భీతావహం

- Exploded reactor, boiler– పేలిన రియాక్టర్‌, బాయిలర్‌
– ఏడుగురు మృతి, పలువురి పరిస్థితి విషమం, క్షతగాత్రుల ఆర్తనాదాలు
– క్షేత్రస్థాయికి వెళ్లిన కంపెనీ ఎండీ రవిశర్మ మృత్యువాత
– కమ్మేసిన పొగ.. నేలమట్టమైన ఫ్యాక్టరీ
– భద్రతా ఏర్పాట్లు లేకపోవడం వల్లే ప్రమాదం, ప్రాణ నష్టం
– సంఘటనా స్థలాన్ని సందర్శించిన మంత్రి కొండా సురేఖ
– మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలి: సీపీఐ(ఎం)
– యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే కార్మికుల మరణం : సీఐటీయూ
హృదయవిదారకం. ఊహించని పరిణామం. విధినిర్వహణలో నిమగ్నులైన కార్మికులు అగ్నికి ఆహుతి. అప్పటి వరకు ఉన్న కంపెనీ పూర్తిగా నేలమట్టం. విధి వైచిత్య్రం అనేకన్నా, యాజమాన్య నిర్లక్ష్యం అనడమే కరెక్ట్‌. అంతపెద్ద కంపెనీలో భద్రతా ఏర్పాట్లు అరకొరే. ఈ విషయం తెలిసినా రెక్కాడితేకాని డొక్కాడని కష్టజీవులైన కార్మికులు ప్రాణాలు పణంగా పెట్టి, విధులు నిర్వహిస్తున్నారు. ఏమైందో ఊహించేలోపే క్షణాల్లో మంటలు చెలరేగి బాయిలర్‌ పేలిపోయింది. ఆ వెంటనే ఒకటొకటిగా రియాక్టర్లు పేలాయి. పొగ కమ్మేసింది. కంపెనీ నేలమట్టమైంది. ఏడుగురు కార్మికులు మాంసం ముద్దలై పోయారు. ఏం జరిగిందో అని లోపలికి వెళ్లిన కంపెనీ ఎమ్‌డీ రవిశర్మ కూడా అగ్నికి ఆహుతై పోయారు. మరికొందరు కార్మికులు క్షతగాత్రులై చేస్తున్న ఆర్తనాదాలు గుండెలను పిండేశాయి. అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకొనేలోపే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్‌ గ్రామ పరిధిలోని ఎస్‌బీ ఆర్గానిక్‌ కెమికల్‌ ఫ్యాక్టరీలో బుధవారం సాయంత్రం 4.30 గంటలకు చోటుచేసుకున్న విషాదకర అగ్నిప్రమాద సంఘటన ఇది…
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి/హత్నూర
20 ఏండ్ల క్రితం స్థాపించిన మందు గోలీలకు ఉపయోగించే పౌడర్‌ తయారయ్యే ఎస్‌బీ కెమికల్‌ కంపెనీ.. దశల వారీగా విస్తరించింది. ప్రస్తుతం కంపెనీలో 150 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో అత్యధిక మంది హత్నూర మండల ప్రాంతానికి చెందిన వాళ్లే ఉన్నారు. అగ్ని ప్రమాదం జరిగిన షిఫ్ట్‌లో మాత్రం 50 మంది కార్మికులు విధుల్లో ఉన్నట్టు సమాచారం. కంపెనీలో ఉత్పత్తి జరుగుతున్న వేళ ఉన్నట్టుండి బాయిలర్‌ పేలి మంటలొచ్చాయి. అక్కడ ఎగిసి పడిన మంటలు కాస్త రియాక్టర్‌పై పడటంతో భారీ పేలుళ్లు