ఈ పోటీ ప్రపంచంలో ఎవరి జీవితాలు వారివిగా అయిపోయాయి. సాంకేతికత పెరిగే కొద్ది మనిషికి మనిషితో గడిపే సమయమే ఉండటం లేదు. యంత్రాలతోనే సహవాసం. కనీసం కుటుంబ సభ్యులైనా కలిసి ఒక్కరోజు కూడా గడపలేని పరిస్థితి వచ్చేసింది. ఇక బంధువులు, స్నేహితులని పలకరించే సమయం ఎక్కడుంటుంది. ఇలాంటి లోటును భర్తీ చేసేందుకే పండుగలు ఉన్నాయి. కనీసం పండుగనాడైనా కుటుంబం, బంధువులు, స్నేహితులతో కలిసి మనసారా మాట్లాడుకుంటే అందులో ఉండే ఆనందమే వేరు.
ఆనందంతో పాటు సంప్రదాయాలు, ఆచారాలు, శాంతిసహృద్భావాల మేలు కలయికే పండుగ. సాధారణంగా పండుగలన్నీ జాతి, మత పరంగా జరుపుకుంటారు. ఏడాది పొడవునా వచ్చే పండుగల్లో దేని ప్రాముఖ్యత, విశిష్టత దానికే ఉంది. భాష లేదా ప్రాంతాన్ని బట్టి పండుగలు జరుపుకొనే విధానంలో స్వల్ప తేడాలు వున్నప్పటికీ వాటిలోని ఏకసూత్రం మాత్రం ఒక్కటే. అందరూ కలిసి ఓ సమూహంగా మెలగడం. సుఖం, సంతోషం, కష్టాలు, బాధలు పంచుకోవడం. ఓదార్పు పొందడం.
కామక్రోధాలను వీడి అతిథులను, అభ్యాగ్యులను ఆదరించడమే పండుగ. తల్లిదండ్రులను, గురువులను, పెద్దలను గౌరవించి నమస్కరించడమే పండుగ. దేహానికి, మనసుకు రోగాలు రాకుండా ఉండటమే పండుగ. నాలుకపై మంచి మాట దొర్లటమే పండుగ. ఒకరిని నిందించి, అపహాస్యం చేయకపోవడమే పండుగ. కుటుంబమంతా కలసి మెలిసి ఉండుటయే పండుగ. పరుల ఉన్నతి కోరుకోవడమే పండుగ. ఈర్ష్య పడకపోవడమే పండుగ. సుజ్ఞానమును పొందుటే పండుగ. అజ్ఞాన నివృత్తియే పండుగ. ఓటమికి కుంగిపోకుండటయే పండుగ.
అలాంటి పండుగల్లో బతుకమ్మ ఒకటి. బతుకమ్మలో సమిష్టితత్వం వుంది. ప్రతి ప్రాంతంలో ప్రత్యేకంగా పెరిగే పువ్వులతో జరుపుకునే ఈ పండుగ తెలంగాణ సాంస్కృతికి ఓ ప్రత్యేక గుర్తింపు. రంగురంగుల పూలతో బతుకమ్మలు పేర్చి, వాటి చుట్టూ చేరి ఆనందంగా ఆడిపాడే మహిళా శక్తి ఉంది. తరతరాలుగా ఎదుర్కొంటున్న వివక్షను ప్రశ్నించే దిశగా మహిళలను చైతన్య పరిచే పండుగే బతుకమ్మ. ఆడపిల్లలను బతికించుకోవడమే బతుకమ్మ పండుగ. వారికి అన్నింటా సమాన అవకాశాలు కల్పించడమే బతుకమ్మ. అంతేనా ఇది ప్రకృతి పండుగ. భూమి, నీరు, మనిషి మధ్య స్వాభావిక సంబంధాన్ని తెలిపే పండుగ బతుకమ్మ. చెడుపై మంచి విజయానికి ప్రతీక అయిన ఈ పండుగను తెలంగాణ అంతటా ఓ ఉత్సవంలా జరుపుకుంటారు.
సామూహికంగా ఒకరితో ఒకరు గొంతు కలుపూ, అడుగులు వేసే ఈ పండుగలో ఇచ్చుపుచ్చుకునే ధోరణి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే ప్రతిరోజూ కాకపోయినా, మనకు చేతకాకపోయినా కనీసం పండుగరోజునైనా అనవసరమైన హంగులకు దూరంగా ఉందాం. కులం, మతం, పేద, ధనిక తేడా లేకుండా అందరూ కలిసి సమయాన్ని గడపడమే ఈ పండుగ పరమార్థం. గతంలో పండుగ అంటే బంధువులంతా కలిసి ఓ దగ్గర చేరి పిండి వంటలు చేసుకొని కడుపారా ఆరగించే వారు. కానీ ఇప్పుడు రెడీమేడ్ తిండి వచ్చిపడింది. మనకు సమయం తగ్గిపోయింది. ఇలా కొని తెచ్చుకున్న పదార్థాలతో పండుగను ఆస్వాదించలేము. ఉన్నదానిలోనే స్వయంగా వండుకొని, అందరూ కలిసి తింటేనే నిజమైన పండుగ.