
మండలం లోని గోవింద్ పెట్ గ్రామానికి చెందిన రావుట్ల సుజాత (22)ను శ్రీపాద లింబాద్రి అనే వ్యక్తి కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన పోలీసులు ఫిర్యాదును స్వీకరించడం లేదని అమ్మాయి తండ్రి రావుట్ల రాజన్న బుధవారం చెప్పారు. గోవింద్ పెట్ గ్రామానికి చెందిన రాజన్న కుమార్తె సుజాత నిజామాబాద్ లోని ఒక కళాశాలలో డిగ్రీ చదువుతుంది. 7 మార్చి 2024 నాడు కళాశాలకు వెళ్తున్నట్లు చెప్పి సుజాత ఇంటి నుంచి వెళ్లిందన్నారు. ఇంటి నుంచి వెళ్లిన సుజాతను అదే గ్రామానికి చెందిన వివాహితుడైన శ్రీపాద లింబాద్రి అనే వ్యక్తి కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడన్నారు. అతని తమ్ముడు శ్రీనివాస్, తల్లి యమున, సోదరి పద్మ సహాయ సహకారాలతో కిడ్నాప్ చేసి తీసుకెళ్లారన్నారు. తమ కుమార్తె అదృశ్యమైన తర్వాత లింబాద్రి కుటుంబ సభ్యులు గ్రామం నుంచి వెళ్లిపోయారన్నారు. లింబాద్రి ఫోన్ సైతం స్విచ్ ఆఫ్ లో ఉందన్నారు. అయితే మొదట తమ కుటుంబ సభ్యులు కోటగిరి సంజీవ్ పై అనుమానపడి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఆ తర్వాత తమకు శ్రీపాద లింబాద్రి అనే వ్యక్తి సుజాతను తీసుకెళ్లినట్లు తెలిసిందన్నారు. ఈ విషయమై ఫిర్యాదు చేయడానికి రాగా పోలీసులు దరఖాస్తును తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత 50 రోజుల నుంచి ఫిర్యాదు స్వీకరించాలని స్టేషన్ చుట్టూ తిరుగుతున్న పట్టించుకోవడంలేదని చెప్పారు. తమ అమ్మాయి సుజాతను కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన లింబాద్రి తో పాటు సహకరించిన వారిపై కేసు నమోదు చేసి విచారణ జరపాలన్నారు. తన కుమార్తె జాడను కనిపెట్టి తీసుకొని రావాలని ఆయన వేడుకొన్నారు. అసలు తన కుమార్తె జీవించి ఉందా లేదా అన్న అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ఇప్పటికైనా పోలీసులు తన ఫిర్యాదును స్వీకరించి విచారణ జరిపి కేసు నమోదు చేసి న్యాయం చేయాలని ఆయన కోరారు.