– నేడు భారత్, ఐర్లాండ్ మ్యాచ్
– బ్యాటింగ్ లైనప్ కూర్పుపై ఆసక్తి
– రాత్రి 8 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
ఐసీసీ టీ20 ప్రపంచకప్ తొలి చాంపియన్ టీమ్ ఇండియా.. 2024 ప్రపంచకప్ టైటిల్ వేటను నేడు మొదలెట్టనుంది. గ్రూప్-ఏలో పసికూన ఐర్లాండ్‌తో భారత్ నేడు తలపడనుంది. న్యూయార్క్ నయా స్టేడియంలో మెత్తని మైదానం, వాతావరణ పరిస్థితులే రోహిత్ సేనకు సవాల్‌గా నిలువనున్నాయి!. పసికూనతో మ్యాచ్‌ను తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. భారత బ్యాటింగ్ లైనప్ కూర్పుపై ఆసక్తి నెలకొంది. భారత్, ఐర్లాండ్ పోరు నేడు.
నవతెలంగాణ-న్యూయార్క్
న్యూయార్క్ కొత్త స్టేడియం పిచ్, అవుట్‌ఫీల్డ్‌పై విమర్శలు రేగుతున్న వేళ టీమ్ ఇండియా టీ20 ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌కు రంగం సిద్ధం చేసుకుంది. మెత్తని పిచ్‌తో క్రికెటర్లు కండరాల గాయానికి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉందని టీమ్ ఇండియా చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సైతం ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ క్రికెటర్లు సైతం న్యూయార్క్ మైదానం నాణ్యతపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ స్టేడియంలోనే గ్రూప్ దశలో ఏకంగా మూడు మ్యాచులు ఆడనున్న టీమ్ ఇండియాకు ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడటం అసలు సవాల్‌గా నిలువనుంది. బంగ్లాదేశ్‌తో వార్మప్ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షో చూపించిన భారత్.. నేడు ఐర్లాండ్‌పై ఏకపక్ష విజయంపై కన్నేసింది.
యశస్వికి చోటు దక్కేనా?
భారత బ్యాటింగ్ లైనప్ కూర్పుపై ఆసక్తి కనిపిస్తుంది. యువ బ్యాటర్, విధ్వంసకారుడు యశస్వి జైస్వాల్‌కు అవకాశం ఇస్తారా? లేదా అనేది తేలాల్సి ఉంది. ఐపీఎల్ ముందు వరకు ఓపెనర్‌గా బెర్త్ ఖాయం చేసుకున్న జైస్వాల్‌కు విరాట్ కోహ్లి నుంచి చెక్ ఎదురైంది. శుభ్‌మన్ గిల్‌ను కాదని ఓపెనర్‌గా జట్టులోకి వచ్చిన యశస్వి జైస్వాల్.. ఇప్పుడు బెంచ్‌కు పరిమితం అవుతాడా? నం.3 బ్యాటర్‌గా జైస్వాల్‌ను వాడుకునే ఆలోచన ఉందా? అనేది ఆసక్తికరం. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్‌లకు తోడు హార్దిక్ పాండ్య మంచి ఫామ్‌లో ఉన్నారు. వార్మప్ మ్యాచ్ ప్రదర్శనతో నిరాశపరిచిన సంజు శాంసన్ తుది జట్టులో నిలిచేది అనుమానమే. శివం దూబె సైతం రేసులో నిలిచినా బెంచ్‌కు పరిమితం అయ్యే అవకాశాలే ఎక్కువ. బుమ్రాకు తోడుగా అర్షదీప్, సిరాజ్‌లలో ఎవరు ఉంటారో చూడాలి. స్పిన్నర్లలో కుల్దీప్, చాహల్ ఇద్దరు ఆడతారా, ఒకరికే అవకాశం ఇస్తారా అనేది తేలాల్సి ఉంది.
కూనతో జాగ్రత్త
ఐర్లాండ్ పసికూన జట్టే. కానీ ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో ఎవరినీ తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. గతంలో చిన్న జట్ల చేతిలో దెబ్బతిన్న అనుభవాలను భారత్ మరచిపోలేదు. అగ్రజట్టు భారత్‌కు గట్టి పోటీ ఇవ్వాలనే తహతహ ఐర్లాండ్‌లోనూ కనిపిస్తుంది. బ్యాటర్లలో ఆండీ బాల్‌బిర్నె, లార్కన్ టక్కర్.. బౌలర్లలో మార్క్ ఎడెర్, క్రెయిగ్ యంగ్‌లు ఐర్లాండ్‌కు కీలకం కానున్నారు.