– వర్ధంతి సభలో కేవీపీఎస్, డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
గొప్ప విప్లవకారుడు, స్వాతంత్య్ర సమరయోధుడు చంద్రశేఖర్ ఆజాద్ స్ఫూర్తితో దేశంలో ఆజాదీ కోసం పోరాడాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్‌బాబు, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి టి నాగరాజు పిలుపునిచ్చారు. మంగళశారం హైదరాబాద్‌లో ఆజాద్ 93వ వర్ధంతి సభను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రిటీష్ దొరలకు వ్యతిరేకంగా భగత్‌సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురు, పండిత్ రామ్ ప్రసాద్ బిస్మిల్, ఠాకూర్ రోషన్‌సింగ్, ప్రేమ్‌కిషన్ ఖన్నా, అష్పాకుల్లా ఖాన్ సహచరత్వంతో ఆజాద్ చిన్న వయసులోనే స్వాతంత్య్రం కోసం పోరాటం చేశారని గుర్తు చేశారు. దేశం గర్వించదగ్గ ఉద్యమకారుల్లో ఆయనొకరని అన్నారు. అనేక మంది యువకులను దేశభక్తులుగా తీర్చిదిద్దారని చెప్పారు. సోషలిస్టు భావాలతో దేశంలో అసమానతలు, దోపిడీ లేని సమాజం కోసం బ్రిటీష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడారని అన్నారు. ఆజాద్ స్ఫూర్తితో సామ్రాజ్యవాద ఏజెంట్లు, మతోన్మాదులు మోడీ, షాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. దేశంలో నిరుద్యోగం, ధరలు పెరుగుతున్నాయనీ, రైతులు ఆందోళనలో ఉన్నారనీ, కార్మిక చట్టాలను సవరిస్తున్నారనీ, దేశాన్ని అంబానీ, అదానీలకు దోచిపెడుతున్నారని విమర్శించారు. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు జూనుగరి రమేష్, కేవీపీఎస్ రాష్ట్ర ఆఫీసు కార్యదర్శి బాలపీర్ తదితరులు పాల్గొన్నారు.