మన జీవితంలో ఎవరికైనా రుణపడి ఉన్నాం అంటే అది తల్లిదండ్రులకే. మనల్ని నవ మాసాలు మోసేది తల్లి అయితే… పిల్లల్ని జీవితాంతం తన గుండెలపై పెట్టుకుని చూసేవాడు నాన్న. నాన్న అనే రెండు అక్షరాల పదం నిస్వార్థమైన ప్రేమకు ప్రతిరూపం. నాన్న అనే పిలుపులో ఉండేది కేవలం ఒక బంధం మాత్రమే కాదు అంతకు మించిన భావోద్వేగం. నాన్న కోపంగా ఉన్నా… కఠినంగా మాట్లాడినా… ఒక దెబ్బకొట్టి శిక్షించినా గుండెల నిండా పిల్లలు, కుటుంబమే ఉంటుంది.
ఆయన ఆలోచనలన్నీ నిరంతరం పిల్లల బంగారు భవిష్యత్ కోసమే పరితపిస్తూ ఉంటుంది. ఎదిగే బిడ్డలను చూసి ఆనందంతో పొంగిపోతాడు. పది మందికి చెబుతూ మురిసిపోతాడు. బిడ్డల విజయమే తన విజయమనుకుంటాడు. బాధ్యతల్ని నెత్తిన మోస్తూ పిల్లల్ని పెంచి పెద్ద చేస్తాడు. తన కలలు, ఆశయాలు, ఆశలు అన్నీ వదిలేసుకొని పిల్లలే ప్రపంచంగా బతికేస్తాడు. వాళ్ళకు ఓ జీవితాన్ని అందిస్తాడు. తప్పటడుగులు వేసిన ప్రతిసారీ సరిదిద్దే బాధ్యతను తనే మోస్తాడు. ఎన్ని కష్టాలు పడుతున్నా ఇవేవీ పిల్లలకు తెలియనివ్వడు. వారి ఆనందంలోనే తన ఆనందాన్ని వెతుక్కుంటాడు. అదే నాన్న ప్రేమ. అది అనంతం..అజరామరం…అద్భుతం.
జీవితంలో ఎవరికైనా నాన్నే రియల్ హీరో. ఎవరి నాన్న వాళ్లకు గ్రేట్. అడిగింది తెచ్చిస్తాడు. ఏ ప్రశ్న అడిగినా ఒడిలో కూర్చోబెట్టుకొని చెప్తాడు. పదో తరగతి పూర్తయ్యే వరకు నాన్న నాన్నలాగే ఉంటాడు. ఆ తర్వాత మంచి స్నేహితుడిగా మారిపోతాడు. బిడ్డల గమ్యం ఎటో వివరించి చెప్తాడు. తెలిసీ తెలియని వయసులో పిల్లలు చిన్న చిన్న విషయాలకే చిరాకు పడుతున్నా కూల్‌గా నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు నాన్న గొప్ప సైకాలజిస్ట్‌గా కనిపిస్తాడు.
ఏదైనా పొరపాటు చేస్తే కాళ్లు విరగ్గొట్టు అని అమ్మతో పైకి చెప్పినా తను మాత్రం వెనకేసుకొస్తాడు. అలాగే అని తప్పు చేస్తే మాత్రం అస్సలు ఊరుకోడు. అమ్మ కోపంగా ఓ మాట అంటే పెద్దగా పట్టించుకోరు. కానీ నాన్న నోటి నుండి ఒక్క మాట విన్నా కోపం, దు:ఖం కలగలిపి వచ్చేస్తాయి. అదేంటో నాన్న ప్రేమ ఎవరికీ అర్థం కాదు. అమ్మ ప్రేమలా అంత స్పష్టంగా బయటకు కనపడదు. ఎవరన్నా తన పిల్లలను పొగుడుతున్నపుడు లోలోపల ఆనందపడుతూనే వాళ్లతో ‘ఇక చాలు’ అని ఇష్టం లేనట్టుగా నటిస్తాడు.
తన పిల్లల్ని గొప్ప స్థానంలో చూడాలనుకుంటాడు నాన్న. దాని కోసం తను ఎంత శ్రమించడానికైనా సిద్ధపడతాడు. తన జీవితాన్నే త్యాగం చేస్తాడు. ఇది తల్లికి కూడా వర్తిస్తుంది. అమ్మా, నాన్న అనే పిలుపు కోసమే వాళ్లు అన్నీ త్యాగం చేస్తారు. అందుకే మనం తల్లిదండ్రులకు దూరంగా ఉన్నా, దగ్గరగా ఉన్నా వాళ్ల కండ్లకు కనిపించాలి. లేదా రోజూ కనీసం ఒక్కసారైనా పలకరించాలి. పిల్లల కోసం ఇన్ని త్యాగాలు చేస్తున్న తండ్రులున్న ఈ సమాజంలోనే ఆస్తుల కోసం పిల్లల్ని చంపుతున్న నాన్నలను, కామంతో కండ్లు మూసుకున్న తండ్రులనూ అప్పుడప్పుడు చూడాల్సి రావడం అత్యంత బాధాకరం.