పసికూనతో పోరు

– నేడు భారత్‌, నేపాల్‌ మ్యాచ్‌
– పొంచి ఉన్న వర్షం ముప్పు
మధ్యాహ్నాం 3 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో…
పాకిస్థాన్‌ పోరు వర్షార్పణం కాగా.. ఇప్పుడు పసికూనపై పంజా విసిరేందుకు టీమ్‌ ఇండియా సిద్ధమైంది. అగ్రజట్టు భారత్‌ను తొలిసారి ఎదుర్కొంటున్న నేపాల్‌ అత్యుత్తమ ప్రదర్శన కనబరచాలనే తపనలో ఉంది. ఆటకు అంతరాయం కలిగించేందుకు వరుణుడు మరోసారి స్టేడియంలోకి ప్రవేశించేందుకు ఎదురు చూస్తున్నాడు. వర్షం ప్రమాదం నేపథ్యంలో మ్యాచ్‌లో ఫలితం తేలకుంటే టీమ్‌ ఇండియా నేరుగా సూపర్‌ 4కు అర్హత సాధించనుంది.

నవతెలంగాణ-పల్లెకల్‌
ఆటకు అంతరాయం కలిగించేందుకు వరుణుడు ఎదురు చూస్తుండగా.. పసికూనతో పోటీకి టీమ్‌ ఇండియా సై అంటోంది. నేపాల్‌ క్రికెట్‌ చరిత్రలోనే ఆ జట్టు అతిపెద్ద మ్యాచ్‌కు రెఢ అయ్యింది. నేపాల్‌ క్రికెట్‌ జట్టు మ్యాచ్‌ను తొలిసారి కోట్లాది మంది వీక్షించనున్నారు. దీంతో అగ్ర జట్టు, సూపర్‌స్టార్‌ క్రికెటర్లతో పోటీపడేందుకు నేపాల్‌ క్రికెటర్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పాకిస్థాన్‌తో పోరు అసంపూర్తిగా ముగియగా.. నేపాల్‌పై తిరుగులేని విజయంతో సూపర్‌ 4లో అడుగుపెట్టాలని రోహిత్‌సేన భావిస్తుంది. ఆసియా కప్‌ గ్రూప్‌-ఏలో భారత్‌, నేపాల్‌ పోరు నేడే.
బుమ్రా లేకుండానే..
భారత పేస్‌ దళపతి జశ్‌ప్రీత్‌ బుమ్రా.. నేడు నేపాల్‌తో మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఐర్లాండ్‌ పర్యటన అనంతరం నేరుగా వన్డే జట్టులోకి వచ్చిన బుమ్రాకు పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో బంతి అందుకునే అవకాశం రాలేదు. ఇప్పుడిప్పుడే పూర్తి ఫిట్‌నెస్‌ సాధించిన బుమ్రాను నేపాల్‌తో మ్యాచ్‌కు బెంచ్‌కు పరిమితం చేయనున్నారు. సూపర్‌ 4 దశకు బుమ్రా అందుబాటులోకి రానున్నాడు. వ్యక్తిగత కారణాలతో బుమ్రా స్వదేశానికి తిరిగి రాగా.. అతడి స్థానంలో మహ్మద్‌ షమి తుది జట్టులో చోటు సాధించనున్నాడు. తెలుగు తేజం తిలక్‌ వర్మ, సూర్య కుమార్‌ యాదవ్‌లకు అవకాశం ఇవ్వాలని అనుకుంటే తప్పితే.. బ్యాటింగ్‌ లైనప్‌లో ఎటువంటి మార్పులు ఉండే అవకాశం లేదు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో, ఒత్తిడిని జయిస్తూ పాక్‌పై అద్భుత ఇన్నింగ్స్‌ నమోదు చేసిన ఇషాన్‌ కిషన్‌.. తుది జట్టులో చోటు సుస్థిరం చేసుకునే పనిలో నిమగమయ్యాడు. నేపాల్‌పై విధ్వంసక ఇన్నింగ్స్‌పై కిషన్‌ గురి పెట్టాడు. చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ ఈ ఏడాది సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. ప్రపంచ శ్రేణి స్పిన్నర్‌ కుల్దీప్‌ మాయ ముంగిట నేపాల్‌ బ్యాటర్లు నిలువటం కష్టమే.
ఉత్సాహం డబుల్‌
అసోసియేట్‌ జట్టు నేపాల్‌.. ఆట పరంగా దేశవాళీలో రంజీ జట్టుతో సైతం పోటీపడలేదు. కానీ ఇటీవల కాలంలో ఆ జట్టు గొప్ప పురోగతి సాధించింది. భారత్‌ వంటి అగ్రజట్టుతో ఆడటంతో నేపాల్‌ క్రికెటర్ల ఆత్మవిశ్వాసం రెట్టింపు కానుంది. విజయంపై ఆశ లేకపోయినా.. అగ్ర జట్టు, సూపర్‌స్టార్‌ క్రికెటర్లతో ఆడే అవకాశం దక్కిందనే ఆనందంలో నేపాల్‌ శిబిరం కనిపిస్తుంది. యువ క్రికెటర్‌ రోహిత్‌ (21) నాయకత్వంలో.. నేపాల్‌ అతిపెద్ద మ్యాచ్‌కు సిద్ధమైంది. యువ స్పిన్నర్‌ లలిత్‌ గొప్పగా రాణిస్తున్నాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో సైతం లలిత్‌ 33 డాట్‌ బాల్స్‌ సంధించాడు. నేడు సందీప్‌తో కలిసి భారత బ్యాటర్లకు సవాల్‌ విసిరేందుకు లలిత్‌ సిద్ధమవుతున్నాడు.
వరుణుడు వస్తాడని..!
ముత్తయ్య మురళీధరన్‌ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో వరుసగా రెండో మ్యాచ్‌కు వరుణుడు రానున్నాడు. వర్షం కారణంగా భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌ ఫలితం తేలకుండా ముగియగా.. నేడు భారత్‌, నేపాల్‌ మ్యాచ్‌లోనూ అవే పరిస్థితులు పునరావృతం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వర్షం ముప్పు పొంచి ఉన్న తరుణంలో బ్యాటర్లకు ఇటు పిచ్‌ నుంచి, ఇటు వరుణుడు నుంచి కష్టాలు తప్పకపోవచ్చు. టాస్‌ నెగ్గిన జట్టు తొలుత బ్యాటింగ్‌ ఎంచుకునే అవకాశం కనిపిస్తుంది.
తుది జట్లు (అంచనా) : భారత్‌ : రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌ కీపర్‌), హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా, శార్దుల్‌ ఠాకూర్‌, కుల్దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ షమి, మహ్మద్‌ సిరాజ్‌.
నేపాల్‌ : కుశాల్‌ భుర్తెల్‌, ఆసిఫ్‌ షేక్‌ (వికెట్‌ కీపర్‌), రోహిత్‌ పాడెల్‌ (కెప్టెన్‌), ఆరిఫ్‌ షేక్‌, సోంపాల్‌ కామి, దీపేంద్ర సింగ్‌, గుల్షాన్‌ , కుశాల్‌ మల్ల, కరణ్‌ కెసి, సందీప్‌, లలిత్‌ రాజ్‌భన్సీ.
స్వదేశానికి బుమ్రా: భారత పేస్‌ దళపతి జశ్‌ప్రీత్‌ బుమ్రా స్వదేశానికి పయనమయ్యాడు. ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో తుది జట్టులో నిలిచిన బుమ్రా.. గ్రూప్‌ దశలో నేపాల్‌తో మ్యాచ్‌కు ముందు ఇంటికి వచ్చాడు. కుటుంబ, వ్యక్తిగత కారణాలతోనే బుమ్రా స్వదేశానికి వచ్చినట్టు టీమ్‌ ఇండియా వర్గాలు వెల్లడించాయి. గాయం నుంచి పూర్తిగా కోలుకున్న జశ్‌ప్రీత్‌ బుమ్రా.. ప్రస్తుతం మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ సాధించాడని సూపర్‌ 4 దశకు తిరిగి జట్టుతో చేరుతాడని సమాచారం.