పాముకాటుతో తండ్రీ కొడుకు మృతి

– ఆస్పత్రికి వెళ్లకుండా కట్టు కట్టుకున్న వైనం.
నవతెలంగాణ-రాజంపేట్‌
పాటుకాటు వేసిన వెంటనే ఆస్పత్రికి వెళ్లకుండా కట్టు కట్టుకుని వదిలేయడంతో తండ్రీకొడుకు మృతిచెందారు. ఈ విషాదకర ఘటన కామారెడ్డి జిల్లా రాజంపేట్‌ మండలంలోని షేర్‌శంకర్‌ తండాలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. ఎస్‌ఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. ముద్రిచ రవి(40) వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. శుక్రవారం వ్యవసాయ పనులు చేసి వచ్చి రాత్రి భోజనం చేసి పడుకున్నారు. రాత్రి 11:30 సమయంలో రవికి పాము కాటు వేయడంతో మెలకువ వచ్చింది. పామును చంపేసి.. దేవుడు పేరు మీద కట్టు కట్టుకున్నాడు. ఆ తర్వాత వారి కొడుకు వినోద్‌(11) చాతిలో నొప్పిగా ఉందని తల్లిదండ్రులకు చెప్పాడు. కొద్దిసేపట్లోనే బాలుడు మృతిచెందాడు. తదనంతరం తనకు కండ్లు తిరుగుతున్నాయని రవి చెప్పడంతో వెంటనే అంబులెన్స్‌ ద్వారా కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిం చారు. అప్పటికే పరిస్థితి విషమించి మృతిచెందాడు. పాము కాటు వేసినట్టు తెలియగానే.. ఆస్పత్రికి వెళ్తే ప్రాణాపాయం తప్పేదని స్థానికులు అన్నారు. రైతు భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ రాజు తెలిపారు.