స్త్రీవాద గొంతుకే ‘చైతన్య బావుట’

”జీవితంలో
ఎన్ని అటుపోట్లు ఎదురైనా
అసూయ అవమానం తోడై వచ్చినా
గమ్యం వదలొద్దు”
అంటూ చేసిన ప్రత్యక్ష హెచ్చరికలు పుస్తకం చదవడం ముగించిన తర్వాత కూడా ఆలోచనల్లో వెంటాడుతుంటాయి.
అక్షరమంటే జ్వలించే స్ఫూర్తి. కొన్ని సందర్భాలను కలిపికుట్టి పతాక కాగడాలుగా ఎగరవేసే చైతన్యదీప్తి. దీనిని కవితామయం చేసే క్షణాలు కాలాన్ని విజయబావుటాగా రూపుదిద్దుతాయి. అలాంటి ఒక ప్రయత్నమే కవయిత్రి స్వరూప ” చైతన్య బావుట” కవితాసంపుటిలో చేశారు. ఇందులో ప్రతి కవితలోనూ స్త్రీ వాదం గొంతుక బలంగా ఉట్టిపడుతుంది.

జీవితంలో ఎన్ని ఆటంకాలు, సవాళ్ళు ఎదురైనప్పటికీ వెనకడుగు వెయ్యకుండా లక్ష్యసాధనలో అవిశ్రాంతంగా పోరాడుతూనే ఉండాలి అన్న స్ఫూర్తిని అడుగడుగునా వీటిలో నింపారు. శ్రీ శ్రీ ‘మహాప్రస్థానం’ చదివినప్పుడు ఎలాంటి భావోద్వేగానికి లోనవుతామో, అలాంటి ఉద్వేగభరితమైన మానసిక చైతన్యమే ఈ కవితాసంపుటిని చదువుతున్నపుడు కూడా కలుగుతుంది. ప్రతిదాంట్లోనూ పిడికిలి బిగించాలి, పోరాడాలి అన్న పిలుపు పరోక్షంగా ఆడజాతిని హెచ్చరించి మేల్కొలుపుతుంది. ఈ పోరాట స్పూర్తిని అడుగడుగునా రగిలించి మానసిక చైతన్యవంతుల్ని చేస్తుంది. ఈ ప్రేరణలోంచే కొత్త ఉత్సాహాన్నీ, ఊపునీ కలిగిస్తాయి.
”జీవితంలో
ఎన్ని అటుపోట్లు ఎదురైనా
అసూయ అవమానం తోడై వచ్చినా
గమ్యం వదలొద్దు” అంటూ చేసిన ప్రత్యక్ష హెచ్చరికలు పుస్తకం చదవడం ముగించిన తర్వాత కూడా ఆలోచనల్లో వెంటాడుతుంటాయి.
”రాబోయే విజయాలను
పిడికిట్లో చూడాలి
ఆ గెలుపు చప్పట్లు
గుండెల్లో మోగాలి” అన్నపుడు రగిలే ఉద్వేగభరిత క్షణాలు కాలాన్ని చైతన్యవీచికలతో మంత్రముగ్ధం చేస్తాయి. ఇలాంటి వాక్యాలు ప్రతి స్త్రీ తన గుండె గోడ మీద లిఖించుకోవాల్సిన చరణాలు. చైతన్యానికి మానసిక ఉత్ప్రేరకాలుగా ఇవి పని చేస్తాయి.
”మహిళ అంటే
ఎందుకు పనికి రాని అతివ కాదు
సమస్త శక్తులను
ఎదుర్కొనే ధీరవనిత” అంటూ ప్రస్తావించిన సందర్భ వాక్యాలు కదలిక ఉన్న ప్రతి మహిళాలోకాన్నీ మేల్కొలుపుతాయి.
‘నేను’ అన్న కవిత ఒక ప్రత్యేకత కలిగినది. అతివలోని అన్ని కోణాల్నీ ఇది స్పశిస్తుంది.
”కన్నీరు” శీర్షికలో మీరు చెప్పిన ప్రతి అక్షరం శతశతాంశమూ అక్షరసత్యం.
చివరిగా ఓచోట చెప్పినట్టు
”గెలుపు నాదైతే
ఓటమి కూడా నాదే కదా” అనే తార్కికస్పహ చదువరుల్ని కట్టి పడేస్తుంది.
‘యోధురాలు’ కవితలో మీరు చెప్పినట్టు..
” ఈ ప్రపంచంలో యుద్ధం చేయాల్సి వస్తే
అందరికంటే గొప్పగా యుద్ధం చేసేది మా ఆడవాళ్ళే ” అన్న పంక్తులు ఆత్మవిశ్వాసానికి ఒక ప్రతీకగా నిలబడతాయి.
”కవయిత్రిని నేను
కలాన్ని కదిలిస్తాను” అంటూ ఓచోట మీరు చేసిన భావప్రకటనలో అప్రయత్నంగా శ్రీశ్రీ స్ఫురిస్తాడు.
‘ప్రకతి కన్నీరు’ శీర్షికలో వర్తమాన చరిత్రను వాస్తవికంగా కళ్ళకు కట్టించారు. నిజాన్ని నిర్భయంగా ప్రకటించారు.
”పంచాభూతాలను సైతం
శాసించాలనే పిచ్చి ఆశతో
మనిషి చేసే మారణకాండను చూసి
ప్రకతి కన్నీరు పెడుతోంది” అన్న పంక్తులు పర్యావరణ పరిరక్షణకి మనిషి కలిగించే విఘాతాల్ని, ప్రదర్శించే విరుద్ధ వికతచర్యల్ని, చేష్టల్ని ఆర్ద్ర స్వరంతో తూర్పారబడుతూ ఎండగడుతుంది.
”సమరశంఖం” కవితలో చెప్పినట్టు..
”దోపిడీ పాలకుల పంథాన్ని
ధ్వంసం చేసే అస్త్రశస్త్రాన్ని” అంటూ విడమర్చి చెప్పిన పలుకులు ప్రమాదఘంటికల్ని మోగిస్తాయి.
‘మత్యువు’ అనే కవితలో
”నాకు చాలా పనులు ఉన్నాయి
నేను రాలేను
నీతో నువ్వే వెనితిరిగి
వెళ్ళిపో మత్యువా” అని వ్యక్తీకరించడంలోని భావగర్భిత మార్మికత తాత్త్విక స్పహతో పాఠకుల్ని వెంటాడుతుంది.
‘అనాధ’ శీర్షికలో..
”లోకం చూడాల్సిన పాపను
శోకం చీకటిలో ముంచేసింది
తల్లిదండ్రులకు లేని బాధ
చెయ్యని తప్పుకు
ఆ పాప అనాధ అయ్యింది” అంటూ రాసిన వాక్యాలు కంటతడి పెట్టిస్తాయి.
ఇలా వైవిధ్యపూరిత వస్తువు ఇతివత్తాలతో, సరళమైన శైలితో, గాఢత ఉట్టిపడే వాక్య నిర్మాణంతో ఈ కవితాసంపుటి అమూలాగ్రం ఆకట్టుకుని చదువరులను కట్టిపడేస్తుంది. వీటిలో మీ సొంతగొంతు వినిపిస్తుంది. సామాజిక కోణాల్ని బహుముఖ రూపకోణాల్లో ఆవిష్కరిస్తారు. సమీప భవిష్యత్తులో మీ నుండి మరిన్ని మేలైన కవితాసంపుటులు అక్షరచిగురులు తొడగాలని ఆకాంక్షిస్తూ స్వరూప కవిత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ స్వాగతిద్దాం.
ఎన్‌. లహరి
9885535506