నీ సింహాసన రక్షణ కోసం
నీ కీర్తి దాహం కోసం
నీ సామ్రాజ్యవాద
దురహంకారం కోసం
మదమెక్కిన నీ
జాత్యాహంకారం కోసం
అవతలవారినీ ప్రేరేపించే
నీ యుద్ధ కాంక్ష కోసం
రక్షణకంటూ ఒకరు
ప్రతీకారం కోసమని ఒకరు
యుద్ధ కర్మాగారాల్లో
నిరంతర ఉత్పత్తికోసం ఒకరు
ఎప్పటికప్పుడు ప్రపంచానికి
తమ శక్తి తెలియాలని ఒకరు
మనిషి రక్తాన్ని ఎప్పుడూ
రుచి చూడాలని ఒకరు
ఏమైతేనేం ఎలాగైతేనేం
నీ యుద్ధ ప్రణయం
సామాన్య జనానికి
ఎప్పుడూ ప్రళయమే
భూగోళం చల్లగా ఉంటే
నీ ఉదరంలో హృదయంలో
నిరంతరం మండుతున్న
సంగ్రామ క్షుద్బాధ
ఏనాటికీ చల్లారదు
పౌరుల మరణాలతో
నీ మెడలో కపాలాల
పూలహారం సువాసనలు
విరబూస్తూ ఉండాలి మరి
ఆ నిర్జీవ దేహాలే
నీవు జీవించడానికి సోపానాలు
అందుకే యుద్ధ భయం
ప్రపంచంలో ఉండాలెప్పుడూ నీకూ..!
– జంధ్యాల రఘుబాబు, 9849753298