ప్రతిపక్ష పాలనలో ఉన్న రాష్ట్రాలు ఎప్‌సిఐని పక్కన పెట్టి నేరుగా ఆహారధాన్యాల సేకరణకు పూనుకుంటే అప్పుడు జాతీయ ప్రజాపంపిణీ వ్యవస్థ మొత్తం దెబ్బతినిపోతుంది. అలా దెబ్బ తినిపోతే దానికి బీజేపీ నుంచి పెద్దగా అభ్యంతరంఉండకపోవచ్చు. ఎందుకంటే ఆ పార్టీకి ప్రజల అవసరాలేమీ పట్టవు. నిజానికి ఆ పార్టీ ముందుకు తెచ్చిన నల్ల వ్యవసాయ చట్టాలు గనుక అమలులోకి వచ్చివుంటే ప్రజాపంపిణీ వ్యవస్థ పూర్తిగా దెబ్బ తినిపోయివుండేది. కాని ఈ వ్యవస్థ దెబ్బ తింటే దానివలన నష్టపోయేది యావత్తు దేశమే.
కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం ”అన్న భాగ్య” పథకాన్ని ఈనెల 1వ తేదీ నుండి అమలు చేస్తామని ప్రకటించింది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ప్రతీ కుటుంబానికీ నెలకు 10 కిలోల చొప్పున బియ్యాన్ని ఉచితంగా అందజేయాలన్నది ఆ పథకం లక్ష్యం. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆ కుటుంబాలకు నెలకు 5కిలోల చొప్పున బియ్యాన్ని ఉచితంగా అందిస్తోంది. దానికి మరో 5కిలోలను అదనంగా చేర్చి ఒక కోటి 19 లక్షలమంది నిరుపేదలకు అందించాలన్నది కర్నాటక ప్రభుత్వం ఉద్దేశ్యం. ఇప్పుడు ఈ పథకం చిక్కుల్లో పడింది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సిఐ) కర్నాటక ప్రభుత్వానికి బియ్యం అమ్మడానికి నిరాకరించింది. కేంద్ర ప్రభుత్వం కరోనా కాలంలో మొదలుపెట్టిన అంత్యోదయ పథకాన్ని ఎత్తివేయాలని కొంతకాలంగా యోచిస్తోంది. కర్నాటక ప్రభుత్వం గనుక అన్నభాగ్య పథకాన్ని మొదలుపెడితే కేంద్రం అంత్యోదయను కొనసాగించాల్సి ఉంటుంది.
ఎఫ్‌సిఐ నిరాకరించిన అనంతరం ఇతర కేంద్ర ఏజెన్సీలనుండి గాని, వేరే రాష్ట్రాలనుండి కాని బియ్యాన్ని కొనుగోలు చేయడానికి కర్నాటక ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కాని వాటివద్ద తగినంత నిల్వలు లేవు. పైగా ఆ కేంద్ర ఏజెన్సీలు కూడా కర్నాటకకు బియ్యం అమ్మకుండా కేంద్రం అడ్డు పడవచ్చు. పైగా ఈ విధంగా కొనుగోలు చేయడం వలన బియ్యం ఖరీదు పెరుగుతుంది. స్కీమును అమలు చేయడానికి ఎక్కువ సొమ్ము ఖర్చవుతుంది. రాష్ట్ర బడ్జెట్ మీద అదనపు భారం పడుతుంది.
బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వానికి, ప్రతిపక్ష పాలనలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఏదో అరుదుగా జరిగిన ఘర్షణ కాదిది. అధికారాలు విపరీతమైన రీతిలో కేంద్రీకరించబడిన వైనం ఇది. కేవలం రాజకీయ కారణాల కోసం, అందునా, ఒక ప్రతిపక్ష పాలిత ప్రభుత్వం ప్రజాదరణ పొందకుండా ఉండడానికి కేంద్రం చేస్తున్న కుట్ర ఇది. అందుకోసమే ఒక ప్రజానుకూల కార్యక్రమాన్ని చెడగొట్టింది. ఒకపక్క కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈ అన్నభాగ్య పథకాన్ని అమలుకానీయకుండా అడ్డుపడుతూవుంటే, మరోపక్క రాష్ట్రంలోని బీజేపీ అక్కడ ఏర్పడ్డ కొత్త ప్రభుత్వం ఎన్నికల హామీలనన్నింటినీ అమలు చేయాల్సిందేనంటూ గొంతెత్తి అరుస్తోంది.
రాష్ట్రాలలో ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు చేపట్టినప్పుడు వాటిని కేంద్రం వ్యతిరేకించడం కొత్తేమీ కాదు. గతంలో కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆహారధాన్యాలను సబ్సిడీపై ప్రజలకు అందించే పథకాన్ని కుదించి కేవలం పేదవారికే దానిని పరిమితం చేసింది. అప్పటికి కేరళలో సార్వత్రిక ప్రజాపంపిణీ వ్యవస్థ అమలులో ఉంది. ఆ పథకాన్ని కొనసాగించడానికి కేరళలోని ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం అదనపు బియ్యాన్ని రాష్ట్రంలోనే కొనుగోలు చేసింది. నిజానికి ఎఫ్‌సిఐ కేరళ రాష్ట్రం నుండి లెవీ బియ్యాన్ని సేకరించదు. బియ్యం ఉత్పత్తిలో కేరళ లోటు రాష్ట్రంగా ఉండడమే దానికి కారణం. అయినా, ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం ఏ మేరకు అదనంగా బియ్యాన్ని రాష్ట్రంలో సేకరించిందో, ఆ మేరకు ఎఫ్‌సిఐ తన సరఫరాను కుదించింది!
