‘ప్రియమైన నాన్నా! హ్యాపీ ఫాదర్స్ డే! నీ ఎదురుగా నిలబడి నాటకీయంగా చేయి కలిపి విష్ చేయాలంటే నాకూ నీకూ ఇబ్బందే. మనమెంత ప్రేమగా ఉన్నా ఇలా ఫాదర్స్ డే అంటూ నిన్ను ఒక రోజుకి పరిమితం చేయడం ఏంటోగా ఉంటుంది డాడీ. నేనంటే నీకెంత ప్రేమో నువ్వంటే నాకూ అంతే. అవసరానికి అప్పుడప్పుడు భయం నటిస్తుంటాను కానీ ఒక్కోసారి నీ భుజంపై వాలి నిద్రపోవాలని చూస్తుంటాను. నా చదువు విషయంలో అందరూ నాకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు నువ్వూ వాళ్ళతోనే ఉన్నావనుకున్నా కానీ అమ్మతో కొట్లాడి మరీ చివరికి నాకు నచ్చిన కోర్స్‌లోనే జాయిన్ చేశావు. అప్పటికే నీ మీదున్న కోపాన్నంతా అమ్మ దగ్గర వెళ్లబోసుకున్నాను. ఎన్నిసార్లు ఇలా నన్ను మోసం చేశావు డాడీ. అల్లరి చేస్తూ నీ పని చెడగొట్టినా నీ భుజాన మోసుకు తిప్పావు. నీకెంతో నచ్చి కొనుక్కున్న బండి పాడు చేసినా మొహంలో అసహనం చూపించావు గానీ నన్ను పల్లెత్తు మాట అనలేదు. మీకు చెప్పకుండా మొదటి జీతం నాకు నచ్చినట్టు ఖర్చు చేసినా నా ఇష్టాన్ని ఒప్పుకున్నారు. నువ్వు లేని సందర్భం నా జీవితంలో ఏముంది డాడీ? నేను ఓడిపోయినప్పుడు మౌనంగా రోదించి, నేను గెలిచినప్పుడు పదిమందికీ దండోరా వేసే ఒకేఒక్క నిజాయితీ అయిన స్నేహితుడివి నువ్వే కదా. నీ అంత గొప్ప పేరెంట్‌ని నేను అవుతానో లేదో గానీ నన్నొక మంచి మనిషిగా తీర్చింది నువ్వే డాడీ. నీకు పుట్టడమే ఓ వేడుక. ఈ రోజంతా నీతో గడపడమే ఈ ఫాదర్స్ డే వేడుక’.
‘కొడుకు చేతిలో తల్లి గుండె’ ‘ఎదురు దెబ్బలు తగుల్తాయి నాన్నా జాగ్రత్త’ అనే గుండెల్ని పిండేసే అమ్మ కథ అందరికీ తెలుసు. కానీ నాన్న ఎప్పుడూ తన గుండె విప్పడు. తన గాథ చెప్పడు. నాన్నలంతే… రహస్యంగా రోదిస్తుంటారు. బహిరంగంగా బాధను దిగమింగుతారు. ఎవరు నూరిపోశారో గంభీరంగా ఉండమని, నాన్నెప్పుడూ చెక్కు చెదరకుండా ఉంటాడు. కొందరు నాన్నలు పైకి బెదిరించినట్టు ఉన్నా గుండెల్లో పిల్లల మీద కొండంత బెంగా భయంతో ఉంటుంటారు. కొందరు నాన్నలు అమ్మల్ని మించి ప్రేమిస్తుంటారు. పిల్లల బాగోగులు అలనా పాలనా సమస్తం చూసుకుంటారు. కొందరు నాన్నలు కేవలం నాన్నలుగా మిగిలిపోతారు.
