పిండం.. మరోసారి రుజువు చేసింది

శ్రీరామ్‌, ఖుషీ రవి జంటగా నటించిన చిత్రం ‘పిండం’. ‘ది స్కేరియస్ట్‌ ఫిల్మ్‌’ అనేది ఉప శీర్షిక. ఈ సినిమాతో సాయికిరణ్‌ దైదా దర్శకుడిగా పరిచయం అయ్యారు. కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్‌ దగ్గుమాటి నిర్మించారు. ఈసినిమా ఈనెల 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలైంది. ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. రోజురోజుకి షోలు పెంచుకుంటూ విజయవంతంగా ప్రదర్శితమవుతోందీ ఈ చిత్రం. ఈ నేపథ్యంలో చిత్ర బృందం సోమవారం ప్రసాద్‌ ల్యాబ్స్‌ లో విజయోత్సవ సభను నిర్వహించింది. కథానాయకుడు శ్రీరామ్‌ మాట్లాడుతూ, ‘నిజాయితీగా సినిమా చేస్తే, దానిని గెలిపిస్తామనే నమ్మకాన్ని ప్రేక్షకులు మరోసారి ఇచ్చారు’ అని తెలిపారు. ‘సినిమా బాగుంటే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని మా చిత్రం మరోసారి రుజువు చేసింది. దర్శకుడు సాయికిరణ్‌ ఈ కథను అద్భుతంగా తెరకెక్కించారు. దాని ఫలితమే 170 స్క్రీన్‌లతో మొదలైన ఈ సినిమా, 400 లకు పైగా స్క్రీన్‌ల వరకు వెళ్ళింది. ఈ సినిమా విజయవంతమైన సందర్భంగా మా బ్యానర్‌లో రెండో సినిమాని సాయికిరణ్‌ దైదా దర్శకత్వంలో పొలిటికల్‌ డ్రామా చేస్తున్నాము’ అని నిర్మాత యశ్వంత్‌ దగ్గుమాటి చెప్పారు. దర్శకుడు సాయికిరణ్‌ దైదా మాట్లాడుతూ, ”నేను పిండం కథ మొదలు పెట్టినప్పుడు.. ఈ సినిమా థియేటర్లలో ఇంత భారీగా విడుదలవుతుంది అని ఊహించలేదు. యూఎస్‌ 120కి పైగా స్క్రీన్‌లు, ఇండియాలో 400కి పైగా స్క్రీన్‌లలో విడుదల కావడం నిజంగా గొప్ప విషయం. దీనికి కారణమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’ అని తెలిపారు.