– పంచాయతీ సఫాయి కార్మికుడు మృతి
– వీధిన పడిన కుటుంబం
నవతెలంగాణ – నసురుల్లాబాద్
కంటి రెప్పలా కాపాడినా తండ్రి దూరమయ్యాడనే బాధ ఓ వైపు.. పరీక్ష కాలం మరో వైపు. ఇలాంటి పరిస్థితి పగవాడికి కూడా రాకూడదనే వేదన. అలాంటి తరుణంలో తండ్రి చనిపోయిన బాధను పంటి బిగువున భరిస్తూ.. పొంగుకొస్తున్న దుఖాన్ని ఆపుకుంటూ ఆ అమ్మాయి పరీక్షకు హాజరైంది. ఈ విషాదకర ఘటన కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. నసురుల్లాబాద్ గ్రామ పంచాయతీ సపాయి కార్మికుడు దండు శ్రీను (38) ఆకస్మికంగా మృతి చెందాడు. రాత్రి తండ్రి మరణం ఉదయం కూతురు స్రవంతి పడవ తరగతి పరీక్ష పుట్టెడు దుఃఖంలో నేడు పరీక్షకు హాజరైంది. నేడు మిర్జాపుర్ హై స్కూల్ ఉన్న పరీక్ష కేంద్రంలో పదోతరగతి వార్షిక పరీక్షలు ఉండగా, పరీక్ష రోజే తండ్రి ఆకస్మికంగా చనిపోయాడు. ఇంట్లో తండ్రి మృతదేహం ఉండగానే తప్పనిసరి పరిస్థితిలో పరీక్ష రాసింది. తండ్రి చనిపోయిన బాధ ఓ వైపు.. పరీక్ష మరోవైపు ఎటూ తేల్చుకోలేక పోయిన సందర్భంలో బంధువులు ధైర్యం చెప్పి పరీక్షకు పంపించారు. ఆ బాధను పంటి బిగువున భరిస్తూ.. పొంగుకొస్తున్న దుఖాన్ని ఆపుకుంటూ ఆమె పరీక్ష రాసింది. నస్రుల్లాబాద్ గ్రామపంచాయతీ సఫాయి కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్న దండు శ్రీను ఆకస్మికంగా మృతి చెందడంతో ఆ కుటుంబం వీధిన పడింది. శ్రీను కు భార్య , ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. గ్రామపంచాయతీ సిబ్బంది మృతి చెందడంతో ఎంపీ ఓ రాము, తాసిల్దార్ నవీన్ కుమార్ భార్య నాగమణిని ఓదార్చారు. పరీక్ష ముగిసిన వెంటనే వెళ్లి తండ్రి అంత్యక్రియల్లో స్రవంతి పాల్గొంది.