భారత్‌లో ఫెడరలిజం ప్రశ్నార్థకం

Federalism in India is questionable– మోడీ పాలనలో సమాఖ్య విధానానికి తూట్లు
– పలు అంశాల్లో రాష్ట్రాల ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహారం
– రాష్ట్ర ప్రభుత్వాలు, సామాజికవేత్తలు, రాజ్యాంగ నిపుణుల ఆందోళన
కేంద్రంలోని మోడీ పాలనలో దేశంలో ఫెడరలిజం ప్రశ్నార్థకంగా మారుతున్నది. రాష్ట్రాల అధికారాల్లోకి చొరబడుతూ కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నదని ప్రతిపక్ష పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు, రాజ్యాంగ నిపుణులు, సామాజికవేత్తలు, విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఢిల్లీ ప్రభుత్వం  వర్సెస్‌ కేంద్రం
పార్లమెంటులో ప్రతిపక్షాలు ప్రతిపాదిత బిల్లును ఓడించడంలో విఫలమైనందున ఢిల్లీ సేవల బిల్లు చట్టంగా మారింది. అయితే, చట్టం ప్రతిపక్షాలను ఏకం చేయడానికి ఉపయోగపడింది. చాలా ప్రతిపక్ష పార్టీలు ఇది రాజ్యాంగ విరుద్ధమనీ, దేశ సమాఖ్య నిర్మాణాన్ని బలహీనపరిచే ప్రయత్నమని ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో బ్యూరోక్రాట్‌ల బదిలీలు, పోస్టింగ్‌లపై లెఫ్టినెంట్‌ గవర్నర్‌(ఎల్‌జీ) నియంత్రణను పునరుద్ధరించే కేంద్ర ఆర్డినెన్స్‌ను వివాదాస్పద బిల్లు భర్తీ చేసింది. ఈ అధికారాన్ని మేలో సుప్రీంకోర్టు ఢిల్లీ ప్రభుత్వానికి అప్పగించింది. అయితే, చివరకు కేంద్రం ఈ బిల్లును ప్రతిష్టాత్మకంగా తీసుకొని చట్టంగా మార్చి తన పంతాన్ని నెగ్గించుకున్నది.
న్యూఢిల్లీ : బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం భారత్‌లో సమాఖ్య విధానానికి తూట్లు పొడుస్తున్నదని విమర్శిస్తున్నారు. ఢిల్లీ ప్రభుత్వంలోని బ్యూరోక్రాట్‌ల నియామకాలు, బదిలీలపై కేంద్రానికి పూర్తి నియంత్రణను ఇచ్చే ఢిల్లీ ఎన్‌సీటీ (సవరణ) బిల్లు విషయంలో పార్లమెంటులో సహకార ఫెడరలిజంపై ఆందోళనలు చర్చకు దారి తీశాయి. అలాగే, గవర్నర్ల నియామకం, జాతీయ విద్యా విధానం, వైద్య విద్య కోసం జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్‌)పై గొడవ, అధికార వికేంద్రీకరణ వంటి విషయాల్లో కేంద్రం, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల మధ్య వివాదాలు నిత్యకృత్యమయ్యాయి.
నీట్‌ విషయం
నీట్‌ అడ్మిషన్లపై తమిళనాడు ప్రభుత్వం, కేంద్రం మధ్య ఎన్నో ఏండ్లుగా వివాదం కొనసాగుతున్నది. ఈ చిరకాల వాగ్వివాదం ఇప్పుడు తారాస్థాయికి చేరుకున్నది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే స్టాలిన్‌ విద్యను ఉమ్మడి జాబితా నుంచి రాష్ట్ర జాబితాకు మార్చాలని డిమాండ్‌ చేశారు. 2013 నుంచి అండర్‌ గ్రాడ్యుయేట్‌(యూజీ) మెడికల్‌ కోర్సుల కోసం నీట్‌ పరీక్షలు నిర్వహించబడుతున్నప్పటికీ.. తమిళనాడు అసెంబ్లీ 2021లో నీట్‌ వ్యతిరేక బిల్లును ఆమోదించింది. విద్య ఉమ్మడి జాబితాలో ఉన్నందున గవర్నర్‌ ఆర్‌.ఎన్‌ రవి బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు పంపారు.
