చంద్రమోహన్‌కు ఎఫ్‌డీసీ చైర్మెన్‌ నివాళి

నవతెలంగాణ-హైదరాబాద్‌
సినీనటుడు చంద్రమోహన్‌ భౌతికకాయానికి తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర, టీవీ, థియేటర్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ అనిల్‌ కుర్మాచలం నివాళులు అర్పించారు. శనివారం హైదరాబాద్‌ ఫిలింనగర్‌లోని అనిల్‌ కుర్మాచలం దివంగత చంద్రమోహన్‌ నివాసానికి వెళ్లారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. చంద్రమోహన్‌ తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా, కమెడీయన్‌ గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా దాదాపు 900లకు పైగా చిత్రాల్లో నటించి, మెప్పించి తన నటనకుగానూ ఫిలింఫేర్‌, నంది అవార్డులు అందుకున్నారని గుర్తు చేశారు. చంద్రమోహన్‌ మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
పలువురి సంతాపం
సీనియర్‌ సినీనటులు చంద్ర మోహన్‌ మృతికి పలువురు సినీతారలు, రాజకీయనాయకులు, ప్రజాప్రతినిధులు సంతాపం తెలిపారు. వారిలో నందమూరి బాలకృష్ణ, టీపీసీసీ అద్యక్షులు ఎ.రేవంత్‌రెడ్డి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు అరవింద్‌కుమార్‌ గౌడ్‌, మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్‌ తదితరులు ఉన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు.