ఫీజు బకాయిలను విడుదల చేయాలి

– మెస్‌ బిల్లులు, డైట్‌ చార్జీలు ఇవ్వాలి : ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో మూడేండ్లుగా పెండింగ్‌లో ఉన్న రూ.7,800 కోట్ల ఫీజు రీయింబ ర్స్‌మెంట్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎల్‌ మూర్తి, కార్యదర్శి టి నాగరాజు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. డిగ్రీ, పీజీ కాలేజీలకు రూ.750 కోట్లు చెల్లిస్తామంటూ టోకెన్లు ఇచ్చినా ఇంకా డబ్బులెందుకు విడుదల చేయలేదని ప్రశ్నించారు. వసతి గృహాలకు కేటాయించిన మెస్‌ బిల్లుల బడ్జెట్‌ను కూడా ఈ-కుబేర్‌ నుంచి విడుదల చేయలేదని తెలిపారు. వాటిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జోక్యం చేసుకుని ఆదివారంలోగా ఇచ్చిన టోకెన్లకు డబ్బులు మంజూరు చేయాలని కోరారు. సంక్షేమ రంగానికి సంబంధించిన మెస్‌ బిల్లులు, డైట్‌ చార్జీలను వెంటనే విడుదల చేయాలనీ, టోకెన్లు ఇచ్చిన వాటికైనా బిల్లులను చెల్లించాలని తెలిపారు. నిర్దిష్ట గడువులోగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను చెల్లించడంతోపాటు ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగా చెల్లించేందుకు మెరుగైన విధానాన్ని అమలు చేయాలని సూచించారు.