ఉత్తర గాజాలో భీకర దాడులు

ఉత్తర గాజాలో భీకర దాడులు– హిజ్బుల్లా ఇంటెలిజెన్స్‌ ప్రధాన కార్యాలయంపై బాంబుల వర్షం
– ముగ్గురు కమాండర్లు సహా 76 మంది మృతి
బీరుట్‌ /గాజా సిటీ : ఇజ్రాయెల్‌ సైన్యం లెబనీస్‌ రాజధానిలోని ఇంటెలిజెన్స్‌ ప్రధాన కార్యాలయం, భూగర్భ ఆయుధాల తయారీ కేంద్రంపైన, ఉత్తర గాజాపైన ఇజ్రాయిల్‌ క్రూరమైన వైమానిక దాడులు జరిపి ముగ్గురు హిజ్బుల్లా కమాండర్లతో సహా 76 మందిని పొట్టనబెట్టుకుంది. లెబనాన్‌పై జరిపిన దాడిలో హిజ్బుల్లా సదరన్‌ కమాండ్‌లోని టాప్‌ కమాండర్‌ అల్హాజ్‌ అబ్బాస్‌ సలేం, కమ్యూనికేషన్స్‌ స్పెషలిస్ట్‌ రడ్జా అబ్బాస్‌ అవ్చే, హిజ్బుల్లా వ్యూహాత్మక ఆయుధాల అభివద్ధిని పర్యవేక్షిస్తున్న అహ్మద్‌ అలీ హుస్సేన్‌ చనిపోయినట్లు రాయిటర్స్‌ వార్తా సంస్థ తెలిపింది. ఇరాన్‌-మద్దతుగల బందం తన నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని తనను హత్య చేసేందుకు ప్రయత్నించిందని ఇజ్రాయెల్‌ ప్రధాన మంత్రి బెంజమిన్‌ నెతన్యాహు ఆరోపించిన కొద్ది సేపటికే హిజ్బుల్లా దక్షిణ బీరుట్‌ కోటపై భీకర దాడులు జరిగాయి. అదే సమయంలో ఉత్తర గాజాలో బీట్‌ లాహియాపై జరిపిన ఈ దాడుల్లో 73 మంది పాలస్తీనియన్లు చనిపోయారు. . గాజా, లెబనాన్‌లలో మొత్తం 175” లక్ష్యాలపై ఇజ్రాయిల్‌ వైమానిక దాడులు చేసింది. ”నన్ను , నా భార్యను హత్య చేసేందుకు ఇరాన్‌ అనుబంధ సంస్థ హిజ్బుల్లా చేసిన ప్రయత్నం ఘోర తప్పిదం” అని ఇజ్రాయిల్‌ ప్రధాని నెతన్యాహు అన్నారు. ఇజ్రాయెల్‌ దళాలు బుధవారం గాజాలో పాలస్తీనా ఉద్యమ నాయకుడు యాహ్యా సిన్వార్‌ను హతమార్చిన తర్వాత ఈ ప్రాంతంలో హమాస్‌, హిజ్బుల్లా, ఇరాన్‌-మద్దతుగల గ్రూపులు తమ శత్రువుపై పోరాటం కొనసాగు తుందని ప్రకటించాయి.
పాలస్తీనాలో హమాస్‌ అనేది ఎవరూ విస్మరించలేని వాస్తవం, దానిని ఎవరూ నాశనం చేయలేరు” అని ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాఘి అన్నారు.
ఇజ్రాయెల్‌ ఉత్తర గాజాలో రెండు వారాల్లో 450 మందిని పొట్టనబెట్టుకుంది.. దీంతో గాజాలో మొత్తం మరణాల సంఖ్య 42,519కి చేరుకుంది. జబాలియాలోని సహాయక శిబిరంపై జరిగిన దాడిలో 10 మంది మరణించారు.
హిజ్బుల్లా టన్నెల్‌ నెట్‌వర్క్‌పై ఇజ్రాయిల్‌ గురి కొన్ని కిలోమీటర్ల పొడవైన సొరంగాల నెట్‌వర్క్‌ను ఇజ్రాయిల్‌ సైన్యం గుర్తించింది. వీటిలో వందలాది మంది హిజ్బుల్లాలు తలదాచుకోవచ్చు.. ఇక్కడ అవసరమైన ఆహార పదార్థాలను నిల్వ చేస్తారు. నీరు, విద్యుత్‌ సౌకర్యం కల్పిస్తారు. ఆయుధాలను పంపిణీ చేసే సదుపాయం కూడా ఉంది. సొరంగాలను ధ్వంసం చేసేందుకు లేదా వాటిని సిమెంటుతో కప్పేందుకు ప్రయత్నిస్తున్నారని ఇజ్రాయెల్‌ ఇంటెలిజెన్స్‌ అధికారి ఒకరు తెలిపారు.2006లో ఇజ్రాయెల్‌తో జరిగిన యుద్ధంలో హిజ్బుల్లా తొలిసారిగా సొరంగాలను ఉపయోగించింది. తర్వాత ఆ నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేసింది. ట్రక్కులు క్షిపణులుగా వెళ్లగల భారీ సొరంగాల వీడియోలను హిజ్బుల్లా విడుదల చేసింది.