గవర్నర్‌ వర్సెస్‌ రాష్ట్రాలు
గవర్నర్లు, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ ఇటీవలి కాలంలో గరిష్ట స్థాయికి చేరుకున్నది. కొన్నిసార్లు రాజ్యాంగ సంక్షోభానికి దారితీసింది. కేరళ, తమిళనాడు, తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌ వంటి ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలలో పెండింగ్‌ బిల్లులు, రాష్ట్ర విశ్వవిద్యాలయాలలో వైస్‌-ఛాన్సలర్‌(వీసీ) నియామకాలు, ఇతర సమస్యలతో పాటు పాలనలో జోక్యం చేసుకోవడంపై గవర్నర్‌లతో వివాదాలు నడుస్తున్నాయి. ప్రతిపక్షాలు పాలిత రాష్ట్రాల్లో గవర్నర్ల కార్యాలయాన్ని కేంద్రం దుర్వినియోగం చేసి పాలనను అడ్డుకుంటున్నదని రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. గవర్నర్‌, రాష్ట్రాధినేతల మధ్య సంబంధాలు క్షీణించడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు.
జాతీయ విద్యా విధానం
మరో పోటీ అంశం జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ). అనేక ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు విద్యను కేంద్రీకరిస్తున్నారని ఆరోపించాయి. ఇటీవల, కర్నాటక ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఎన్‌ఈపీ అమలును రద్దు చేయనున్నట్టు ప్రకటించింది. బదులుగా రాష్ట్ర విద్యా విధానాన్ని (ఎస్‌ఈపీ) ప్రవేశపెట్టనున్నది. తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలు కూడా అనేక అంశాల్లో ఎన్‌ఈపీని వ్యతిరేకించాయి. అంతేకాకుండా, తమిళనాడు ఎన్‌ఈపీ మూడు భాషల విధానానికి వ్యతిరేకంగా ఉన్నది. అలాగే, రాష్ట్ర విద్యా వ్యూహాన్ని అభివృద్ధి చేయడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. నేషనల్‌ ఎడ్యుకేషన్‌ కమిషన్‌, అకడమిక్‌ బ్యాంక్‌ ఆఫ్‌ క్రెడిట్‌ (ఏబీసీ),కామన్‌ యూనివర్శిటీ ఎంట్రన్స్‌ టెస్ట్‌(సీయూఈటీ) ద్వారా రాష్ట్రాల అధికారం తగ్గించబడిందని చాలా రాష్ట్రాలు వాదించాయి. అయినప్పటికీ ఎన్‌ఈపీ విషయంలో మోడీ సర్కారు మొండిగా ముందుకెళ్లటం గమనార్హం. కేంద్రంతో విశ్వాస లోపం కారణంగా ఫెడరలిజం ప్రమాదంలో పడిందని ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు ఆరోపించాయి.
జీఎస్టీ కౌన్సిల్‌ మరో ప్రధాన వివాదాస్పద అంశం జీఎస్టీ కౌన్సిల్‌. 2017లో
ఆర్థిక సమాఖ్య వ్యవస్థకు మార్గదర్శకంగా జీఎస్టీ అమలు చేయబడినప్పటికీ.. జీఎస్టీ పరిహారం, జీఎస్టీ కౌన్సిల్‌ నిర్ణయాత్మక నిర్మాణంపై అనేక రాష్ట్రాలు కేంద్రంతో విభేదిస్తున్నాయి. తమ సార్వభౌమ పన్ను హక్కులపై నియంత్రణను ఫెడరల్‌ బాడీకి అప్పగించిన తర్వాత రాష్ట్రాలు ఆర్థిక అసౌకర్యానికి గురవుతాయని నిపుణులు, విశ్లేషకులు తెలిపారు.
ఆర్టికల్‌ 370 రద్దు
జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్రపతి పాలనలో ఉన్న సమయంలో ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించడం, ఆర్టికల్‌ 370ని పనికిరాకుండా చేయడం సహకార ఫెడరలిజం నుంచి వైదొలగడానికి మరొక ఉదాహరణగా పరిగణించబడుతుందని రాజకీయ నిపుణులు, విశ్లేషకులు తెలిపారు. ఈ అంశం ఇప్పుడు సుప్రీంకోర్టు దృష్టికి రావటం గమనార్హం.