అనవసరమైన, అవాంఛనీయమైన కేంద్రీకరణ అనేది కొత్తేమీ కాదు. కాని బీజేపీ ప్రభుత్వం ఆ ప్రక్రియను ఇంతకుమునుపెన్నడూ లేనంతగా అమలు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ మార్కెట్‌లో కూడా కొనుగోలు చేయడానికి వీలులేని పరిస్థితులను కల్పిస్తోంది. ఈ విధానం ఒక రాష్ట్ర ప్రభుత్వం పట్ల అనుసరిస్తున్న కక్షపూరితవైఖరి. నిజానికి ఆ రాష్ట్రంలోని పేదలమీద సాగిస్తున్న దాడి అని గ్రహించాలి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రదర్శిస్తున్న వ్యతిరేకత వలన నష్టపోతున్నది పేదలే.
ఎఫ్‌సిఐ కర్నాటక ప్రభుత్వానికి బియ్యం అమ్మడానికి నిరాకరించడం వెనుక రాజకీయ దురుద్దేశాలేమీ లేవని అంటూ బీజేపీ నాటకం ఆడుతోంది. కాని బియ్యం అమ్మకపోడానికి చెపుతున్న కారణాలు ఏవీ సరైనవి కావు. కేంద్రం వద్ద తగినంతగా బియ్యం నిల్వలు లేనందువలన అమ్మడం సాధ్యపడడం లేదన్నది మొదటి కారణం. మరి అటువంటప్పుడు కొద్ది రోజుల్లోనే 5లక్షల టన్నుల బియ్యాన్ని, 4లక్షల టన్నుల గోధుమల్ని అమ్మబోతున్నట్టు ఏ విధంగా ప్రకటించారు? కర్నాటక ప్రభుత్వం అడిగినది 2.46లక్షల టన్నుల బియ్యాన్ని మాత్రమే. ఆ మేరకు ఎఫ్‌సిఐ కర్నాటకకు అమ్మవచ్చు. కాని, ఎఫ్‌సిఐ రాష్ట్ర ప్రభుత్వానికిి కాకుండా బియ్యం వ్యాపారులకు అమ్మడానికి సిద్ధమైంది.
ఎందుకిలా చేస్తోంది? అన్న ప్రశ్నకు చెపుతున్న సమాధానం ఏమిటి? వ్యాపారులకు బియ్యం అమ్మితే దాని వలన మార్కెట్‌లో ధరల పెరుగుదలను అరికట్టడం వీలవుతుందట. ఎఫ్‌సిఐ చైర్మన్ మీడియా ముందు చాలా స్పష్టంగా ఈ విషయాన్ని ప్రకటించాడు. బహిరంగంగా బియ్యాన్ని మార్కెట్‌లో అమ్మడం వలన ఆహారధాన్యాల ధరలు మార్కెట్‌లో తగ్గుతాయని చెప్పాడు. ఇది చాలా వికృతమైన వాదన. ఆహారధాన్యాల ధరల పెరుగుదలకు కారణం వాటి డిమాండ్ పెరగడమే వాస్తవం అయితే అప్పుడు ప్రభుత్వమే నేరుగా ఆహారధాన్యాలను వినియోగదారులకు అందించడం వల్ల మార్కెట్‌లో డిమాండ్ తగ్గి ధరలు తగ్గుతాయి. అదే వ్యాపారులకు ఆహారధాన్యాలను అమ్మితే వారు వాటిని వెంటనే మార్కెట్‌లో అమ్మకానికి పెడతారన్న గ్యారంటీ ఏమీ లేదు. వారు వాటిని నిల్వచేయవచ్చు. అప్పుడు ఆహారధాన్యాల ధరలు తగ్గవు. అదే ఆహారధాన్యాలను గనుక రాష్ట్ర ప్రభుత్వాలకు విడుదల చేస్తే అవి నేరుగా ప్రజలకు చేరుతాయి. అప్పుడు ధరలు తగ్గుతాయి.
