– సెన్సెక్స్ 930 పాయింట్లు ర్యాలీ
– నూతన గరిష్టాలకు మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు నూతన గరిష్ట స్థాయిలకు ఎగిశాయి. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగించడంతో పాటు భవిష్యత్‌లో రేట్ల తగ్గింపు ఉంటుందని సంకేతాలు ఇవ్వడంతో సెన్సెక్స్, నిఫ్టీలు భారీ లాభాలతో నూతన రికార్డ్‌లకు చేరాయి. ముఖ్యంగా ఐటి, రియల్టీ షేర్ల పరుగులతో బిఎస్‌ఇ సెన్సెక్స్ 930 పాయింట్లు లేదా 1.34 శాతం ఎగిసి 70,514కు చేరింది. అదే బాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 256 పాయింట్లు లేదా 1.26 శాతం రాణించి 21,183 వద్ద ముగిసింది. సెన్సెక్స్-30లో ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, విప్రో, హెచ్‌సిఎల్ టెక్, ఇండుస్‌ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎంఅండ్‌ఎం, టీసీఎస్ తదితర సూచీలు అధికంగా 4 శాతం మేర లాభపడిన వాటిలో టాప్‌లో ఉన్నాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 1 శాతం, 0.6 శాతం పెరిగాయి. ఒక్కపూటలోనే మదుపరుల సంపద దాదాపు రూ.4లక్షల కోట్లు పెరిగి.. బీఎస్‌ఈ మార్కెట్ కాపిటలైజేషన్ రూ.355 లక్షల కోట్లకు చేరింది. ఆసియా మార్కెట్లలో షాంఘై, నిక్కీ మినహా మిగిలిన అన్ని మార్కెట్లు లాభపడ్డాయి. యూరప్ మార్కెట్లు లాభాల్లో సాగాయి. ద్రవ్యోల్బణం కట్టడికి రేట్లు పెంచుతూ వచ్చిన అమెరికా ఫెడరల్ రిజర్వ్ తాజాగా తన కీలక రేట్లలో ఎలాంటి మార్పూ చేయలేదు. రెండు రోజుల పాటు జరిగిన ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్‌ఓఎమ్‌సీ) భేటీలో ద్రవ్యోల్బణం ఇంకా 2 శాతం లక్ష్యం కంటే ఎగువనే ఉన్నందున కఠిన వైఖరిని కొనసాగించాలని నిర్దేశించుకుంది. విధాన రేట్లను ప్రస్తుత 5.25-5.50 శాతం శ్రేణిలోనే ఉంచుతున్నట్టు స్పష్టం చేసింది. వరుసగా మూడో సారీ రేట్లను ఇదే స్థాయిలో కొనసాగించింది. కాగా.. 2024లో మూడు విడతల్లో వడ్డీ రేట్లలో కోత ఉండొచ్చన్న సంకేతాలు ఇవ్వడంతో ప్రపంచ మార్కెట్లలో ఉత్సాహం నెలకొంది.