సంభవించాయి. దాంతో కంపెనీ మొత్తం దట్టమైన పొగమబ్బులు కమ్ముకున్నాయి. అగ్నికీలలు ఎగసిపడ్డాయి. భారీ పేలుళ్ల వల్ల బాయిలర్‌, రియాక్టర్‌ వద్ద పనిచేస్తున్న కార్మికుల్లో కొందరు అక్కడికక్కడే విగత జీవులయ్యారు. కంపెనీలో అగ్నిప్రమాదం చోటుచేసుకున్న సమచారం తెలిసిన వెంటనే సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని
అగ్నిమాపక సిబ్బంది ఐదు ఫైర్‌ ఇంజన్లతో వచ్చి కంపెనీలో ఎగసిపడుతున్న మంటల్ని ఆర్పారు. మంటలు అదుపులోకి వచ్చాక మృతుల్ని, క్షతగాత్రుల్ని వెలికి తీశారు. సంగారెడ్డి ఎస్పీ చెన్నూరి రూపేష్‌ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యల్ని పర్యవేక్షించారు. మృతుల్లో కార్మికులతో పాటు కంపెనీ ఉద్యోగులు కూడా ఉన్నారు. కంపెనీలో పొగలు కమ్ముకోవడంతో ఏం జరుగుతుందోనన్న ఆందోళనతో చూసేందుకు వెళ్లిన కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రవి శర్మ, ప్రొడక్షన్‌ ఇన్‌చార్జీలు సుబ్రమణ్యం, దయానంద్‌తో పాటు మెయింటెనెన్స్‌ ఇన్‌చార్జి సురేష్‌ పాల్‌ కూడా మృతిచెందారు. ఏడుగురు మరణించినట్టు ప్రాథమికంగా గుర్తించారు. 30 మందికి పైగా కార్మికులు పేలుళ్ల దాటికి, మంటల వల్ల తీవ్ర గాయాలపాలయ్యారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు పది అంబులెన్స్‌లతో సంగారెడ్డి ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని మంత్రి కొండా సురేఖ సందర్శించారు. మృతుల కుటుంబాలకు ధైర్యం చెప్పారు. అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
ఆక్రందనలు.. ఆర్తనాదాలు..
మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు అక్కడికి చేరుకుని బోరున విలపించారు. పేలుళ్ల తాకిడికి విగత జీవులైన కార్మికులు, కంపెనీ ఉద్యోగుల మృతదేహాలను బయటికి తీయడంతో కన్నీరు మున్నీరుగా విలపించారు. మంటల్లో చిక్కిన పలువురు కార్మికులు తమల్ని కాపాడాలంటూ ఆర్తనాదాలు పెట్టారు. కంపెనీలో జరిగిన ప్రమాదంలో వందల మీటర్ల దూరంలో శవాలు ఎగిరిపడ్డాయి. రియాక్టర్‌ పేలడం వల్ల మూడు భవనాలు నేలమట్టమయ్యాయి. చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వేలాది మంది అక్కడికి చేరుకున్నారు. క్షతగాత్రుల ఆర్తనాదాలు, ముక్కలు చెక్కలైన శవాలను చూసి కంటతడి పెట్టారు. రియాక్టర్‌ పేలడంతో కంపెనీ రేకులు ఎగిరి అరకిలో మీటర్‌ దూరంలో పడ్డాయి. దాంతో అక్కడున్న పది మందికి కూడా గాయాలయ్యాయి.
