ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటం

పీసీసీ అధికార ప్రతినిధి నాయిని యాదగిరి
నవతెలంగాణ-గజ్వేల్‌
తెలంగాణ ప్రభుత్వ విధానాలపై పోరాటం మరింత ఉధ్రుతం చేస్తామని పీసీసీ అధికార ప్రతినిధి నాయిని యాదగిరి అన్నారు. గురువారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ గత తొమ్మిది సంవత్సరాలుగా రాష్ట్రంలో రైతులను ప్రభుత్వం పట్టించుకోలేదని పేర్కొన్నారు. రైతు సంక్షేమాన్ని పూర్తిగా విస్మరిస్తుందన్నారు. ప్రాజెక్టుల పేరిట ప్రభుత్వ ధనం లూటీ చేస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి చేపట్టిన అభివద్ధి పనులకు తెలంగాణ ప్రభుత్వం నిధులు పెంచుకొని ప్రాజెక్టులు నిర్మిస్తున్నామన్నారు. గ్రామాల్లో కరెంటు కోతలు, వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు గోన సంచులు ఇవ్వడం లేదన్నారు. రైస్‌ మిల్లులు రైతులను ఇబ్బందులు గురి చేస్తున్నారన్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతుకు అన్నిట్లో మోసం జరుగుతుందన్నారు. పంట నష్టాన్ని అధికారులు ఇప్పటివరకు అంచనా వేయలేకపోయారన్నారు. జిల్లాలో భారీగా నష్టపోయినట్లు ఆయన చెప్పారు. గజ్వేల్‌లో పెండింగ్‌లో ఉన్న అభివద్ధి పనులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక దష్టి పెట్టాలని కోరారు. మూడు నాలుగు సంవత్సరాలుగా ఒక కిలోమీటర్‌ రోడ్డు కోట మైసమ్మ రోడ్డును అధికారులు, పాలకులు చేయలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. కోట మైసమ్మ రోడ్డు విషయంలో ఇండ్లు కోల్పోతున్న వారందరూ ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు. ప్రతి ఒక్కరికి కుటుంబంలో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు.