ఫీల్‌ గుడ్‌ సినిమా..

సాయికుమార్‌, శ్రీనివాస్‌ సాయి, ఆదిత్య ఓం, దీపాలి రాజపుత్‌, ఐశ్వర్య రాజీవ్‌ కనకాల కీలక పాత్రధారులుగా శాంతి కుమార్‌ తూర్లపాటి (జబర్దస్ట్‌ ఫేం) దర్శకత్వంలో ప్రశాంత్‌ టంగుటూరి నిర్మిస్తున్న చిత్రం ‘నాతో నేను’. ఈ సినిమాలోని ‘ఓసిని వయ్యారి రామ చిలుక’ అంటూ సాగే లిరికల్‌ వీడియోను హీరో ఆది సాయికుమార్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ”ఈ మధ్యన నాన్న కథల ఎంపికలో ఆచితూచి అడుగేస్తున్నారు. ఇందులో అయన కీలక పాత్ర పోషిస్తున్నారు. ఫీల్‌ గుడ్‌ సినిమా అని, తన పాత్ర కొత్తగా ఉంటుందని నాన్న చెప్పారు. తాజాగా విడుదల చేసిన పాట నాకు బాగా నచ్చింది. లిరిక్స్‌ అర్థవంతంగా ఉన్నాయి. సినిమా కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అని అన్నారు. ‘జబర్దస్త్‌ కమెడీయన్‌గా ప్రేక్షకులు నన్ను ఆదరించారు. ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేసి దర్శకుడిగా తొలి ప్రయత్నం చేశాను. కథ, మాట, పాటలు నేనే రాసుకుని నిర్మాతల సహకారంతో ఈ సినిమా పూర్తి చేశాం’ అని తెలిపారు. ‘మంచి కథతో తొలి ప్రయత్నం చేశాం. ఇందులో సాయి కుమార్‌ కొత్తగా కనిపిస్తారు. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం’ అని నిర్మాత అన్నారు.