విజయనగరం సమీపంలో ఘోర రైలు ప్రమాదం

 Near Vizianagaram A terrible train accident– ఆగి ఉన్న రైలును ఢకొీన్న మరో రైలు
– 8 మంది దుర్మరణం
– వంద మందికి గాయాలు
– కంట్రోల్‌ రూమ్‌ల ఫోన్‌ నెంబర్లు
విజయనగరం కలెక్టరేట్‌ 9493589157
విజయనగరం రైల్వే స్టేషన్‌ 8978080006
విశాఖ రైల్వే కంట్రోల్‌ రూం 8978080777
విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. లక్కవరపుకోట మండలం భీమాళి సమీపాన రాత్రి 7.15 గంటల సమయంలో జరిగిన దుర్ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు ప్రకటించారు. కాగా, 20 మందికి పైగా మరణించి ఉంటారని స్థానికులంటున్నారు. వందమంది వరకూ గాయపడినట్లు సమాచారం. విశాఖ నుంచి పలాస వెళ్తున్న పాసింజర్‌ రైలు కంటకాపల్లి దాటిన తరువాత భీమాళి సమీపాన ఎలక్ట్రికల్‌ లైన్‌ నుంచి విద్యుత్‌ సరఫరా లేక నిలిచిపోయింది. దాని వెనకే వస్తున్న పాసింజర్‌ రైలుకు కంటకాపల్లి స్టేషన్‌లో గ్రీన్‌ సిగల్‌ ఇవ్వడంతో ఆ రైలు వచ్చి పలాస రైలును ఢకొీంది. ఈ రెండు రైళ్లకు చెందిన నాలుగు బోగీలు నుజ్జునుజ్జయ్యాయి. ఏపీ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ, ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రధాని నరేంద్రమోడీ, ఏపీ సీిఎం జగన్‌మోహన్‌రెడ్డి, గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌, వివిధ పార్టీల నేతలు మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున సీిఎం నష్టపరిహారం ప్రకటించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన మృతులకు రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున సహాయం అందించాలని సీిఎం జగన్‌ అధికారులను ఆదేశించారు.
విజయనగరం : విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం భీమాళి సమీపాన ఆదివారం రాత్రి 7.15 గంటల సమయంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. సిగలింగ్‌ వ్యవస్థ వైఫల్యమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమిక సమాచారం.ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు ఎనిమిది మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. అయితే, మృతుల సంఖ్య 20పైనే ఉంటుందని స్థానికులు చెప్తున్నారు. వందమంది వరకు గాయపడినట్లు సమాచారం. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం… విశాఖ నుంచి పలాస వెళ్తున్న పాసింజర్‌ రైలు కంటకాపల్లి దాటిన తరువాత భీమాళి సమీపాన ఎలక్ట్రికల్‌ లైన్‌ నుంచి విద్యుత్‌ సరఫరా లేక నిలిచిపోయంది. దాని వెనుకే వస్తున్న విశాఖ-రాయగడ పాసింజర్‌ రైలుకు కంటకాపల్లి స్టేషన్‌లో గ్రీన్‌ సిగల్‌ ఇవ్వడంతో ఆ రైలు స్పీడ్‌గా వచ్చి విశాఖ-పలాస రైలును బలంగా ఢకొీంది. దీంతో, ఈ రెండు రైళ్లకు చెందిన చెరో రెండు భోగీలు పట్టాలు తప్పడమే కాకుండా నుజ్జునుజ్జయ్యాయి. పెద్ద శబ్దం రావడంతో వెంటనే భీమాళి తదితర గ్రామాల ప్రజలు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న రైల్వే అధికారులు, విజయనగరం జిల్లా అధికారులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను ముమ్మరం చేశారు. రాత్రి 11 గంటల వరకు ఎనిమిది మంది మృతదేహాలను బయటకు తీశారు. మృతుల్లో విజయనగరం జిల్లా జామి మండలం గడికొమ్ము గ్రామానికి చెందిన చిప్పాడ రవి (30), గదబవలసకు చెందిన మజ్జి రాము, గరివిడి మండలం కాపుశంబాం గ్రామానికి చెందిన గిరిజాల లక్ష్మి, విశాఖ-రాయగడ పాసింజర్‌ రైలు డ్రైవర్‌ ఉన్నట్లు గుర్తించారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. సుమారు వంద మంది వరకు గాయపడినట్లు తెలుస్తోంది. రైళ్లు ఢకొీనడంతో ఘటనా స్థలంలో విద్యుత్‌ తీగెలు తెగిపోవడంతో ఆ ప్రాంతమంతా అంథకారం నెలకొంది. దీంతో, సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. రైళ్లలో ప్రయాణికులను స్వగ్రామాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. విజయనగరం, ఎస్‌.కోట డిపోల నుంచి బస్సులను రప్పించి ప్రయాణికులను తరలించారు. జిల్లాలోని పలు అగ్నిమాపక వాహనాలు చేరుకొని సహాయ చర్యల్లో నిమగమయ్యాయి. క్షతగ్రాతులను విజయనగరం, విశాఖ, ఎస్‌కోట తరలించారు.
ఆగిన రైళ్లు… ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు
ప్రమాదంతో రైలు భోగీలు పక్కనున్న పట్టాలపై ఎగిరిపడడంతో అటు విశాఖపట్నం, ఇటు రాయగడ, భువనేశ్వర్‌వైపు వెళ్లాల్సిన పలు రైళ్లు విజయనగరం రైల్వేస్టేషన్‌లో నిలిచిపోయాయి. సికింద్రాబాద్‌ వెళ్లే నాగావళి ఎక్స్‌ప్రెస్‌, ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్‌, కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌లను నిలిపివేశారు. ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌, చెన్నై వెళ్లే సంత్రగంజ్‌, కోర్బా తదితర రైళ్లు నిలిచిపోయాయి. గొట్లాం స్టేషన్‌లో సౌకర్యాలు లేకపోవడంతో ప్రయాణికులంతా రైలులో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.