సామాజిక, ఆర్థిక అసమానతలపై కలిసి పోరాడాలి

Social and economic inequality should be fought together– మార్క్స్‌, అంబేద్కర్లు మన మార్గదర్శకులు పుస్తకావిష్కరణలో
– బీ.వీ.రాఘవులు, జే.బీ.రాజు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సామాజిక, ఆర్థిక అసమానతలపై కలిసి పోరాటం చేయాల్సిందేనని సీపీఐ(ఎం) పొలిట్‌ బ్యూరో సభ్యులు బీ.వీ.రాఘవులు, సీనియర్‌ అంబేద్కరిస్టు జే.బీ.రాజు అభిప్రాయపడ్డారు. లాల్‌-నీల్‌ మైత్రి వేదిక ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో వారు మార్క్స్‌-అంబేద్కర్‌ మన మార్గదర్శకులు అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. మొదటి ప్రతిని ఎంసీపీఐ (యు) ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్‌ ఓంకార్‌కు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంఫ్‌ పరివార్‌ శక్తుల మనువాద పోకడలు, ఫాసిజం ప్రమాదం ఎదుర్కొనేందుకు మార్క్సిస్టులు, అంబేద్కరిస్టులు నేటితరంలో చైతన్యం పెంచాల్సిన అవసరముందని తెలిపారు.
బీ.వీ.రాఘవులు మాట్లాడుతూ కుల, వర్గ వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో కమ్యూనిస్టులు, అంబేద్కరిస్టులతో పాటు అన్ని రకాల అణచివేతల వ్యతిరేక పోరాట శక్తులతో ఐక్యంగా ముందుకెళ్లాలని సూచించారు. లాల్‌-నీల్‌ మైత్రి భావన మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేస్తూనే అదే సమయంలో అణచివేతకు గురవుతున్న వారంతా మన మిత్రులేనని తెలిపారు. అణచివేత, దోపిడీ వ్యవస్థలకు పరస్పరం సంబంధం కలిగి ఉన్నాయనీ, దోపీడీ వ్యవస్థలు కులాన్ని అంతం కాకుండా కాపాడుతున్నదని తెలిపారు. పితృస్వామిక వ్యవస్థను నిర్మూలించకుండా కులవ్యవస్థను నిర్మూలించలేమని తెలిపారు. అందుకే కుల, వర్గ వ్యవస్థలకు వ్యతిరేకంగా రెండు పోరాటాలు కొనసాగాల్సిం దేననీ, ఆయా సందర్భాలను బట్టి పోరాటాల ప్రాధాన్యతలుంటాయని వివరించారు. కారంచేడు లాంటి సందర్భాల్లో కులవ్యవస్థపై, సమ్మె జరిగే సందర్భాల్లో వర్గపోరాటం ప్రాధాన్యతగా ఉంటుందని ఉదహరించారు.
బీజేపీని ఓడించడం చిన్న మజిలీ అన్నారు. మనువాదాన్ని ఓడించేందుకు దీర్ఘకాలిక పోరాటం గురించి ఆలోచించాలని సూచించారు. ఆర్‌ఎస్‌ఎస్‌పై పోరాటం అంత సులభమేమి కాదనీ, దాని ప్రభావం దక్షిణాది కన్నా ఉత్తరాదిలో చాలా ఎక్కువగా ఉన్నదని తెలిపారు. విప్లవం రావాలంటే కుల, పితృస్వామిక వ్యవస్థలపై పోరాటం తప్పనిసరి అని రాఘవులు తెలిపారు. వాటిని విస్మరించి వర్గపోరాటం సాధించలేమనీ, రెండూ మిళితంగా సాగాల్సిందేన్నారు.
జే.బీ.రాజు మాట్లాడుతూ అణగారిన వర్గాల విముక్తికి అంబేద్కర్‌, మార్క్స్‌ ఇద్దరూ అవసరమని అభిప్రాయపడ్డారు. భారతదేశంలో విప్లవం సాధించడానికి కులం పెనుభూతంలా అడ్డుపడుతున్నదన్న అంబేద్కర్‌ మాటలను ఉటంకించారు. అంబేద్కర్‌ ఏనాడూ మార్క్సిజాన్ని గానీ, కమ్యూనిస్టులను గానీ వ్యతిరేకించలేదని తెలిపారు. కమ్యూనిస్టులతో కలిసి అంబేద్కర్‌ పోరాడిన సందర్భాలున్నాయని గుర్తుచేశారు. వర్కర్ల హక్కుల పోరాటంలో వారివురు కలిసి పోరాడారని తెలిపారు. సోషలిస్టులతో కలిసి అంబేద్కర్‌ తన చరమాంకంలో పార్టీ పెట్టాలని ప్రయత్నించారన్నారు.
పాలక వర్గాలు మళ్లీ మనువును, గోల్వాళ్కర్‌ను తెస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగం మార్చే పెనుప్రమాదం ఆపాలంటే మార్క్సిస్టులు, అంబేద్కరిస్టులు కలిసి పోరాడాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ సభలో మద్దికాయల అశోక్‌ ఓంకార్‌, ప్రొఫెసర్‌ కాశీం, గాదె ఇన్నయ్య, ఎంసీపీఐ (యు) రాష్ట్ర కార్యదర్శి గాదెపల్లి రవి, టీపీఎస్కే అధ్యక్షులు జి.రాములు, బీసీ సాధికారత నాయకులు ఇంద్రవెల్లి రమేష్‌, కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్‌ బాబు మాట్లాడారు. కార్యక్రమంలో పుస్తక ఆవిష్కరణ కమిటీ సభ్యులు నల్లా సూర్యప్రకాష్‌, బొజ్జా భిక్షమయ్య, వనం సుధాకర్‌ పాల్గొన్నారు. చంద్రశేఖర్‌ లాల్‌-నీల్‌ మైత్రి వేదిక ఆవిర్భావం, ఆవశ్యకత, ఉద్దేశాలను వివరించారు.