వస్తున్న కంటైనర్‌ బైకును వెనకాల నుంచి ఢ కొట్టడంతో బైక్‌పై వెనకాల ఉన్న తల్లి, కొడుకులు పడిపోగా వారి మీది నుంచి కంటైనర్‌ వెళ్లింది. దాంతో వారు అక్కడికక్కడే మరణించారు. తరువాత కంటైనర్‌ అదుపుతప్పి రోడ్డుకు అవతలి వైపుకు వెళ్లి ఆగింది. ఇదే సమయంలో వాంకిడి వైపు నుంచి వస్తున్న లారీ కంటైనర్‌ను ఢ కొట్టింది. ఏం జరిగిందని సర్వర్‌ చూసేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కండ్ల ముందు భార్య, కొడుకు మృతదేహాలను చూసి రోదించిన తీరు కలిచివేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. కంటైనర్‌ అతి వేగం వల్లనే ప్రమాదం జరిగినట్టు పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. నేషనల్‌ హైవే పై మృతదేహాలతో నిరసన వ్యక్తం చేశారు. కాగా, రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరగడం బాధగా ఉందని, మూలమలుపు కొంత ఇబ్బందికరంగా మారిందన్నారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.