స్త్రీ కేంద్రీకృత కవిత్వం ‘ఆకురాలు కాలం’

a lyrical beautyµ ”కవిత్వం రాయడం అంటే ఖడ్గంతో సహజీవనం చేయడం” అంటారు ప్రముఖ కవి శివారెడ్డి. మాట్లాడటాన్ని తప్పుగా ధృవీకరిస్తున్న చోట, మనుగడ నియంత్రణకు గురవుతున్న చోట, అక్షరంపై నిర్బంధాల ముళ్ళు స్వైర విహారం చేస్తున్న చోట కవిత్వం రాయడం అంటే ఖడ్గంతో సహజీవనం చేయడమే కదా. స్వేచ్ఛా కాముకులు, శాంతి ప్రబోధకులు కవులు అయినప్పుడు ఏటికి ఎదురీదటమే వారి పని. ఇది ఎప్పుడూ కొత్తకాదు. ప్రగతిశీలురైన కవులు అప్పుడూ ఉన్నారు, ఇప్పుడూ ఉన్నారు. తెలుగు కవయిత్రులు ఫెమినిజం గురించి ఉధృతంగా కవితలు రాస్తూ పురుషాధిపత్యాన్ని ప్రశ్నిస్తున్న 90వ దశకంలో, వారంతా ఖడ్గంతో సహజీవనం చేసిన వారే. అదే దశకంలో చివరినాటికి ఓ ముస్లిం యువతి తెలుగు కవితా ప్రపంచంలోకి దూసుకొచ్చింది. వస్తూ వస్తూ ‘ఆకురాలు కాలం’ కవితా వసంతాన్ని తీసుకొచ్చింది. అందుకే పాతికేళ్ళు దాటినా నిత్యనూతనంగా ఆకుపచ్చగా పరిఢవిల్లుతుంది ఆ కవిత్వం. ఎటువంటి హడావుడి లేకుండా నిబ్బరంగా, నింపాదిగా స్థిరంగా తను వినిపించాల్సింది వినిపించింది. ఇప్పటి ఆధునిక కవితా లోకంలోనూ నిత్యస్మరణకు గురవుతున్నది ఆమె గొంతుక. ఆ గొంతుక మరెవరో కాదు. కవయిత్రి, సామాజిక కార్యకర్త, హైకోర్టు న్యాయవాది మహెజబీన్‌ బేగ్‌.
మహెజబీన్‌ బేగ్‌ కవితా రంగంలో అడుగు పెట్టే నాటికి ఫెమినిజం ఉధృతస్థాయిలో ఉంది. నక్సలైట్‌ ఉద్యమం, ప్రభుత్వం వారిపై తీసుకుంటున్న చర్యల జుగల్బందీ అంతే తీవ్రస్థాయిలో ఉన్నాయి. అందుకు తగినట్లుగా అప్పటి కవుల నుంచి ప్రగతిశీల కవిత్వం ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. అదే సమయంలో మహెజబీన్‌ వచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేక వ్యక్తీకరణను కనబరిచి కవిత్వంలో తనకుతాను ఒక బెంచ్‌ మార్క్‌ సెట్‌ చేసుకున్నారు. ఆమె ఒలికించిన కవిత్వం సైతం ఖడ్గంతో సహజీవనం చేయడంవంటిదే. మొన్నటికి మొన్న ప్రభుత్వం నుంచే పౌరసత్వ వేధింపులు ఎదుర్కొంటున్న ప్రజలకు మద్దతుగా ”ప్రశ్న దేశద్రోహమైంది… ఏం చేయను..?” అంటూ ఓ కవిత సంధించారు.
‘ఆకురాలు కాలం’ అనే కవితాసంపుటి 1997లో వెలువడింది. విడుదలైన తరువాత అనేకమంది విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కొద్దిరోజుల్లోనే కాపీలన్నీ హాట్‌ కేకుల్లా అమ్ముడయ్యాయి. అయితే పుస్తకంగా రావడానికి ముందే ఆమె రాసిన కవితలు వివిధ పత్రికల్లో అచ్చవడంతో, పుస్తకంగా వచ్చేనాటికే ఆమె పాఠకులకు సుపరిచితమయ్యారు. సాహిత్యాభిమానులు ఈ పుస్తకం కాపీ కోసం పాతికేళ్ళుగా ఆరా తీస్తూనే ఉన్నారంటే సమాజంలో ఆమె కవిత్వానికి ఎంతటి ఆదరణ దక్కిందో అర్థం చేసుకోవచ్చు. ఎట్టకేలకు ఈ ఏడాది రెండో ముద్రణకు పూనుకున్నారు కవయిత్రి.
