అలుముకుంటున్న చీకట్లలోకి ఆమె
వెర్రి చూపులు చూస్తోంది
ఆ చీకటెందుకుందో తన ఆరేళ్ళ ఆయేషా
అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక!
బుల్‌డోజర్లతో దేశాన్ని కూల్చవచ్చని,
కూలుస్తారని ఇప్పటిదాకా తాననుకోలేదు.
‘నామ్ ఔర్ నిషాన్ మిట్టీమే మిలాదేంగే’ నినాదాలు
ఓట్ల కోసమే అనుకుంది కాని
ఆ ఓట్లే, మెట్లయి అధికార పరమపద సోపాన పటంలో
అందలమెక్కిస్తాయని ఊహించలేదు.
అక్కడెక్కడో..సంగారెడ్డి జిల్లాలో
ఇస్మాయిల్‌ఖాన్‌పేటను ఈశ్వరాపురమని
ఖాఖీ లాగులోల్లు..
ఇప్పుడు అఫీషియల్‌గా
అలహాబాద్ ప్రయోగరాజై
లక్నో లక్ఖన్‌పూర్‌గా మారబోతూ..
ఆ మాటలు విన్నప్పుడు నిజంగానే అంత చేస్తారా అనుకుంది
కాకా, మామూ అని పిల్చిన పక్కింటి వాళ్ళే
అఖ్లాక్‌ని కొట్టి చంపినప్పుడు గానీ
విషం ఎక్కడిదాకా ఎక్కిందో అర్థంకాలే!
లక్ష్మీబాయి ఝాన్సీలో, బేగమ్ హజ్రత్ మహల్
లక్నోలో ఫిరంగీ దళాలపై విరుచుకుపడ్డనేల కదా
అనుకుందామే!
ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామంలో
మా మీరట్ మా లక్నో మా ఝాన్సీ, మా కాన్పూర్‌లన్నీ
మా యూపీలోనే ఉన్నాయనీ,
మా హజరా బేగమ్‌ను కన్న సహ్రాన్‌పూర్
అబీదాబానో నెత్తురోడ్చిన మొరాదాబాద్‌లు మాయూపీలోవే..
అనే అతి విశ్వాసంలో ఆమె
ఆలోచనలు చరిత్రలో తిరుగుతున్నాయి, కానీ
వెనక నుండి చరిత్రను చెరిపేసుకుంటూ
వస్తున్నారన్న సంగతి, పాపం! ఆ తల్లికేం తెల్సు
చీకట్లు శాశ్వతమని
చీకట్లలోనే తాము స్వైర విహారం చేయొచ్చని
విర్రవీగే పరివారాల్లారా!
వైకుంఠపాళిలో
మీకు మెట్లయిన ‘లేబర్‌గాళ్ళు’
జాతవ్‌లు, జాట్ సిక్కులు, కార్మికుల్ని చూసి
చెమటతో కల్సి
ముస్లింలతో కలగలిసి, కలివిడిగా
మోడీ మానస పుత్రికలు, ఎన్నో పత్రికలు
ఆకసానికెత్తిన వ్యవసాయ చట్టాలను
ఓడించలేదా?!
ఫ్యాక్టరీల్లో హలాలు, పొలాల్లో యంత్రాలు
తాబదలై, ఒకరికి ఒకరై
ఒకర్లో ఒకరైన తీరే
మా వెలుగు బావుటా!
– ఆరెస్బీ