నాన్న లేని ఇల్లు మోడు వారిన చెట్టులానే ఉంటుంది. ప్రేమగల నాన్న నడిపే ఇల్లు సంతోషాల సౌధమే. తన నాన్నతనానికి తిరిగి ఏమీ ఆశించని తండ్రి కోసం ప్రత్యేకంగా ఒక రోజును కేటాయించడం ఆయన మీదున్న ప్రేమను చాటుకోవడమే. అది అవసరం కూడా. తల్లి జన్మనిస్తే తండ్రి జీవితాన్ని ఇస్తాడంటారు. అమ్మ నవమాసాలు కడుపులో పెట్టుకొని ప్రాణం పోస్తే నాన్న జీవితాంతం గుండెల్లో పెట్టుకొని పెంచుతాడు. ప్రేమగల ఏ స్త్రీనైనా అమ్మా అని పిలిచి బంధాన్ని కలుపుకోవచ్చు కానీ నాన్నను వేరెవ్వరిలో వెతుక్కోలేం.
తల్లీ కొడుకుల వెనలేని ప్రేమ ఎంత హృద్యంగా ఉంటుందో తండ్రీ కూతుళ్ళ అనురాగం కూడా అంతే అపురూపం. అటువంటి ఒక కూతురు మొదలు పెట్టిందే ఈ ఫాదర్స్ డే. అమెరికాలో 1875లో పుట్టిన గ్రేస్ గోల్డెన్ క్లేటన్‌కి తన తండ్రి అంటే చాలా ప్రేమ. ఆయన తన మీద కురిపించిన అవ్యాజమైన ప్రేమకు గ్రేస్ ఎప్పుడూ తండ్రి మీద గౌరవాభిమానాలతో ఉండేది. ట్రావెల్లింగ్ మినిస్టర్‌గా, క్రైస్తవ సంఘ పెద్దగా ఉండే ఆయన 1890లో చనిపోయారు. అయితే 1907లో ఆమె నివసిస్తున్న వర్జీనియా రాష్ట్రంలో బొగ్గు గనుల పేలుళ్లలో ప్రమాదవశాత్తూ 361 మంది పురుషులు మరణించారు. అందులో 250 మంది తండ్రులే. అది చూసి గ్రేస్ చలించిపోయింది. వందలమంది పిల్లలు, భార్యలు క్షణాల్లోనే ఒంటరివారైపోయారు. ప్రేమించే తండ్రిలేని లోటును అనుభవిస్తున్న గ్రేస్ అందరి తండ్రుల గౌరవార్ధం వారికి ఒక రోజు ఉండాలనుకుంది. అలా కుటుంబాల కోసం తండ్రులు చేసే త్యాగలను, కష్టాలను గుర్తిస్తూ మొట్టమొదటిసారిగా జులై 5, 1908లో ఫాదర్స్ డే జరుపుకున్నారు.
అయితే 1972లో అమెరికన్ ప్రెసిడెంట్ రిచర్డ్ నిక్సన్ జూన్ మూడవ ఆదివారాన్ని ఫాదర్స్ డే గా ఆమోదిస్తూ చట్టంపై సంతకం చేశారు. అమెరికాలో ఇది జాతీయ సెలవు దినంగా మారింది. అప్పటి నుంచి ప్రతి జూన్ మూడవ ఆదివారం తండ్రుల దినోత్సవంగా వంద దేశాలకు పైగా నేటికీ జరుపుకుంటున్నాయి. ఫాదర్స్ డే అనేది తండ్రిని గౌరవించే మహా దినం. పితృ ప్రేమ, తండ్రుల సత్ప్రభావం గురించి ప్రత్యేకంగా చెప్పుకునే రోజు. తండ్రులను గౌరవించి జ్ఞాపకం చేసుకునే పర్వదినంగా మొదలైన ఈ రోజు నాన్నలకి పిల్లలు ప్రేమతో బహుమతులు గులాబీ పూలను ఇస్తుంటారు.
ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వివిధ తేదీలలో ఫాదర్స్ డే నిర్వహించబడుతుంది. వివిధ ప్రాంతాలు పితృత్వాన్ని గౌరవించే వారి స్వంత సంప్రదాయాలను నిర్వహిస్తాయి. సిక్కులు గురు గోవింద్ సింగ్ జన్మదినమైన డిసెంబర్ 29న ఫాదర్స్ డే జరుపుకుంటారు. ఫాదర్స్ డే అనేది స్పెయిన్‌లోని కొన్ని ప్రాంతాలలో గుర్తించబడిన ప్రభుత్వ సెలవు దినం కూడా. 1977 వరకు ఇటలీలో దీనిని పరిగణించారు. ఇది ఎస్టోనియా సమోవా, దక్షిణ కొరియాలో జాతీయ సెలవు దినం. ఇక్కడ తల్లిదండ్రుల దినోత్సవం (పేరెంట్స్ డే) గా జరుపుకుంటారు. కొన్ని దేశాల్లో తోబుట్టువుల దినోత్సవం, గ్రాండ్ పేరెంట్స్ డే, మదర్స్ డే వంటి కుటుంబ సభ్యులను గౌరవించే ఇలాంటి వేడుకలను జరుపుకుంటారు.
కొన్ని పురాణాలు, కొందరు కవులు తల్లికి వేసినంత పెద్ద పీట తండ్రికి వేయకపోయినా నాన్నకి ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానం ఉంటూనే ఉంది. తన ప్రేమని భావోద్వేగాన్ని బయటకు చూపించలేకపోయినా పిల్లలంటే నాన్నకు చెప్పలేని ప్రేమ. నిత్యం తన పిల్లల్ని, ఇంటిని ఎలా పోషించాలని ఆలోచిస్తుంటాడు. తనకి ఉన్నా లేకపోయినా తన బిడ్డ ఎవరికంటే తక్కువ కాకూడదని కష్టపడి పిల్లల అవసరాన్ని తీరుస్తాడు. ఆయన కన్న కలలు, నెరవేర్చుకోలేని ఆశలు, ఆశయాలు తన పిల్లలు సాధిస్తే చాలు అనుకునే అల్ప సంతోషి నాన్న. నాన్న అంటే ఒక ధైర్యం, ఒక రక్షణ, ఒక భరోసా, ఒక గురువు, ఒక స్నేహితుడు, కొన్నిసార్లు తల్లి లేని లోటు తీర్చే అమ్మగా కూడా మారతాడు. తన పిల్లల కోసం, కుటుంబం కోసం నాన్న ఎప్పుడూ కరిగిపోయే కొవ్వొత్తిలానే మిగిలిపోతాడు. ‘నాన్నా… నువ్వెందుకు ఇంకా ఆ డొక్కు బండి, పాత చెప్పులు, డబ్బా ఫోనే వాడతావు? కాస్త అప్డేట్ అవ్వచ్చు కదా?’ అని మనం నాన్నల్ని అంటూనే ఉంటాం. ఆయన అవన్నీ కొనుక్కోలేక కాదు, తన మీద ఖర్చు చేయడం కంటే మనకోసం ఏమైనా కొని పెట్టాలని వెర్రి ప్రేమ ఈ నాన్నలది.
ఆయన కోసం ప్రత్యేకంగా ఒక రోజంటూ జరుపుకోవాల్సిన అవసరం లేదు. ఆయనను ప్రత్యేకంగా గుర్తించుకోవాల్సిన అవసరమూ లేదు. ప్రతి రోజు ఆయనదే. ప్రతి ఉదయం ఆయనతో మొదలయ్యేదే. ఆయన లేని కుటుంబం అసంపూర్ణం. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్న వ్యక్తి తండ్రి. ‘నాన్న నా హీరో’ అని ఎందుకు చెప్తారు? నిజానికి ఈ ప్రశ్నకు రెండు ముఖ్య కారణాలు. తండ్రులు మనకు గురువులు, మార్గదర్శకులు. తప్పొప్పుల మధ్య పోరాటంలో మనం ఓడిపోతున్నప్పుడు మనకు దారి చూపిస్తూ, జీవితంలో ఎలాంటి కష్టాన్నైనా ఎలా ఎదుర్కోవాలో నేర్పిస్తూ, అమ్మల కన్నా నాన్నలు తక్కువ భాగోద్వేగంతో ఉంటూ, మనం బాధపడినప్పుడు వారు కూడా మన బాధను అనుభవిస్తారు. బయటకి కనిపించే నాన్న కోపం వెనుక ఎవ్వరికీ కనపడని ప్రేమ దాగి ఉంటుంది. నాన్నలు మన రక్షకులు. బహుశా మీరు ‘నాన్న భుజం కంటే ఎత్తైన ప్రదేశం లేదు’ అనే మాట వినుంటారు. నిజమే మనం వాళ్ళ భుజాల మీద ఉన్నప్పుడు సురక్షితంగా ఉంటాం. మనల్ని భయపెట్టి బలహీనపరిచేది ఏదైనా నాన్న వాటి నుండి మనల్ని దూరంగా ఉంచుతాడు. సరే తండ్రి ఎంత గొప్పవాడో వివరించడానికి ఈ కొన్ని కారణాలు సరిపోవు.
