”మా తెలుగు టీచర్ బ్రహ్మాండంగా చెబుతుందిరా” ”మా సోషల్ సార్ భలే చెబుతార్రా” ఇలాంటివి పిల్లలు సర్వసాధారణంగా తమ టీచర్లు, ఉపాధ్యాయుల గురించి వ్యక్తం చేసే అభిప్రాయాలు. వారు ఏదీ దాచుకోరు. అయిష్టమైనా బయటికి అందరితోనూ వ్యక్తం చేస్తుంటారు. కొందరు ”అబ్బ, మా లెక్కల టీచర్ హోంవర్క్‌తో చంపుతోందిరా!” అనే అభిప్రాయాలూ వ్యక్తం చేస్తుంటారు. చిన్న క్లాసులో అయినా, పెద్ద క్లాసులో అయినా, ఉపాధ్యాయులంటే అయిష్టత కొంత బయట పడుతూ వుంటుంది.
సాధారణంగా క్లాస్‌లో కఠినంగా ఉండడం, హోంవర్క్ ఊహించిన దానికంటే ఎక్కువ ఇచ్చి ఇబ్బంది పెట్టడంతో పిల్లలు ఆయా ఉపాధ్యాయులు, టీచర్ల పట్ల అయిష్టంగానే ఉంటారు. వారి బోధనను నిర్లక్ష్యంగా చూస్తారు. అది క్రమంగా టెస్టులు, పరీక్షల ఫలితాల్లో తెలుస్తుంది. నిజానికి ఏ టీచరూ తమ విద్యార్ధిని ఇబ్బందిపెట్టాలని అనుకోరు. పిల్లల్ని చదువుబాట పట్టించాలన్న తపనే అలా చేయిస్తుంది. ఇది విద్యార్థుల తల్లిదండ్రులు తెలుసుకోవాలి.
ఉపాధ్యాయులు, టీచర్లపట్ల అభిమానం, అయిష్టత అనేవి వారి బోధనా విధానం, ప్రవర్తనలపైనే ఆధారపడి ఉంటాయి. కొందరు విద్యార్థులతో ఎంతో స్నేహంగా ఉంటూ వారి అనుమానాలు తీరుస్తుంటారు. తరగతి గదిలోనే కాకుండా బయట కూడా అందుకు తోడ్పడుతుంటారు. మరికొందరు తమ ట్యూషన్‌లో చేరమని భయపెడతారు. ఇంకొందరు తరగతి గది తప్ప బయట కలవడానికి వీలు లేకుండా చేస్తారు. తరగతి గదిలోనూ ఎంతో కఠినంగా వ్యవహరిస్తుంటారు. ఈ మూడు రకాల టీచర్లు విద్యార్థులను తీవ్రంగా ప్రభావం చూపుతారు. ఎంతో బాగా భోదించే టీచర్లతో అంతంత మాత్రం పాఠాలు చెప్పే ఉపాధ్యాయులను పోల్చి అయిష్టత పెంచుకుంటారు విద్యార్థులు.
పిల్లల్లో గ్రహణశక్తిని గుర్తించి, లోపం వున్న పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడి వారు ఆ సమస్యను అధిగమించేలా మార్గాలు సూచిస్తారు ఉపాధ్యాయులు. టీచర్లలో సహనం లేకపోవడం కూడా తల్లిదండ్రులకు ఇబ్బంది కలిగిస్తుంది. రోజులో ఎక్కువ భాగం పిల్లలు స్కూల్లోనే వుంటారు గనుక టీచర్లు వారితో స్నేహపూర్వకంగా ఉండాలనే తల్లిదండ్రులు కోరుకుంటారు.