1972లో కూడా ఇదేమాదిరిగా జరిగింది. అప్పుడు పంటలు దెబ్బతిన్నాయి. అందువలన ఆహారధాన్యాలకు కొరత ఏర్పడవచ్చునన్న అంచనాతో వాటి ధరలను బాగా పెంచివేశారు. అప్పటి ప్రభుత్వం వద్ద నిల్వలు సరిపడా ఉన్నాయి. అప్పుడు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యం విడుదల చేసివుంటే, ప్రజానీకంలో గణనీయమైన భాగం బహిరంగ మార్కెట్‌కు రాకుండా దూరంగా ఉండేవారు. దానివలన బహిరంగ మార్కెట్‌లో బియ్యం డిమాండ్ తగ్గివుండేది. కాని ఇందిరాగాంధీ ప్రభుత్వం ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేయడానికి బదులు ఆ నిల్వలను బహిరంగ మార్కెట్‌లో అమ్మడానికి పూనుకుంది. బియ్యం వ్యాపారులు మహదానందంగా నిల్వలను అన్నింటినీ కొనుగోలు చేసి దాచిపెట్టారు. దాంతో ద్రవ్యోల్బణం యధాతథంగా కొనసాగింది.
అది జరిగి యాభై సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం మళ్ళీఅదే పొరపాటు చేయడానికి సిద్ధపడుతోంది. ఇక్కడ మరో వాదన రావచ్చు. కర్నాటక ప్రభుత్వ స్కీము వలన పేదలకు మరో 5కిలోల బియ్యం అదనంగా లభిస్తుంది. ఆదనపు బియ్యాన్ని వాళ్ళు అదనంగా వినియోగిస్తారు. అంతే తప్ప బహిరంగ మార్కెట్‌లో బియ్యం డిమాండ్ ఏమీ తగ్గదు. అందుచేత ధరలు తగ్గవు. – ఇదే ఆ వాదన.
ఈ వాదన రెండు కారణాలరీత్యా తప్పు. మొదటిది: ఈ స్కీము వలన ప్రయోజనం పొందేవారు 4.42కోట్లమంది. వీరంతా తమ వినియోగాన్ని పెంచుతారే తప్ప బహిరంగ మార్కెట్ నుంచి చేసే కొనుగోళ్ళను తగ్గించరు అని భావించడం వాస్తవికత అనిపించుకోదు. ఎంతో కొంతమేరకు బహిరంగ మార్కెట్‌లో ఈ స్కీము వలన బియ్యం డిమాండ్ తగ్గుతుంది.
రెండవది: మనం ద్రవ్యోల్బణం గురించి ఎందుకు ఆందోళన చెందుతాం? అది పేదలను తక్కిన తరగతుల ప్రజలకన్నా ఎక్కువగా బాధిస్తుంది కనుక. దాని ఫలితంగా వారి వినియోగం తగ్గుతుంది కనుక. ఇప్పుడు ఈ స్కీము ద్వారా వారి వినియోగాన్ని నేరుగా పెంచడం సాధ్యపడుతోంది కదా! అటువంటప్పుడు ద్రవ్యోల్బణం తగ్గడం అనేదానికి పెద్ద ప్రాధాన్యత ఏముంటుంది? ఒకవైపు భారతదేశం ఆకలిసూచికలో 100వ స్థానంలో ఉన్నా, పేదల ఆకలి తీర్చడం కన్నా ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికే ప్రాధాన్యత ఇవ్వడం అంటే ప్రభుత్వం ప్రాధాన్యతలే తప్పు అని అనుకోవాలి.
అందుచేత బీజేపీ ప్రభుత్వం ధరలను తగ్గించడం గురించి మాట్లాడుతున్నది కర్నాటకకు బియ్యం అమ్యకపోడాన్ని సమర్ధించుకోడానికే. దీనిని క్షమించకూడదు. తన స్వార్థరాజకీయాల కోసం పేదల బతుకులతో బీజేపీ ప్రభుత్వ చెలగాటం ఆడుతోంది. ఈ కేంద్ర ప్రభుత్వానికి నిజంగానే ఆహారధాన్యాల ధరలను తగ్గించాలన్న నిశ్చయం ఉంది అని అనుకుంటే అప్పుడు రాష్ట్రానికి నేరుగా బియ్యాన్ని అమ్మాలే తప్ప వ్యాపారులకు కాదు. ఆహారధాన్యాల పంపిణీని కేంద్రీకృతం చేయడం వలన మొత్తం దేశ ఆహార వ్యవస్థకే దెబ్బ తగులుతుంది. ప్రతిపక్ష పాలనలో ఉన్న రాష్ట్రాలు ఎప్‌సిఐని పక్కన పెట్టి నేరుగా ఆహారధాన్యాల సేకరణకు పూనుకుంటే అప్పుడు జాతీయ ప్రజాపంపిణీ వ్యవస్థ మొత్తం దెబ్బతినిపోతుంది. అలా దెబ్బ తినిపోతే దానికి బీజేపీ నుంచి పెద్దగా అభ్యంతరం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆ పార్టీకి ప్రజల అవసరాలేమీ పట్టవు. నిజానికి ఆ పార్టీ ముందుకు తెచ్చిన నల్ల వ్యవసాయ చట్టాలు గనుక అమలులోకి వచ్చివుంటే ప్రజాపంపిణీ వ్యవస్థ పూర్తిగా దెబ్బ తినిపోయివుండేది. కాని ఈ వ్యవస్థ దెబ్బతింటే దానివలన నష్టపోయేది యావత్తు దేశమే. (స్వేచ్ఛానుసరణ)