మున్సిపల్స్‌లో అవిశ్వాసాల పర్వం

మున్సిపల్స్‌లో అవిశ్వాసాల పర్వం– భువనగిరి, నేరేడుచర్లలో నెగ్గిన తీర్మానాలు
– చిమిర్యాల ప్రాథమిక సహకార సంఘంలోనూ..
–  పదవులు కోల్పోయిన చైర్మెన్‌, వైస్‌ చైర్మెన్స్‌
నవతెలంగాణ-భువనగిరి/నేరేడుచర్ల
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అవిశ్వాస తీర్మానాల పర్వం కొనసాగుతోంది. మంగళవారం యాదాద్రిభువనగిరి జిల్లా భువనగిరి, సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాల్టీల్లో అవిశ్వాస తీర్మానాలు నెగ్గాయి. అలాగే, కోదాడ మండలం చిమిర్యాల ప్రాథమిక సహకార సంఘంలోనూ అవిశ్వాసం నెగ్గింది. దాంతో చైర్మెన్‌, వైస్‌ చైర్మెన్లు పదవులు కోల్పోయారు.
భువనగిరి పురపాలక సంఘం చైర్మెన్‌ ఏ.ఆంజనేయులు, వైస్‌ చైర్మెన్‌ చింతల కృష్ణయ్య అవిశ్వాసంలో పదవులు కోల్పోయారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు మంగళవారం భువనగిరి పురపాలక సంఘ కార్యాలయంలో ఆర్డీఓ పి. అమరేం దర్‌ ప్రిసైడింగ్‌ అధికారిగా అవిశ్వాస తీర్మానంపై సమావేశం నిర్వహించారు. మున్సిపాలిటీ మొత్తం 36 మంది కౌన్సిల్‌ సభ్యులు ఉన్నారు. ఈ సమావేశంలో అవసరమైన కోరం మొత్తం సభ్యులలో 24 మంది హాజరుకావాల్సి ఉండగా, 31 మంది సభ్యులు హాజరయ్యారు. చైర్మెన్‌ ఏ.ఆంజనేయులు, వైస్‌ చైర్మెన్‌ చింతల కృష్ణయ్యకు వ్యతిరేకంగా 31 మంది ఓటేశారు. అవిశ్వాస తీర్మానం నెగ్గేందుకు 2/3 వంతు సభ్యులు 24 మంది ఓటేసినా సరిపోతుంది. దీంతో చైర్మెన్‌, వైస్‌చైర్మెన్‌కు వ్యతిరేకంగా పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గిందని ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌, రెవెన్యూ డివిజనల్‌ అధికారి ప్రకటించారు. భువనగిరి మున్సిపల్‌ చైర్మెన్‌, వైస్‌ చైర్మెన్‌పై అవిశ్వాసం నెగ్గడం ద్వారా నియంత, ఏకపక్ష, అగౌరవ పాలనకు తెరపడిందని కాంగ్రెస్‌ పార్టీ మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ ప్రమోద్‌ కుమార్‌ అన్నారు. అవిశ్వాస తీర్మానం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నాలుగు ఏండ్లు గా భువనగిరి పట్టణం అనేక విధాలుగా నష్టపోయిందన్నారు. నూతన మున్సిపల్‌ చైర్మెన్‌, వైస్‌ చైర్మెన్‌లఎంపిక కూడా ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండే విధంగా జరుగుతుందన్నారు. అవిశ్వాస తీర్మానం నెగ్గడానికి సహకరించిన అఖిల పక్షాల కౌన్సిలర్లు, భువనగిరి ప్రజలు, అధికారులు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపల్‌ చైర్మెన్‌ చందమల్ల జయబాబుపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గినటు హుజూర్‌నగర్‌ ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి ప్రకటించారు. ప్రిసిడెంగ్‌ ఆఫీసర్‌గా ఆర్డీవో, మున్సిపల్‌ కమిషనర్‌ నీలికొండ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించిన అవిశ్వాస తీర్మానం సమావేశానికి 13 మంది సభ్యులు హాజరయ్యారు. మొత్తం 16 మంది ఉండగా, వైస్‌చైర్మెన్‌ చల్లా శ్రీలతరెడ్డి తన పదవికి రాజీనామా చేసిన విషయం విదితమే. ఎక్స్‌అఫిషియో సభ్యులుగా ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌, శేరి సుభాష్‌రెడ్డి, చైర్మెన్‌ చందమల్ల జయబాబు గైర్హాజరయ్యారు. వచ్చిన 13 మంది సభ్యులు అవిశ్వాసానికి మద్దతు పలకడంతో తీర్మానం నెగ్గినట్టు ఆర్డీఓ ప్రకటించారు. బీఆర్‌ఎస్‌ విప్‌ జారీ చేసినప్పటికీ ఆ పార్టీకి చెందిన ముగ్గురు కౌన్సిలర్లు లలితా భరత్‌, వేమూరి నాగవేణి, తాళ్లూరి సాయిరాం, సీపీఐ(ఎం)కు చెందిన కొదమగుండ్ల సరిత, కాంగ్రెస్‌కు చెందిన తొమ్మిది మంది కౌన్సిలర్లు అవిశ్వాసానికి మద్దతు పలికారు.
కోదాడ మండలంలోని చిమిర్యాల ప్రాథమిక సహకార సంఘం చైర్మెన్‌ ముత్తవరపు రమేశ్‌, వైస్‌ చైర్మెన్‌ గుడి పుష్పావతిపై సభ్యులు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. సొసైటీలో 13 మంది సభ్యులు ఉన్నారు. చైర్మెన్‌, వైస్‌చైర్మెన్‌ సమావేశానికి గైర్హాజరయ్యారు. 11 మంది సభ్యులు హాజరయ్యారు. ఎన్నికల అధికారి అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ నిర్వహించగా 11 మంది సభ్యులు చేతులెత్తి ఆమోదించడంతో అవిశ్వాసం నెగ్గింది.