ఇదో పెద్ద సమస్య
టీచర్-పేరెంట్ సమావేశాల్లో ఎక్కువగా చర్చకు వచ్చేది కూడా ఇదే. తల్లిదండ్రులకు అనేక పనులతో పిల్లలతో గడిపే సమయం అంతగా ఉండక పోవడం, టీచర్లకు అందరితో పాటు తప్ప ప్రత్యేకించి ఒక్కో విద్యార్థిపై శ్రద్ధ చూపే వీలు లేకపోవడం అనేవి ఎప్పుడూ పిల్లల మీదనే ప్రభావం చూపుతాయి. పిల్లల్లో ఉపాధ్యాయుల పట్ల ఆసక్తి లేకపోవడానికి కారణాలు ఇవి…
– టీచర్లలో బోధనా సామర్థ్యలేమి?
– విద్యార్థుల అవగాహనా శక్తి అంచనా వేయలేక పోవడం.
– బోధనలో మెళకువలు తెలియకపోవడం.
– విద్యార్థుల స్థాయికి వచ్చి బోధించలేక పోవడం.
– శిక్షించాలన్న ధోరణితోనే వ్యవహరించడం.
– ప్రశ్నించే వీలుకల్పించకపోవడం.
– వేధింపులు, ఫిర్యాదులు, కొట్టడం, తిట్టడం.
విద్యార్థులకు, టీచర్లకు మధ్య గురు శిష్య బంధం లేకపోవడానికి, స్నేహపూర్వక వాతావరణం తరగతి గదిలో లేకపోవడానికీ ఇంకా ఎన్నో కారణాలు ఉండవచ్చు. ట్యూషన్లు, పాఠ్యాంశాలు, టెస్టులు నిర్వహించే విషయాల్లో వచ్చే ఇబ్బందులతో విద్యార్థులపట్ల కఠినంగా వ్యవహరించడం జరుగుతోంది. వారు క్రమంగా కఠినంగా వ్యవహరించడంతో పిల్లలకు ‘తరగతి గది ఫోబియా’ పట్టుకుంటున్నట్లు వింటున్నాం. ఈ పరిస్థితులు రాకుండా ఉపాధ్యాయులు, స్కూలు యాజమాన్యం ప్రత్యేకశ్రద్ధ తీసుకోవాలి.
టీచర్ల భయంతో క్లాసులు డుమ్మా కొట్టడం జరుగుతూ వుంటుంది. ఇది తొలినాళ్లలోనే గ్రహించాలి. లేకుంటే అదే అలవాటైతే, ఆ సబ్జెక్టు అసలుకే రాకుండా పోతుంది. టీచర్ పట్ల అయిష్టతతో సబ్జెక్టుపట్ల అయిష్టత పెరుగుతుంది. ఈ పరిస్థితుల నుంచీ పిల్లల్ని రక్షించాలి.
నా స్నేహితురాలు కొడుకు ఫిజిక్స్ అంటే భయపడటం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వాళ్లు నాకు చెప్పారు. పిల్లాడితో మాట్లాడాను. వాడు చెప్పినదానిలో సగం టీచర్ పట్ల అయిష్టతే వ్యక్తమైంది. ఆమె బోధనా విధానం వాడికి నచ్చలేదు. అందువల్ల సబ్జెక్టుపట్ల ఆసక్తి కోల్పోయాడు. అదష్టవశాత్తూ ఇది తొలిదశలోనే బయటపడింది. అందుకే వాడిని టీచర్ గురించి పట్టించుకోకుండా ప్రతి క్లాసుకీ వెళ్లమన్నాను. డుమ్మా కొట్టడం మానేసి సబ్జెక్టును ఇంటివద్దే ఎక్కువ చదువుతూ ఉండమన్నాను. క్రమంగా ఆ సూచన బాగా పనిచేసింది. అ పిల్లవాడు టీచర్ దృష్టిని ఆకట్టుకున్నాడు. క్లాస్ టెస్టుల్లోనూ రాణించాడు. ఇప్పుడు వాడికి ఫిజిక్స్ పట్ల భయం పోయింది. అంటే పిల్లల్లో భయానికి మూలాన్ని పట్టుకోవాలన్నమాట. అపుడే సమస్య పరిష్కారం చేయగలం.
– డా|| హిప్నో పద్మా కమలాకర్, 9390044031
కౌన్సెలింగ్, సైకో థెరపిస్ట్, హిప్నో థెరపిస్ట్