ఆయనే ఒక గురువుగా, సంరక్షకుడిగా, పోషకుడిగా, ఓ మార్గదర్శకుడిగా కుటుంబాన్ని ముందుకి నడిపిస్తాడు. తల్లి ఒడిలో నుంచి చెట్టంత ఎదిగి ఓ ఇంట్లో ఒదిగేంత వరకు కంటికి రెప్పలా కాపాడుకుంటూ తండ్రి పితృత్వాన్ని చాటుతాడు. పిల్లల కలల్ని నిజం చేయడానికి అహర్నిశలూ కష్టపడతాడు. భర్తగా మొదలైన తన కొత్త జీవితంలో తండ్రిగా మారాక సరికొత్తగా జీవిస్తాడు నాన్న. తనువు చాలించే వరకూ కుటుంబానికి కాపలా కాస్తాడు. తన అనారోగ్యం దాచుతాడు. తన ఆనందం మరుస్తాడు. అందరి కోసం జీవిస్తాడు. ఇంత చేసినా తన ప్రేమని ఎలా వ్యక్తపరచాలో తెలియని వాడు నాన్న. నాన్న గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రతి గొప్ప కూతురు, కొడుకు వెనుక నిజంగా ఒక అద్భుతమైన తండ్రి ఉంటాడు. మనం దృఢంగా స్వతంత్రంగా నిర్భయంగా ఎలా ఉండాలో చూపించే వ్యక్తి నాన్న. ఏదో ఒక సమయంలో మనం కూడా అనుకునే ఉంటాం నేను మా నాన్నలాగా ఉండాలి అని. నాన్న ప్రేమను త్యాగాలను మనం ఎప్పటికీ వెల కట్టలేం.
నాన్న తప్పటడుగులు సరిదిద్ది బిడ్డల భవిష్యత్తు కోసం తపన పడే నిస్వార్థపు మనిషి. పిల్లల భవిత కోసం తన వ్యక్తిగత సంతోషాన్ని త్యజించే త్యాగమూర్తి. నాన్నంటే ఓ నిలువ నీడ. కన్నబిడ్డలే జీవితంగా బతుకుతాడు. జీవితాంతం పిల్లలను తన గుండెలపై మోస్తాడు. ఈ క్రమంలో తన అవసరాలు, ఆనందాలన్నింటినీ పక్కనబెడతాడు. తన బిడ్డలు ఒక్కో మెట్టు ఎక్కుతుంటే ఎంతో సంతోషపడతాడు. పిల్లలు ఏదైనా సాధిస్తే చిన్న పిల్లాడిలా సంబరపడిపోతాడు. అలాంటి నాన్నను గౌరవించుకోవాలనే భావనతో వచ్చిందే ఈ ‘పితృ దినోత్సవం’.
