భారత్‌లో తక్కువ నేరనిరూపణ రేటుపై ఎఫ్‌ఏటీఎఫ్‌ ఆందోళన

భారత్‌లో తక్కువ నేరనిరూపణ రేటుపై ఎఫ్‌ఏటీఎఫ్‌ ఆందోళనన్యూఢిల్లీ : మనీలాండరింగ్‌ కేసుల్లో పెండింగ్‌ ట్రయల్స్‌ సంఖ్యను తగ్గించాలని భారత్‌ను ప్యారిస్‌ కేంద్రంగా పని చేసే ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌ (ఎఫ్‌ఏటీఎఫ్‌) కోరింది. భారత్‌లో తక్కువ నేర నిరూపణ రేటుపై ఆందోళన వ్యక్తం చేసింది. మనీలాండరింగ్‌, టెర్రర్‌ ఫైనాన్సింగ్‌ వాచ్‌డాగ్‌ అయిన ఎఫ్‌ఏటీఎఫ్‌ తన నివేదికను ఇటీవల విడుదల చేసింది. భారత్‌ తప్పనిసరిగా నేరారోపణ ఆధారిత జప్తులను పెంచాలని వివరించింది.
ఎఫ్‌ఏటీఎఫ్‌ నివేదిక సమాచారం ప్రకారం.. 2019 ఆర్థిక సంవత్సరం నుంచి 2023 ఆర్థిక సంవత్సరం వరకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నేర నిరూపణ లేని జప్తులను రూ.16,497 కోట్ల మేర చేసింది. నేర నిరూపణ ఆధారంగా జరిగిన జప్తులు రూ.39 కోట్లుగా ఉన్నది. ఐదేండ్ల కాలంలో ఈడీ 4163 దర్యాప్తులను ప్రారంభించింది. ఇందులో 28 కేసులు శిక్షతో ముగిశాయి. 132 కేసుల్లో తదుపరి విచారణ జరపొద్దని ఈడీ నిర్ణయించింది. విచారణల సంఖ్య పెరుగుతున్నది కానీ ప్రాసిక్యూషన్‌ ఫిర్యాదుల సంఖ్య వేగంగా లేదు. నేర నిరూపణ రేటు పెంచటానికి ఈడీ, ప్రత్యేక న్యాయస్థానాలకు వనరులను మెరుగుపర్చాలని ఎఫ్‌ఏటీఎఫ్‌ సూచించింది.