సేఫ్టీ మెజర్‌మెంట్స్‌ లేకనే ప్రమాదం
కెమికల్‌ కంపెనీల్లో తరచూ పేలుళ్లు సంభవించి కార్మికులు చనిపోతున్నారు. ఎస్‌బీ ఆర్గానిక్‌ కెమికల్‌ ఫ్యాక్టరీలో సంభవించిన పేలుళ్లలో ఏడుగురు మరణించడం విషాదకరమైన సంఘటన. అయితే కంపెనీలో సేప్టీ మెజర్‌మెంట్స్‌ సరిగ్గా లేకపోవడం, బాయిలర్‌, రియాక్టర్ల వద్ద నైపుణ్యం, అనుభవం కల్గిన కార్మికులతో కాకుండా తక్కువ వేతనాలతో సాధారణ కార్మికుల్ని పెట్టి పనిచేయించడం కూడా పేలుళ్లకు కారణంగా చెబుతున్నారు. ఎస్‌బీ ఫ్యాక్టరిలోనే కాదు, సంగారెడ్డి జిల్లాలోని వందల కంపెనీల్లో ఇదే నిర్లక్ష్యం కొనసాగుతోంది. నెల క్రితం హత్నూర మండలంలోని గుండ్లమాచెనూరులో ఉన్న కోలాండ్‌ కంపెనీలో పేలుళ్లు సంభవించి నలుగురు కార్మికులు మరణించారు. పటాన్‌చెరు ఏరియాలోని మరో కంపెనీలో కూడా పేలుళ్ల వల్ల ముగ్గురు కార్మికులు చనిపోయారు. నెల రోజుల్లోనే 15 మంది కార్మికులు అగ్ని ప్రమాదాలు సంభవించి మృత్యువాత పడ్డారంటే కంపెనీల నిర్లక్ష్యం ఏపాటిదో అర్ధమవుతోంది. ఫ్యాక్టరీల్లో సేప్టీ మెజర్‌మెంట్స్‌ ఉన్నాయా.. లేవా.. అని తనిఖీ చేయాల్సిన ఫ్యాక్టరీ ఇన్‌స్పెక్టర్స్‌ సైతం మాముళ్ల మత్తులో తూగుతున్నారు. ఇటీవల సీఐటీయూ ఆధ్వర్యంలో ఫ్యాక్టరీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫీస్‌ను ముట్టడించి ఆందోళన చేశారు.
సందర్శించిన పలువురు నేతలు
ప్రమాదం జరిగిన సంఘటనా స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు సందర్శించారు. సీఐటీయూ, సీపీఐ(ఎం) జిల్లా ప్రతినిధి బృందం ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాద స్థలాన్ని సందర్శించింది. సంఘటన పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రుల్ని పరామర్శించి ఓదార్చారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం వెంటనే సహాయ చర్యలు చేపట్టాలని కోరారు.
మృతుల కుటుంబాల్ని ఆదుకోవాలి : సీఐటీయూ
ఎస్‌బీ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాల్ని ఆదుకోవాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బి.మల్లేశం, కోశాధికారి కె.రాజయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలన్నారు. క్షతగాత్రులకు మెరుగైన ఉచిత వైద్యం అందించాలని తెలిపారు. జిల్లాలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నా ఉన్నతాధికారులు, మంత్రులు, ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కంపెనీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని, కంపెనీలో జరిగిన ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపించాలని తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.
నిర్లక్ష్యం వల్లే నిండు ప్రాణాలు బలి : జి.జయరాజ్‌, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి
ఫ్యాక్టరీల యాజమాన్యాల నిర్లక్షం వల్లే కార్మికులు నిండు ప్రాణాలు కోల్పోతున్నారు. నెల రోజుల వ్యవధిలోనే జిల్లాలో మూడు ఫ్యాక్టరీల్లో రియాక్టర్లు పేలి 15 మంది వరకు చనిపోయారు. ఇంత మంది చనిపోతున్నా ఫ్యాక్టరీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నారు. తక్షణమే జిల్లాలోని ఫ్యాక్టరీలను తణిఖీ చేసి సేఫ్టీ మెజర్‌మెంట్స్‌ లేని కంపెనీలను సీజ్‌ చేయాలి. చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలి. గాయాలపాలైన కార్మికులు, సిబ్బందికి మెరుగైన వైద్యం అందించాలి.
మాజీ సీఎం, హరీశ్‌ రావు దిగ్భ్రాంతి
సంగారెడ్డి పరిశ్రమలో రియాక్టర్‌ పేలి కార్మికులు మృతి చెందిన ఘటన పై మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు చేపట్టాల నీ, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.
ఘటనపై సీఎం దిగ్భ్రాంతి..
– క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం
ఎస్‌బీ పరిశ్రమలో పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలపై సమీక్షించిన సీఎం.. వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.