ఫాదర్స్ డే అనేది మన నాన్నల పట్ల మన ప్రేమ గౌరవం కృతజ్ఞతలను వ్యక్తీకరించడానికి ఒక చక్కటి అవకాశం. హృదయాన్ని హత్తుకునే ఫాదర్స్ డే శుభాకాంక్షలు, కవితలు, తండ్రుల పట్ల మనకున్న లోతైన బాంధవ్యాన్ని ప్రశంసలను కనబరుస్తాయి. మీకు తోచిన మాటలతో మీ నాన్న మీకు ఎంతో ఇష్టమో చూపించి ఈ ఫాదర్స్ డే ని మరపురాని రోజుగా నిలుపుకోండి. గుర్తుంచుకోండి. కొన్ని హృదయ పూర్వక మాటలు జీవిత కాలం గుర్తుండిపోయే జ్ఞాపకాలను ఇవ్వగలరు. మంచి మనిషిగా ఎదిగే ప్రతి పురుషుడూ గొప్ప తండ్రే అవుతాడని నమ్ముదాం. నాన్న గుండె కలకాలం బతకాలి. చెడు ప్రతిదానిలో ఉన్నట్టే కొందరి నాన్నలలోనూ ఉంటుంది. నాన్నని పోగొట్టుకున్న పిల్లలకు ఈ ఫాదర్స్ డే నాడు ఆయన జ్ఞాపకాలు, కబుర్లే ఓదార్పవ్వాలి. పిల్లల కోసం శ్రమ పడుతూ, వారిని ప్రేమిస్తూ తపించే నాన్నలందరికీ పితృ దినోత్సవ శుభాకాంక్షలు…
– మానస ఎండ్లూరి, మనోజ్ఞ ఎండ్లూరి, 91607 34990
నాన్న
నాన్న రిక్షా తొక్కుతాడు..
నాకు ఏడేళ్ల వయసులో రిక్షాలో తిప్పుతుంటే
పుష్పక విమానమెక్కిన అనుభూతి!
పదహారేళ్ళొచ్చాయి..
నాన్న రిక్షా స్నేహితుల మధ్య చిన్నతనంగా
వుండేది రిక్షా తొక్కొద్దనే వాణ్ణి!
నాన్న నవ్వి ‘అదే మన జీవనాధారం’
అనేవాడు.. పాతికేళ్ళొచ్చాయి నాకు..
నాన్నను, ఆ రిక్షాను చూస్తే కంపరం పుట్టేది
చదువు పూర్తి చేసి ఒక ఉద్యోగంలో చేరాను
నాన్న రిక్షా కార్మికుడని ఎవరికీ తెలీకుండా జాగర్త పడ్డాను!
నాకు నలభై ఏళ్ళొచ్చేశాయి..
నాన్న మాత్రం ఇంకా రిక్షా తొక్కుతూనే
ఉన్నాడు! వద్దంటే వినడు..
ఏభయ్యో పడిలో పడ్డాక ఉద్యోగంలో
బాగా క్రుంగిపోయేను..
నాన్నను చూస్తే ఆశ్చర్యం వేసింది!
అలవాటైన కష్టం మానడు.. రిక్షా వదల్లేదు
ఏభైఐదు దాటేక మానసిక ఒత్తిడి, అనారోగ్యం
వల్ల విఆర్‌ఎస్ తీసికొని ఇంట్లోనే ఉంటున్నాను..
నా పిల్లలు తాత రిక్షాలో ఎక్కి ఆడుకొంటుంటే
‘ఇక విశ్రాంతి తీసికో నాన్నా!’ అన్నా ఎందుకో
నా గొంతు నాకే చిత్రంగా అన్పించేది
నాన్న కష్టమే కదా నన్నింతవాణ్ణి చేసింది
ఆ రిక్షాయే కదా మమ్మల్ని పోషించింది అది
లేకపోతే మేమెక్కడున్నాం!
ఒక్కసారైనా నాన్నను రిక్షాలో కూర్చోబెట్టుకొని
తొక్కాలనుంటుంది ఎందుకంటే..
నాన్నంటే ఒక అద్భుతం..! అని అర్థమైంది కాబట్టి!!
(నేడు ప్రపంచ తండ్రుల దినోత్సవం)
– భీమవరపు పురుషోత్తమ్, 9949800253