పుస్తకంలో మొత్తం ఇరవైఆరు కవితలున్నాయి. అన్నీ స్త్రీ కేంద్రీకృతంగా సాగిన కవితలే. తన జీవిత భాగస్వామి ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిస్తున్నప్పుడు ఒక మహిళ భావోద్వేగాలు ఏ విధంగా ఉంటాయో అనేక పార్శ్వాలలో చూపించగలిగారు కవయిత్రి. అలాగే ఆమెలోని ఫెమినిస్ట్‌ను పట్టి ఇచ్చే కవితలూ ఉన్నాయి. బాలకార్మిక వ్యవస్థ, బాల్య వివాహాలు, వ్యభిచారం వంటి సామాజిక సమస్యలపైనా కవితలు ఉన్నాయి. ఈ కవితలు అన్నింటిలోనూ స్త్రీ సహజమైన గుణం ప్రేమే మూలం. సాటి మనిషిని మనిషిగా చూడటం, కష్టాల్లో ఉన్న వారికి చేయూతనీయడం, ఆధిపత్యాన్ని ప్రశ్నించడం, దాష్టీకంపై తిరుగుబాటు చేయడం వంటి అనేక కోణాలు ఈ కవితల్లో ప్రస్ఫుటమవుతున్నాయి.
”అందమైన అమ్మశరీరం మీద/ దగ్ధమైన యవ్వనాన్ని చూసినదాన్ని/ వెన్నెల ప్రవహించే ఆమె హృదయం మీద/ నాన్న చేసిన గాయాలు చూసినదాన్ని” అంటారు అజ్నబీ కవితలో. ఈ కవిత తండ్రితో సంభాషిస్తున్నట్లు మొదలు పెడతారు. ”నీ కథ నా కథ ఒక్కటే/ నీ తల్లి నా తల్లి కన్నీటి భాష్యం ఒక్కటే” అంటూ ప్రారంభించి ఆ తండ్రీ కూతుళ్ళను వేరు చేస్తున్నది ‘జెండర్‌’ అంటూ పితృస్వామిక వ్యవస్థపై తన అస్త్రాన్ని గురిపెడతారు. ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం ఈ కవిత రాసినప్పటికీ ఆమె కలలుగన్న సమానత్వం ఇప్పటికీ సంపూర్ణంగా రాలేదన్నది ఎంత నిజమో… కొంతలో కొంత మార్పు వచ్చిందన్నదీ అంతే నిజం. పురుషాధిపత్య సమాజం ఆడపిల్లను, మగపిల్లవాడిని సమానంగా పెంచగలిగి ఉంటే ”ఈరోజు నీ వృద్ధాప్యాన్ని/ భుజాల మీద మోసే దాన్ని కదా!” అంటారు ఓ కవితలో.
బాలకార్మిక వ్యవస్థ గురించి ఆవేదన చెందుతూ ఆమె రాసిన కవిత ‘చైల్డ్‌ లేబర్‌’. ఈ కవితను రాష్ట్ర విభజనకు ముందు పదోతరగతిలో పాఠ్యాంశంగా చేర్చింది ప్రభుత్వం. ఉద్యమ నేపథ్యంలో రాసిన కవిత ‘ఆకురాలు కాలం’. ఇదే శీర్షికను పుస్తకానికి టైటిల్‌గా ఎంపిక చేసారు.
మెహందీ అనే ప్రాంతంలోని వ్యభిచార కూపంలో కూరుకుపోయిన మహిళల గురించిన కవిత ఒకటి ఉంది ఈ పుస్తకంలో. ”అక్కడ/ జీవితం గాయపరిచిన పక్షులన్నీ/ పేదరికం మూటగట్టుకుని వాల్తాయి/ బాధలు గాధలు సమానత్వం పాటిస్తాయి” అంటూ సాగే ఈ కవితలో హైదరాబాద్‌లో ఒకప్పుడు సాగిన వ్యభిచారవృత్తి గురించి, అందులో కూరుకుపోయిన ఆడవారి గురించి ఆవేదన చెందుతూ లిఖించిన కావ్యమిది.
రోజు రోజుకూ పెచ్చుమీరుతున్న సామాజిక సమస్యల్లో కులం, మతం ఒకటి. ఒకప్పుడు ‘అంటరానితనం అమానుషం’ అంటూ ప్రజల్లో చైతన్యం తీసుకు వచ్చేందుకు ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేసేవి. పిల్లలు చదువుకునే పాఠ్య పుస్తకాలపై, రాసుకునే నోట్‌బుక్స్‌పై ఇటువంటి కొటేషన్స్‌ కనిపించేవి. అవి బాల్యంలోనే వారిలో తోటి మనుషుల పట్ల మర్యాదగా మెసులుకోవడం అనే అంశాన్ని నాటేవి. ఇప్పటి ప్రభుత్వాలు అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తూ వివిధ వాదాలను పెంచి పోషిస్తున్నాయి. అందుకు అనుగుణంగానే దాడులు, హత్యలు జరుగుతూ ప్రగతిపథంలో పయనించాల్సిన దేశాన్ని మరింతగా అగాథంలోకి నెట్టివేస్తున్నారు. కులం, మతం అంశంపై మహెజబీన్‌ 1995లో ఎంత చక్కటి కవిత రాసారో చూడండి. ”నేను మజీద్‌, తను మందిర్‌/ మాకో యేసు ప్రభు పుట్టాడు” అని మొదలుపెడతారు. ఇదే కవితలో ”మొగుణ్ణి దేవుళ్ళ లెక్కలోకి చేర్చకుండా/ సహచరుడిగా ప్రేమించడం/ ప్రపంచ వింతల్లో చేరిపోయింది” అని వైవాహిక వ్యవస్థలోని మిథ్యలను కొట్టి పారేస్తారు.
భిన్న కోణాలలో సమాజంలో ప్రేమతో పాటు చైతన్యాన్ని పెంచేలా రూపు దిద్దుకున్న ఆకురాలు కాలంలోని కవిత్వమంతా ఎంతో సున్నితంగా ఉంటుంది. రాడికల్‌ భావజాలం ఉన్నప్పటికీ ఎక్కడా గొంతెత్తి నినదిస్తున్నట్లుగా కనిపించదు. అలాగని పాత భావజాలాన్ని మోస్తున్నట్లుగానూ ఉండదు. చెప్పాల్సిన అంశాన్ని సూటిగా, పాఠకుల మెదడులోకి ఇంకించి ఆలోచింపజేస్తున్నట్లుగా ఉంటుంది. కవిత్వం మధ్యలో ఉర్దూ షాయరీలో ఉన్నట్లుగా ఒక విరుపూ ఉంటుంది. కవిత ఎత్తుగడ నుంచి చివరి వరకూ ఎక్కడా తడబడకుండా అదే ప్రవాహాన్ని కొనసాగిస్తారామె. నిశ్చలంగా స్పష్టంగా చెప్పాల్సిన విషయాన్ని రూఢి చేసే తత్వం ఉర్దూ షాయరీలో కనిపిస్తుంది. అందుకేనేమో కవితల్లోని శబ్ద సౌందర్యాన్ని ‘నజాకత్‌’ గా అభివర్ణించారు విమర్శకులు, ఉర్దూ పండితులు సామల సదాశివ.
ఇక ఈ పుస్తకానికి ముందుమాట రాసిన ప్రొఫెసర్‌ చేకూరి రామారావు ”ఈ దశాబ్దపు వాగ్దానం మహెజబీన్‌” అని కితాబునిస్తే, ”a lyrical beauty’ గా కీర్తించారు శివారెడ్డి. మహెజబీన్‌లోని ప్రతిభకు తగినట్లుగా వారు ఈ మాటలు రాసినప్పటికీ, ఆమె పట్ల చేసిన ఫిర్యాదును విస్మరించకూడదు. పదునైన కవిత్వం రాసే మహెజబీన్‌ రాయాల్సినంతగా రాయలేదనేదే ఆ ఫిర్యాదు. అ యినప్పటికీ ఆమె నుంచి మరో పుస్తకం రాకపోవడం ఆశ్చర్యంగానే ఉంటుంది. అయితే పత్రికల్లో మటుకు ఆమె రాసిన కవితలు ప్రచురితమవుతూనే ఉన్నాయి. నిర్భయ ఉదంతం జరిగినప్పుడు ఆమె రాసిన ‘వజైనల్‌ మోనోలాగ్‌’, పౌరసత్వం గురించిన ‘ప్రశ్న దేశద్రోహమైంది… ఏం చేయను.?’ వంటి కవితలు ఆమె కవిత్వానికి ఏమాత్రం వాడి తగ్గలేదని నిరూపిస్తూనే ఉన్నాయి. త్వరలోనే ఆమె రాసిన కవితలన్నింటిని కూర్చి మరో పుస్తకంగానూ రావాలని కోరుకుందాం.
– నస్రీన్‌ ఖాన్‌
@ writernasreen@gmail.com